'ఉగ్ర' నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి

by Disha Web Desk 4 |
ఉగ్ర నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ఉగ్రవాద దాడులకు పాల్పడే కుట్రను ఛేదించి ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండుతో జైలుకు తరలించారు. కోర్టుకు సెలవుదినాలు కావడంతో జడ్జి ఇంటిలో వారిని ప్రవేశపెట్టారు. దానికి ముందు హిమాయత్‌నగర్‌లోని 'సిట్' కార్యాలయంలో ముగ్గురినీ ప్రశ్నించారు. ఉగ్రవాద దాడులకు పాల్పడే కుట్రకు సంబంధించిన అంశాలతో పాటు ఏ సంస్థలతో ఎంతకాలం నుంచి ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నదీ రాబట్టారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ సంస్థతో పాటు టెర్రరిస్టు ఆర్గనైజేషన్ లష్కరే తొయిబాతోనూ వారికి సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందాలు ఆదివారం తెల్లవారుజామున మూసారంబాగ్‌, సైదాబాద్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లోని అనుమానితుల ఇండ్లలో సోదాలు నిర్వహించి అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్ లను అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లను, నగదును, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు ధృవీకరించే డాటాను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనమైన గ్రెనేడ్లను విశ్లేషించిన ఆయుధాల నిఫుణులకు అవి పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలింది.

ఆదివారం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్న వీరిని హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారించిన అనంతరం వైద్య పరీక్షలు చేయించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు ప్రత్యేక పోలీసు వాహనంలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. దసరా సెలవుల సందర్భంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో హ్యాండ్ గ్రెనేడ్ విసిరి విధ్వంసం సృష్టించాలనుకున్న కుట్రను ఇంటెలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమై భగ్నం చేశారు. నిందితులమీద పోలీసులు 1967 నాటి చట్టంలోని సెక్షన్ 18, 18(బీ), 20 కింద కేసులు నమోదు చేశారు. ఆదిల్ అఫ్రోజ్, అబ్దుల్ హై, సోహెల్ ఖురేషీ, అబ్దుల్ కలీమ్‌లను కూడా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

పాకిస్తాన్ నుంచి సరఫరా అయినట్లు అనుమానించిన పోలీసులు నీలిరంగు గ్రెనేడ్ల పేలుడు సామర్థ్యాన్ని, వినియోగించిన టెక్నాలజీని విశ్లేషిస్తున్నారు. తొలుత బాంబులను ఇక్కడే తయారీ చేయాలని నిందితులు భావించినా తయారీ క్రమంలో ప్రమాదం జరుగుతుందేమోననే కోణం నుంచి గ్రెనేడ్లను వినియోగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నీలిరంగు గ్రెనేడ్లను పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారోనే అంశంపై ఆరా తీశారు. బాంబుల తయారీ కోసం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల నుంచి ఇంటర్‌నెట్‌ ఫోన్‌ ద్వారా జరిపిన సంభాషణలు, తయారీ కోసం వారు ఇచ్చిన గైడెన్స్ తదితరాలను కూడా పోలీసులు తెలుసుకున్నారు. చైనాలో తయారైన ఈ గ్రెనేడ్లు పాకిస్తాన్ నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ చేరుకున్నట్లు తేలింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా దాచిపెట్టిన అంశం కూడా పోలీసుల విచారణలో బట్టబయలైంది.

Read Disha E-paper

Next Story