పరిశ్రమలకు ఉపశమనమేది..? 9 ఏళ్లు గడిచిన అమలుకు నోచని సర్కారు హామీలు

by Disha Web Desk 19 |
పరిశ్రమలకు ఉపశమనమేది..? 9 ఏళ్లు గడిచిన అమలుకు నోచని సర్కారు హామీలు
X

రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను 100 రోజుల్లో తెరిచి.. లక్షలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని 2014లో కేసీఆర్​ప్రకటించారు. నిజాం షుగర్స్​ఫ్యాక్టరీ, ఆజంజాహీ, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, ఐడీపీఎల్ మెషీన్లు, తెలంగాణ ఏర్పడే నాటికి సుమారు 1,600 వరకు మధ్య తరహా కంపెనీలు, 3 వేల వరకు చిన్న కంపెనీలు మూతపడగా.. తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్లలో 13 వేలకుపైగా చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి.

ఇందులో కరోనా సమయంలో ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడం, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేక 4వేల కంపెనీలు మాతపడ్డాయి. ఫలితంగా సుమారు ఐదు లక్షల మంది రోడ్డునపడ్డారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రారంభించి సాయం అందిస్తామని చెప్పినప్పటికీ నిరాశే ఎదురైంది. నాలుగేళ్లు గడిచినా కేవలం 40యూనిట్లకే రుణం ఇవ్వడం గమనార్హం. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సైతం సబ్సిడీలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో ‘ది తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’ను ఏర్పాటు చేసింది. కరోనాతో సుమారు 4వేల పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే, హెల్త్ క్లినిక్ లిమిటెడ్‌ను స్థాపించిన నాటి నుంచి 40 యూనిట్లకు రూ.5.39కోట్లు రుణం ఇచ్చామని 2021-22 ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్టుమెంట్స్ వార్షిక నివేదికలో పేర్కొన్నది. ఐదేళ్లతో ప్రభుత్వం కేటాయించింది మాత్రం రూ. 20కోట్లు మాత్రమే. పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాల విడుదలలో 2019 నుంచి జాప్యం చేస్తున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా 47,091 యూనిట్లకు రూ.3,262కోట్లకు పైగా ప్రభుత్వం బకాయిపడింది. ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు చెందిన 10,626 క్లెయిమ్​లకు 2019 ఏప్రిల్ వరకు మాత్రమే రాయితీలు వచ్చాయి. నాటి నుంచి ఇప్పటి వరకు రాయితీ మంజూరు కాలేదు. సుమారు రూ.546.039కోట్లు రావాల్సి ఉంది. అలాగే ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సైతం 16,735 యూనిట్లకు రాయితీలు పెండింగ్ లో ఉన్నాయి. 2019 ఆగస్టు వరకు మాత్రమే ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది. నాటి నుంచి మంజూరు చేయకపోవడంతో సుమారు రూ.708 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.

భూ సేకరణతోనే ఆగిన నిమ్జ్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిమ్జ్ భూ సేకరణకు 2015లో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్జ్​కు భూములు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. 2015 నుంచి ఏడేళ్లలోపు అంటే 2022 నాటికి ప్రాజెక్టు మొత్తంగా పూర్తికావాలి. కానీ గత ఐదేండ్లలో కేవలం 20 శాతం పనులే.. అవి కూడా భూసేకరణకే పరిమితమయ్యాయి. 12,635 ఎకరాల భూమి అవసరం ఉండగా.. 3,150 ఎకరాల భూమిని సేకరించగలిగారు. ఇందుకోసం మొదటి విడత రూ.166 కోట్లను కేటాయించి రూ.152 కోట్లు ఖర్చు చేశారు.

రెండో విడుతలో న్యాల్ కల్ మండలంలో 9,378 ఎకరాలు సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. మరోవైపు దండుమల్కాపూర్ లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు పనులను 2019 నవంబర్ 2న శంకుస్థాపన చేశారు. 450 పరిశ్రమలకు భూములు కేటాయించగా, ప్యాకేజింగ్‌, భవన నిర్మాణ సామగ్రి, ఆహార శుద్ధి, ఇటుకల తయారీ, ఎలక్ట్రిక్‌ ఆటో యూనిట్‌ సహా 15 పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని పరిశ్రమలు భవన నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు.

పేపర్ పైనే ఉద్యోగ కల్పన

2014-15 సంవత్సరం నుంచి 2023-24 వరకు టీఎస్ ఐపాస్ ద్వారా23,093 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో 17,62,825మంది ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 15,74,798 మందికి ఉపాధి కల్పించినట్లు స్పష్టం చేసింది. అయితే వాస్తవానికి 17లక్షల ఉద్యోగాల్లో ఇప్పటివరకు 9లక్షల ఉద్యోగాలే ప్రభుత్వం కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం.

పరిశ్రమల్లో బతుకమ్మ చీరలపంపిణీ..

బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం హ్యాండ్​లూమ్​ టెక్స్​టైల్​ శాఖ పరిధిలోని కాగా, ప్రభుత్వం పరిశ్రమల శాఖలో చూపింది. మే 2023వరకు బతుకమ్మ చీరలకు 1,726 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా.. 1536కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు హ్యాండ్​లూమ్​ శాఖ స్పష్టం చేసింది. దాదాపు రూ.200కోట్లు బకాయి ఉండగా.. బడ్జెట్​ లెక్కల్లో మాత్రం చీరల పంపిణీకి 2,044కోట్లు కేటాయించినట్టు ప్రకటించడం గమనార్హం.

ప్రహసనంగా ఫుడ్ ప్రాసెసింగ్

తెలంగాణ ఆహార తయారీ పరిరక్షణ విధానం-2018 టీపాస్ పేరుతో ముసాయిదాను సిద్ధం చేసి కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా సోయా, వేరుశనగ, పత్తి విత్తన, ఆయిల్‌ఫాం, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ మిల్లులు ఏర్పాటు చేయనున్నట్లు అందులో పేర్కొన్నది. మొక్కజొన్న ఆధారిత యూనిట్లు.. పండ్లు, కూరగాయల తయారీ, పరిరక్షణ యూనిట్లు, పాలు, మాంసం, చేపలు ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పనున్నట్టు వెల్లడించింది. అన్ని జిల్లాల్లో భూముల సేకరణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించినా.. ఐదేళ్లు గడిచినా నేటికీ భూ సేకరణ పూర్తి కాలేదు.

ఐటీఐఆర్ ముందుపడలే..

ఐటీఐఆర్ కు 2008లో కేంద్రం ప్రతిపాదన చేయగా, 2013లో ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధిస్తామని పేర్కొంది. అయితే ఏళ్లు గడుస్తున్నా సాధించలేకపోయింది. ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. తెలంగాణ విభజనహామీలతోపాటు ఐటీఐఆర్​ కేంద్రం వివక్ష చూపుతున్నదని 40సార్లకుపైగా విన్నవించినా స్పందించడంలేదని మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. అదేసమయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు ఘాటుగా స్పందిస్తూ.. ఈ విషయంలో నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేపట్టలేదన్నారు.

టీ అసిస్ట్ స్కీం కింద శిక్షణ నిల్

చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టీ అసిస్ట్ (తెలంగాణ స్టేట్ అక్సెలరేటెడ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్కిల్స్ అండ్ ట్రైయినింగ్) ఏర్పాటు చేశారు. కానీ, 2018 ఆర్థిక సంవత్సరం నుంచి నవంబర్ 2021 నవంబర్ 31 వరకు నైపుణ్యాల శిక్షణను ఒక్కరికీ ఇవ్వలేదని స్వయంగా రాష్ట్ర హ్యాండ్ క్రాప్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించడం గమనార్హం. అదే విధంగా 2018-19 నుంచి 2021 నవంబర్ 30 వరకు టీ హార్ట్ పథకం కింద తెలంగాణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలంగాణ హస్తకళల, సంప్రదాయ కళల వివరాలు సైతం లేవని, ఈ పథకం కింద ఆదాయ వనరులు కల్పించిన కళాకారుల సంఖ్య కూడా లేకపోవడం విడ్డూరమే.

భూ ధరల పెరుగుదలతో టీ ప్రైడ్ కు ఆదరణ కరువు

టీ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్) తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడానికి, వారికి పారిశ్రామికేవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించడానికి టీ ప్రైడ్ కార్యక్రమాన్ని 2014లో తెచ్చింది. ఈ స్కీం కింద 15 శాతం ప్రతి ఇండస్ట్రియల్ పార్కులో ప్లాట్లు కేటాయిస్తుంది. అయితే భూముల ధరలు పెరుగుదలతో వెనుకంజ వేస్తున్నారు. రూరల్ ఏరియాలో సైతం గజానికి 3,500పైగా ధర ఉండటంతో కంపెనీ స్థాపనకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండటంతో పెట్టుబడులు లేక ముందుకు రావడం లేదు.

ఫలితమివ్వని గ్రిడ్ పాలసీ

ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్ వైపు తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతోపాటు మౌలిక వసతులు కల్పించే చర్యలు చేపట్టింది. రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. హైదరాబాద్ గ్రోత్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 11 పారిశ్రామిక వాడలను ఐటీపార్కులుగా అభివృద్ధి చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది.

కూకట్ పల్లి, గాంధీనగర్, బాలానగర్, మల్లాపూర్, మౌలాలి, సనత్ నగర్, ఉప్పల్, నాచారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం, కాటేదాన్, వంటిపారిశ్రామికవాడలు ఉన్నాయి. పరిశ్రమలను తరలించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాకపోవడం, భూమి ఎక్కువ ధరకు ఉండటంతో ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం సైతం పారిశామికవేత్తలకు సరైన హామీలు ఇవ్వకపోవడంతో గ్రిడ్ పాలసీ ఆశించిన ఫలితాలు రావడం లేదు.

కనిపించని జీవోలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ కు సంబంధించిన జీవోలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచడం లేదు. మొత్తం జీవోలు 6226 ఉన్నాయి. 2008 నుంచి 2014 జూన్ 1 వరకు మాత్రమే జీవోలు వెబ్ సైట్ లో ఉన్నాయి. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎలాంటి జీవోలను వెబ్ సైట్లో పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

ఐటీలో ఎంతచెబితే అంతే...

తెలంగాణ రాష్ట్రం 31.44శాతం వార్షిక వృద్ధితో 2,41,275 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం 1,83,569 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 57,706 కోట్ల పెరుగుదల అయినట్లు తెలిపారు. 16.2శాతం వార్షిక వృద్ధితో 9,05,715 ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, గత సంవత్సరం నూతన ఐటీ ఉద్యోగాలు 1,26,894 వచ్చాయన్నారు.

2014వ సంవత్సరం తెలంగాణ ఐటీ ఎగుమతులు 57,258 కోట్ల మాత్రమే ఉంటే నేడు ఇవి దాదాపు 4 రెట్లు పైగా పెరిగి 2,41,275 కోట్లకు పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు నాటికి 2014లో 3,23,396 ఉద్యోగాలు ఉంటే అవి మూడు రెట్లు పెరిగి 9,05,715 కు పెరిగాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇప్పటిదాకా ఐటీ రంగంలో నేరుగా 5,82,319 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉంటే వాస్తవంగా ఎంతమందికి వచ్చాయి. ఎన్ని కంపెనీలు స్థాపించారనేది మాత్రం అధికారులకే తెలియాలి.

పూర్తికానీ టీ ఫైబర్ ప్రాజెక్ట్

తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో టీ ఫైబర్ ప్రాజెక్ట్ (ఫైబర్ గ్రిడ్ పథకం) ను ప్రవేశపెట్టింది. మంత్రి కేటీఆర్ 2017లో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌తో ప్రారంభించారు. గ్రామ పంచాయతీలు, గ్రామీణ గృహాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు నెట్వర్క్ ను అనుసంధానించడం ద్వారా ఇది సేవలు అందించనుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మందికి టెలిమెడిసిన్, విద్యా అవకాశాలను అందించడం ద్వారా ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా గృహాలకు 4-100 ఎంబీపీఎస్, సంస్థలు ఆన్-డిమాండ్ 20-100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ ను పంపిణీ చేయనున్నారు. అయితే ఐదేళ్లుగడిచినా పైబర్ గ్రిడ్ పూర్తికాలేదు. ప్రభుత్వ హామీ నెరవేరలేదు.

పనుల్లోనే మరికొన్ని..

= రంగారెడ్డి జిల్లా ముశ్చర్లలో ఫార్మాసిటీ (ఔషధ క్లస్టర్ గా) ఏర్పాటు చేస్తున్నారు.. ఇంకా పూర్తి కాలేదు. 4.20లక్షల ఉద్యోగాలు రాలేదు..

= ఫైబర్ క్లాస్ కంపోజిట్ క్లస్టర్ ఇబ్రహీంపట్నంలో నిర్మాణ దశలోనే ఉంది.

= చందన్ వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి.

= సుల్తాన్ పూర్ ఎఫ్ టీసీసీఐ ఎఫ్ఎల్ వో పార్కు కు భూముల కేటాయింపు దశలోనే ఉంది.

= నల్లగొండలో ఐటీ పార్కు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.

= కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో చిన్నచిన్న సంస్థలు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. పూర్తిస్థాయిలో కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించలేదు.

= ఆజామాబాద్ ఇండస్ట్రియల్ కు సంబంధించిన 136.4 ఎకరాల భూమి అమ్మకానికి కసరత్తు.

Next Story

Most Viewed