రెండో రోజు సాగిన ఈడీ విచారణ

by Disha Web Desk 12 |
రెండో రోజు సాగిన ఈడీ విచారణ
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఈడీ విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. ఉదయం 11.30గంటల సమయంలో చంచల్​గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డిలను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. రెండో రోజు కూడా ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపైనే విచారణ జరిగినట్లు సమాచారం. బోర్డు ఉద్యోగులైన ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి కలిసి గ్రూప్​1 ప్రిలిమ్స్ ​తో పాటు ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల సెట్లను కాన్ఫిడెన్షియల్ ​రూంలోని కంప్యూటర్​ను హ్యాక్​చేసి కొట్టేసిన విషయం తెలిసిందే.

ఏఈఈ సివిల్, జనరల్ ​నాలెడ్జ్‌​తో పాటు డీఏఓ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ప్రవీణ్​నేరుగా అమ్ముకున్నట్టుగా ఇప్పటికే సిట్ ​విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో అతనికి మొత్తం పదహారు లక్షల రూపాయలు అందినట్టుగా తేలింది. ఈ అంశంపైనే ఈడీ అధికారులు ప్రవీణ్​ను ప్రశ్నిస్తూ లావాదేవీలు ఎలా జరిగాయని ప్రశ్నించినట్లు తెలిసింది. పది లక్షల రూపాయలను నగదు రూపంలో తీసుకున్నానని, డీఏఓ పేపర్​కు సంబంధించి దానిని కొన్న లౌకిక్ ​ఆరు లక్షల రూపాయలను తన బ్యాంక్​ అకౌంట్​లో వేసాడని ప్రవీణ్​ చెప్పినట్టుగా సమాచారం. ఇక, రాజశేఖర్​రెడ్డి తాను గ్రూప్​1 ప్రిలిమ్స్​ప్రశ్నాపత్రాన్ని న్యూజీలాండ్​లో ఉంటున్న తన బావ ప్రశాంత్​రెడ్డికి ఇచ్చానని, అతని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించినట్టు తెలియవచ్చింది.

ఇదిలా ఉండగా ప్రవీణ్​నుంచి ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్​పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల సెట్​ను పది లక్షల రూపాయలకు కొన్న గురుకుల టీచర్​రేణుక వాటిని తన భర్త లద్యావత్​డాక్యానాయక్​కు ఇచ్చినట్టు సిట్​ దర్యాప్తులో తేలింది. డాక్యానాయక్ ​వాటిని తన బావమరిది అయిన రాజేశ్వర్​ నాయక్​కు ఇవ్వగా అతను గోపాల్​నాయక్, నీలేష్​నాయక్​లకు పదమూడున్నర లక్షల రూపాయలకు అమ్మినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్​ నాయక్​లను కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కోర్టులో పిటిషన్​దాఖలు చేయనున్నట్టు తెలిసింది.


Next Story

Most Viewed