ఫౌంహౌజ్ కేసు: సిట్ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

by Disha Web Desk 2 |
ఫౌంహౌజ్ కేసు: సిట్ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారం రోజుకో ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నది. స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పజెప్పాలంటూ ముగ్గురు నిందితులు, బీజేపీ తరఫున దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 'సిట్' ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తుపై పిటిషనర్ల తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు పారదర్శకంగానే జరుగుతున్నదంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది సమర్ధించుకున్నారు. సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లు, అవసరం లేదన్న ప్రభుత్వ విధానంపై శుక్రవారం ఫైనల్ వాదనలు జరగనున్నాయి. ఇరువైపులా ఆర్గ్యుమెంట్ల అనంతరం హైకోర్టు సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?.. లేక సీబీఐకి అప్పగిస్తుందా? అనేది కీలకంగా మారింది.

సిట్ దర్యాప్తుపై నిందితుల, బీజేపీ తరఫున న్యాయవాదులు సుదీర్ఘంగా వాదించారు. దర్యాప్తు తీరుపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే వీడియో ఫుటేజీ, ఆడియో క్లిప్పింగులు బైటకు ఎలా లీక్ అయ్యాయంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రహహ్యంగా ఉండాల్సిన ప్రాథమిక రిపోర్టు బైటకు ఎలా లీక్ అయిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు హై ప్రొఫైల్ కేసు అని చెప్తూనే వివరాలను దర్యాప్తు మధ్యలోనే బైటకు వెళ్ళేలా ఎందుకు వ్యవహరించిందని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తు సక్రమంగా లేనందువల్లనే ఇది జరుగుతున్నదన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారానే వివరాలను బైటకు వెల్లడించారని, వీడియో, ఆడియోలను సైతం రిలీజ్ చేశారని పేర్కొన్నారు. సమగ్రంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే సీబీఐకి అప్పగించాలని న్యాయవాది వాదించారు.

ఏసీబీ చట్ట పరిధి గురించి న్యాయవాది ప్రస్తావిస్తూ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పుడు శాంతిభద్రతల విభాగం పోలీసులు దర్యాప్తు ఎలా చేపడతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏసీబీ అధికారులతో ఎందుకు విచారణ జరిపించలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, ఏసీబీ చట్టంలోని సెక్షన్ 17(బి) ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో అసిస్టెంట్ పోలీసు కమిషనర్ స్థాయి అధికారి ఏసీబీ కేసులపై కూడా దర్యాప్తు చేయవచ్చనే వెసులుబాటు ఉన్నదని గుర్తుచేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే 2003లో జీవో జారీ అయిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఫామ్ హౌజ్ కేసులోనూ ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు జరపడంలో తప్పులేదని సమర్ధించుకున్నారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాది, ప్రభుత్వం చెప్తున్నది నిజమే అయితే, 2003 తర్వాత నమోదైన ఏసీబీ కేసుల్లో ఎన్నింటిని లా అండ్ ఆర్డర్ పోలీసులు దర్యాప్తు చేశారని ప్రశ్నించారు. ఆ జీవో ప్రకారం మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాద్‌లో ఏసీబీ సెక్షన్ల కింద నమోదైన కేసులన్నీ ఏసీపీ స్థాయి అధికారుల దర్యాప్తు పరిధిలోకి వెళ్ళి ఉండాలి గదా అని ప్రశ్నించారు. కానీ ప్రాక్టికల్‌గా అది జరడంలేదని, కేవలం ఫామ్ హౌజ్ కేసుకు మాత్రమే దాన్ని వర్తింపజేశారని ప్రస్తావించారు. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్ తుది వాదనలను శుక్రవారం వింటామని పేర్కొన్నది. పిటిషనర్ల తరఫు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. తుది విచారణ శుక్రవారం జరిగేలా వాయిదా పడింది.

Also Read....

BRS పొలిట్‌‌‌బ్యూరో.. రాష్ట్రం నుంచి వీరికే అవకాశం?



Next Story

Most Viewed