సచివాలయంలో ఎండిపోయిన ‘మహాగని’ మొక్క.. ఫలించని KCR సెంటిమెంట్ మంత్రం

by Satheesh |
సచివాలయంలో ఎండిపోయిన ‘మహాగని’ మొక్క.. ఫలించని KCR సెంటిమెంట్ మంత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఎన్నికల సందర్భంగా రాజశ్యామల యాగాన్ని నిర్వహించి ఫలితాలు పొందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈసారి ఎన్నికలప్పుడూ అదే యాగాన్ని ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ ‌హౌజ్‌లో నిర్వహించారు. గత నెల 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ యాగంలో పాల్గొంటూనే ప్రజా ఆశీర్వాద సభలకు సైతం హాజరయ్యారు. ఆ తర్వాత తన విశ్వాసానికి అనుగుణంగా ‘మహాగని’ మొక్కను అడవి నుంచి తీసుకొచ్చి కొత్త సచివాలయం ప్రాంగణంలో నాటించారు. ప్రతీరోజు దాని సంరక్షణ కోసం అటవీ, ఉద్యానవన శాఖల అధికారులు చొరవ తీసుకున్నారు. ఏపుగా పెరిగేందుకు వీలుగా అవసరమైన ఆర్గానిక్ ఎరువులతో పాటు పురుగు పట్టకుండా మందుల్ని సైతం వాడారు.

ఆ మొక్కకు ఔషధ విలువల సంగతి ఎలా ఉన్నా ఆధ్యాత్మికంగా శుభం జరుగుతుందని భావించిన కేసీఆర్ దీన్ని సచివాలయంలో నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మొక్క ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేల స్వభావమో మరే కారణమో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బతకలేదు. ప్రచారం ముగుస్తున్న సమయంలో అది బతికే అవకాశం లేదని తేలిపోయింది. ఇక బతికే ఛాన్స్ లేదని అర్థమైంది. ఏదో అపశకునమేననే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ ఎఫెక్టు పోలింగ్ రోజున కనిపించిందనే కామెంట్లూ వినిపించాయి. మొక్క ఎండిపోవడం ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావనే అపశకునానికి సంకేతమన్న మాటలూ వచ్చాయి.

ఆ నమ్మకాలకు బలం చేకూరే తరహాలో పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలూ వెలువడ్డాయి. అటు యాగం ద్వారా, ఇటు మొక్క నాటడం ద్వారానూ ఫలితాలు రాకపోవచ్చనే స్పష్టత ఏర్పడింది. హరితహారం స్కీమ్‌లో భాగంగా నాటిన సంపెంగ లాంటి మొక్కలు ఏపుగానే పెరిగినా ‘మహాగని’ విషయంలో మాత్రం ప్రతికూల ఫలితాలు రావడం తొలి అపశకునం అని గులాబీ నేతల భావన. కరీబియన్ దీవుల్లో ఏపుగా పెరిగే ఈ మొక్కలను కలప అవసరాల కోసం కేరళలో పెంచాలని చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. కానీ సచివాలయంలో మాత్రం అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.



Next Story

Most Viewed