అటు మారి.. ఇటు మారి చివరికి ఎంపీపీ పదవికి రాజీనామా!

by Disha Web Desk 4 |
అటు మారి.. ఇటు మారి చివరికి ఎంపీపీ పదవికి రాజీనామా!
X

దిశ, మిడ్జిల్: ఒక పార్టీ నుండి గెలిచి.. ఎంపీపీ పదవిని చేపట్టి.. ఆ తర్వాత అధికార పార్టీలో చేరి.. ఆపై తిరిగి సొంత గూటికి చేరిన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల పరిషత్ అధ్యక్షురాలు కాంతమ్మ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. వివరాలలోకి వెళితే.. మిడ్జిల్ మండలంలో మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు గాను నాలుగు కాంగ్రెస్, నాలుగు బీఆర్ఎస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేసిన ఎంపీపీ స్థానాన్ని బీజేపీ ఎంపీటీసీకి వైస్ ఎంపీపీ పదవిని ఇచ్చి, ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంపీపీగా కాంతమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మండలం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీలో చేరాలని సన్నిహితుల ఒత్తిడి రావడంతో ఆమె బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. తనకు అధికార పార్టీలో సరైన ప్రాధ్యాన్యత లేదని ఆరోపణలు చేస్తూ ఐదు నెలల క్రితం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరింది.

మళ్లీ ఏం సమస్యలు తలెత్తయో కానీ కాంతమ్మ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓకు అందజేశారు. ఎంపీపీ రాజీనామా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై దిశ కాంతమ్మను వివరణ కోరగా తన పదవికి రాజీనామా చేసింది నిజమేనని... ఈ విషయంపై తాను ఏమీ మాట్లాడలేను అని చెప్పింది. కాగా ఎస్సీ రిజర్వ్ స్థానం వడియాల్ ఎంపీటీసీగా గెలుపొందిన సుదర్శన్‌కు ఎంపీపీగా అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed