బీజేపీ శ్రేణులతో కిక్కిరిసిన పరేడ్ మైదానం..

by Disha Web Desk 11 |
బీజేపీ శ్రేణులతో కిక్కిరిసిన పరేడ్ మైదానం..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: సికింద్రాబాద్ పరేడ్ మైదానం బీజేపీ శ్రేణులతో కిక్కిరిసింది. భారత ప్రధాని నరేంద్ర సభ సందర్భంగా శనివారం మైదాన పరిసరాలు కాషాయమయంగా మారాయి. వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, బీజేపీ జెండాలు, ప్లెక్సీలు పార్టీ కండువాలు ధరించి సభా స్థలికి చేరుకున్నారు. జై శ్రీ రామ్.. జై మోడీ.. భారత్ మాతాకీ జై అంటూ నినాదించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి బయలుదేరిన బీజేపీ శ్రేణులు ఉదయం 10 గంటలకే పరేడ్ మైదానం చేసుకున్నారు.

తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన మోడీ ..

పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పలు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రిమోట్ ద్వారా చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు. ‘ప్రియమైన సోదర, సోదరిమణులకు నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్నందుకు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు’ అని మోడీ తెలుగులో మాట్లాడడంతో సభికుల్లో ఆనందం వెల్లివిరిసింది.

సభలో ప్లెక్సీల కలకలం..

మోడీ సభలో ప్రదర్శించిన ప్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. జనంలో పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ పాలనపై పరోక్షంగా ఆరోపణలు చేస్తున్న సమయంలో ఓ పోస్టర్ కలకలం రేపింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీని రామ భక్తుడిగా వర్ణించగా, దాని కింద రోమ్ నగరాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ ఫోటో జోడించారు. దానికి ‘రోమ్ భక్త’ అని టైటిల్ పెట్టారు. దాని కిందే మద్యం బాటిల్ ఫోటో పెట్టి కేసీఆర్ ఫోటోను జోడించి ‘రమ్ భక్త’ అని రాశారు. అయితే ఈ పోస్టర్ మూసాపేట కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ రూపొందించినట్లు తెలుస్తోంది. మరో వైపు నరేంద్ర మోడీ మాకు అవినీతి రహిత తెలంగాణ కావాలని, డబ్బులు పంచకుండా ఎన్నికలు జరిపించాలని బీజేపీ దళిత లీడర్ బీఆర్ విజయరామరాజు ప్లెక్సీని ప్రదర్శించారు.


మోడీకి ప్రత్యేక గిప్ట్..

నగరం నుంచి తిరుపతికి వందేభారత్ రైలును ప్రారంభించిన భారత ప్రధాని మోడీకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక గిప్ట్ ఇచ్చారు. పరేడ్ మైదానంలో ప్రధానిని శాలువాతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధానికి అందజేశారు. ప్రధాని తన ప్రసంగంలో శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి మందిరం నుంచి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వందే భారత్ రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

వేదికపైకి నలుగురే..

పరేడ్ మైదానంలో వేదికపైన నలుగురే ఆశీనులయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వీని వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలు స్టేజీపైన వర్చువల్ పద్దతిలో రూ.11360 కోట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ కుమార్, బాపురావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పార్టీ ముఖ్య నేతలంతా వీవీఐపీ గ్యాలరీలోనే కూర్చున్నారు.

కమలంలో జోష్..

ప్రధాని నరేంద్ర మోడీ సభ సక్సెస్ కావడంతో కమలం పార్టీలో జోష్ నెలకొంది. ఉదయం 11. 30 గంటల్లోపే పరేడ్ మైదానం కార్యకర్తలతో నిండిపోయింది. జిల్లాలతో పాటు నగరం నలుమూలల నుంచి భారీగా తరలిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో మైదానం నిండిపోయింది. లోపల చోటు లేదని పోలీసులు సూచించడంతో పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లో వేలాది మంది బీజేపీ శ్రేణులు బయటే వేచి ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్టవ్ ప్రధాని మోడీ ప్రసంగాలప్పుడు జై మోడీ.. జై శ్రీరాం.. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పరేడ్ మైదానం, పరిసర ప్రాంతాలలో దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలతోపాటు సాధారణ ప్రజలకు ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేశారు. పాసుల పంపిణీలో కార్యకర్తలు ప్రవేశ గేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. అయితే ప్రధాని సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ తో పాటు ఇతర సంఘాలు పిలుపునివ్వడం.. అయినా మోడీ పర్యటన సక్సెస్ గా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story