TS: ఎక్స్ గ్రేషియాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Disha Web Desk 2 |
TS: ఎక్స్ గ్రేషియాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అడవుల పరిరక్షణలో భాగంగా విధుల్లో ఉన్న సిబ్బంది తీవ్రవాదులు లేదా అసాంఘిక శక్తుల చేతుల్లో చనిపోతే ప్రభుత్వం తరఫున నష్టపరిహారం (ఎక్స్ గ్రేషియా) అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. అటవీ శాఖలో స్థాయికి తగినట్లుగా స్కేల్‌ను ఫిక్స్ చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ సైతం అనుమతి ఇవ్వడంతో జిల్లా కలెక్టర్లు వెంటనే అమలు చేయాల్సిందిగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా అటవీ సిబ్బంది అడవుల్లోకి వెళ్లాల్సి వస్తున్నదని, తీవ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు దాడి చేసినప్పుడు వెంటనే ఆదుకోడానికి అందుబాటులో పోలీసులు లేదా అటవీ సిబ్బంది అందుబాటులో ఉండడంలేదని, ఫలితంగా తీవ్ర గాయాలతో పాటు మృత్యువాత పడుతున్నారని పీసీసీఎఫ్ ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.

దీనికి సానుకూల స్పందన రావడంతో అటవీశాఖ విధాన నిర్ణయం తీసుకున్నది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఫారెస్టు బీట్ ఆఫీసర్ లేదా సమానమైన హోదా కలిగిన సిబ్బంది చనిపోతే రూ. 30 లక్షలు, అంగవైకల్యం పొందితే రూ. 20 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం నుంచి పొందనున్నారు. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హోదాలోని వారికి రూ. 45 లక్షలు, రూ. 25 లక్షలు, రూ.5 లక్షల చొప్పున అందుతుంది. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులకు రూ. 50 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 5 లక్షల చొప్పున అందుతుంది. అసిస్టెంట్ లేదా డిప్యూటీ కన్జర్వేటర్ స్థాయి అధికారులకు రూ. 75 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 5 లక్షల చొప్పున అందుతుంది. ఒకవేళ ఐఎఫ్ఎస్ అధికారి స్థాయిలో చనిపోతే కోటి రూపాయలు, రూ. 50 లక్షలు, రూ. 6 లక్షల చొప్పున అందుతుంది.



Next Story

Most Viewed