నేడే.... కేసీఆర్ సంచలన ప్రకటనకు రంగం సిద్ధం

by Disha Web Desk 4 |
నేడే.... కేసీఆర్ సంచలన ప్రకటనకు రంగం సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయపార్టీని తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ ప్రకటించబోతున్నారు. అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరారోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ ఆపార్టీ కార్యవర్గమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయనుంది. మూకుమ్మడిగా ఆమోదం తెలుపునుంది. మధ్యాహ్నం 1.19గంటలకు జాతీయపార్టీ బీఆర్ఎస్ గా కేసీఆర్ ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే గులాబీకలర్ జెండా, ఎన్నికల గుర్తుగా కారు ఎలాగైతే ఉందో అదే తరహాలో బీఆర్ఎస్ కు ఉండనున్నాయి. పార్టీజెండా, ఎజెండాను టీఆర్ఎస్ఎల్పీ, కార్యవర్గ సమావేశంలో సీఎం వివరించనున్నారు.

కేసీఆర్‌కు దైవభక్తి, సెంటిమెంట్లు ఎక్కువ. ఏ శుభకార్యం తలపెట్టినా మంచిరోజు, మంచిఘడియ చూసుకుంటారు. అన్ని కుదిరితేనే ముందుకు సాగుతారు. దసరా రోజు గ్రహాలు అన్ని బాగున్నాయని వేదపండితుల సూచన మేరకు జాతీయపార్టీని దసరా రోజున ప్రకటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. అనంతరం టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రెండు సమావేశాలకు రాష్ట్రంలోని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లాపార్టీ అధ్యక్షులు, డీసీఎంఎస్, డీసీసీబీ, మంత్రులు కలిసి 283 మంది పాల్గొంటున్నారు. మొత్తం సుమారు 300లకుపైగా పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈ సమావేశం సింగిల్ ఎజెండాతోనే సాగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేసేందుకే సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తీర్మానంను ప్రవేశపెట్టగా సభ్యులు సంతకాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించనున్నారు. మధ్యాహ్నం 1.19గంటలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయపార్టీగా బీఆర్ఎస్ ను ప్రకటించనున్నారు. ప్రకటన వెలువడగానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతోపాటు తెలంగాణ భవన్ ఎదుట, అదే విధంగా పలు రాష్ట్రాల్లో సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అతిధులుగా కుమారస్వామి, తిరుమాళవన్, వైగో

కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటిస్తున్న నేపథ్యంలో పలురాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలను ఆహ్వానించారు. కానీ ఇద్దరు మాత్రమే ఖరారు అయింది. వారు రాష్ట్రానికి వచ్చారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విదుతలి చిరుతైగల్ కచి పార్టీ ఆధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అదే విధంగా తమిళనాడు ఎండీఎంకే సెక్రటరీ జనరల్ వైగో సైతం వచ్చారు. వారికి బస ఏర్పాట్లు చేశారు. జాతీయపార్టీ ప్రకటన సమయంలో కేసీఆర్ వెంటే ఉండనున్నారు.

పార్టీ జెండా, ఎన్నికల గుర్తు టీఆర్ఎస్ తరహాలోనే..

జాతీయపార్టీకి జెండా, ఎజెండా టీఆర్ఎస్ తరహాలోనే ఉండనుంది. గులాబీ కలర్ లో పార్టీ జెండా ఉంటుందని, కారు గుర్తు ఉంటుంది. మ్యాప్ ను మాత్రం తెలంగాణ స్థానంలో దేశ మ్యాప్ ఉండేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి సైతం ఇప్పటికే సూచించినట్లు తెలిసింది. తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించే సమావేశంలోనే కేసీఆర్ పార్టీ ఎజెండాను సైతం వివరించే అవకాశం ఉంది. గంటన్నరపాటు జాతీయపార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది నేతలు వివరించనున్నారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు, ప్రధానంగా రైతు కేంద్రంగానే జాతీయరంగ ప్రవేశం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు, కేంద్రం అనుసరిస్తున్న విధానం, విద్యుత్, తాగునీరు, పారిశ్రామిక రంగం, వనరుల వినియోగం, యువతకు ఉపాధి కల్పన ఎజెండాతోనే ముందుకు సాగుతున్నామని పార్టీ కేడర్ కు వివరించే అవకాశం ఉంది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు ఎలా వివరించాలనేదానిపై సైతం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

త్వరలోనే ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటనలు...

త్వరలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు దేశంలోని అన్ని రాష్ట్రాల పర్యటనలు చేయనున్నారు. అందుకు అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కేసీఆర్ పర్యటనలపై సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో అమలుఅవుతున్న కల్యాణలక్ష్మీ, వ్యవసాయరంగానికి 24 గంటల కరెంటు, రైతుబంధు, బీమా, పరిశ్రమలకు ఇస్తున్న రాయితీ, విద్యారంగానికి చేస్తున్న కృషిని సైతం రాష్ట్రాల పర్యటనలో వివరించనున్నారు.


Next Story

Most Viewed