అమ్మకానికి ఆస్తులు.. ఈ ఏడాది ఆదాయం టార్గెట్ రూ. 30 వేల కోట్లు!

by Disha Web Desk 2 |
అమ్మకానికి ఆస్తులు.. ఈ ఏడాది ఆదాయం టార్గెట్ రూ. 30 వేల కోట్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీకి గుబులు పుట్టిస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయడం సవాలుగా మారింది. ఇందుకు అవసరమయ్యే నిధులను సమీకరించుకోవడం శక్తికి మించిన పనిగా మారింది. ఆదాయ వనరుల అన్వేషణ కోసం గతేడాది నుంచే కసరత్తు మొదలైంది. ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్జించాల్సిన ఆదాయంపై ఇటీవల ఫస్ట్ టైమ్ చర్చించింది. కనీసంగా రూ. 30 వేల కోట్లను మొబిలైజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. ఇందుకోసం పురపాలక, పరిశ్రమల శాఖలపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది. ప్రభుత్వ కార్పొరేషన్లు, రిజర్వు బ్యాంకు ద్వారా అప్పులు పుట్టడంలోని ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడమే ఉత్తమమనే నిర్ణయానికొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, దళితబంధు స్కీమ్‌లను ప్రతిష్టాత్మకం అని చెప్తూ ఇతర రాష్ట్రాలకు వీటిని రోల్ మోడల్ అని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నది. కేవలం ఈ రెండు స్కీమ్‌లకే ఈ ఏడాది రూ. 32,700 కోట్లు అవసరమవుతున్నది. రైతుబంధుకు రెండు సీజన్‌లకు కలిపి రూ. 15,000 కోట్లకు పైగానే ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తున్నది. దళితబంధు కోసం రూ. 17,700 కోట్లను బడ్జెట్‌లో పెట్టుకున్నది. ఒకవైపు ఈ రెండు పథకాలు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం అని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ అదే సమయంలో వాటికయ్యే ఖర్చు గుదిబండలా మారింది. ఈ కారణంగానే గతేడాది రూ. 17,700 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపుగా పెట్టుకున్నా ఒక్క పైసాను కూడా విడుదల చేయలేదు. ఈ సంవత్సరమూ తిరిగి అదే మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల ద్వారా వసూలయ్యే ఆదాయం ఈ రెండు పథకాలకు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడమే ఏకైక ప్రత్యామ్నాయమనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని కేవలం ఆదాయ వనరుల సమీకరణ కోసమే ఏర్పాటైంది. గతేడాది పలుమార్లు సమావేశమైన ఈ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే హెచ్ఎండీఏ ఆస్తుల వేలం ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడ తదితర ప్రాంతాల్లో తగిన స్పందన రాకపోయినా పలుమార్లు వేలం పాటలను నిర్వహించింది. ఈ సంవత్సరం కూడా ఆదాయాన్ని సమకూర్చుకోడానికి క్యాబినెట్ సబ్ కమిటీ తొలిసారి గత వారం సమావేశమై లోతుగా చర్చించింది. పలు మార్గాలను అన్వేషించింది.

ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో భాగంగా ఔటర్ రింగు రోడ్డును 30 సంవత్సరాల లీజుకు ఇచ్చి రూ. 7,380 కోట్లను పొందగలిగింది. మరోవైపు హెచ్ఎండీఏ ద్వారా భూముల అమ్మకం ప్రక్రియ వేగవంతమైంది. గతంలోనే రాజీవ్ స్వగృహ ఫ్లాట్‌లు, ప్లాట్లను అమ్మి కొంత సమీకరించుకున్నది. ఇటీవల బాచుపల్లిలో ఓపెన్ ప్లాట్ల ద్వారా ఇటీవల రూ. 116 కోట్లను ఆర్జించింది. ఈ నెల చివరకు మరికొన్ని ఓపెన్ ప్లాట్లను అమ్మి కనీసంగా రూ. 300 కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నెల చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నది. రానున్న కాలంలో హెచ్ఎండీఏ ఇలాంటి సంచలన నిర్ణయాలు ఏమేం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇంకోవైపు ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు ద్వారా కూడా ఆదాయం వస్తుందని సబ్ కమిటీ అంచనా వేసింది. గతేడాదే ఈ శాఖపై కన్నేసిన ప్రభుత్వం అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కొన్ని ఆస్తులను విక్రయించాలని భావించింది. గతేడాది అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందినా గవర్నర్ అప్రూవల్ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఇప్పటికీ అది పెండింగ్‌లోనే ఉన్నది. దీనిపై ఆశించిన పురోగతి లేకపోవడంతో సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామికవాడల్లో నిరుపయోగంగా, వివాదాస్పదంగా ఉన్న భూములపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ భూముల చిక్కులు తొలగిపోతాయన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇండస్ట్రియల్ ఏరియాల్లో అలాంటి భూముల జాబితా సర్కారుకు చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సైజును ప్రభుత్వం పెంచుకున్నా దానికి తగినట్లుగా సొంత ఆదాయం ఏ రూపంలో సమకూర్చుకుంటుందో క్లారిటీ ఇవ్వలేదు. ఇంటర్ స్టేట్ సిటిల్‌మెంట్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం రూ. 17,828 కోట్లు వస్తున్నట్లు బడ్జెట్‌లో లెక్కలు వేసుకున్నది. ఇవి రావనే సంగతి తెలిసినా బడ్జెట్ సైజును పెంచుకోవడంలో లెక్కల్లో చూపించింది. ఇవి వసూలయ్యే లెక్క కాదన్న అంచనాతో ఈ మేరకు ఏ రూపంలో సమకూర్చుకోవచ్చో కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఇకపైన చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిపెట్టింది.

ఉమ్మడి రాష్ట్రంలో 2004-10 మధ్యకాలంలో ఏపీ హౌజింగ్ బోర్డు చొరవతో ప్రైవేట్ డెవలపర్స్ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్‌లకు ప్రణాళిక తయారుచేసిన అది పెండింగ్‌లో ఉండపోయింది. దీన్ని తిరిగి పునరుద్ధరించడంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఇందుకోసం ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూపును ఏర్పాటుచేసి వివాదాలను సత్వరం పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలనే నిర్ణయం జరిగినట్లు తెలిసింది. ఇది గాడిన పడితే కొంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందన్నది ఆ సబ్ కమిటీ అభిప్రాయం. ఇక ఎలాగూ జవో 58, 59 ద్వారా భూముల క్రమబద్ధీకరణ రూపంలో కొంత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నది. ఆదాయాన్ని ఆర్జించడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది.



Next Story

Most Viewed