పూర్తయిన వాదనలు.. ఆరోజే మొయినాబాద్ ఫాంహౌజ్ కేసు తీర్పు

by Disha Web Desk 2 |
పూర్తయిన వాదనలు.. ఆరోజే మొయినాబాద్ ఫాంహౌజ్ కేసు తీర్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు దర్యాప్తు ప్రక్రియను సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 6న తీర్పు వెలువరించనున్నది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సీబీఐకి అప్పగిస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆదేశించింది. దీనిపైన సుదీర్ఘకంగా వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌తో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఫిజికల్‌గానూ, వర్చువల్‌గానూ వాదనలు వినిపించారు. బీజేపీ సైతం ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయింది. అన్ని వైపుల వాదనలను విన్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఇంతకాలం తీర్పును రిజర్వులో ఉంచింది. తీర్పను ఫిబ్రవరి 6న ప్రకటించేలా హైకోర్టు శుక్రవారం లిస్టింగ్‌లో పెట్టింది.

మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసును తొలుత విచారించిన ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులను అరెస్టు చేయడం మొదలు మరికొద్దిమందిని నిందితులుగా చేర్చే విషయంలోనూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విజ్ఞప్తిని తోసిపుచ్చింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో అరెస్టులు, జ్యుడిషియల్ రిమాండ్ తదితరాలు చోటుచేసుకున్నాయి. ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీలను ప్రధాన నిందితులుగా సిట్ పేర్కొన్నది. వారికి బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. వీరు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, సిట్ చేస్తున్న దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వ జోక్యం, ప్రభావం ఉంటుందని, నిష్పక్షపాతంగా జరగడంలేదని హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో గతంలో పేర్కొన్నారు.

దీనిని విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి నిందితుల తరఫున వాదనలతో ఏకీభవించి సీబీఐకి దర్యాప్తును బదిలీ చేయడంతో పాటు సిట్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల (జీవో)ను కొట్టివేశారు. అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజిన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. వీటిపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ పేర్కొన్నది. తుది తీర్పు ఈ నెల 6న వెలువరించనున్నట్లు వార్తలు రావడంతో మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ అవుతుందా లేక సిట్ పరిధిలోనే కొనసాగనున్నదా అనేది స్పష్టం కానున్నది. కేసుకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు, వీడియో ఫుటేజీ, ఆడియో క్లిప్పింగులు దర్యాప్తు ప్రారంభం కావడానికి ముందే లీక్ కావడం ఈ కేసులో నిందితులు ప్రధానంగా లేవనెత్తిన వాదన.


Next Story

Most Viewed