- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలను రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి
అర్హులైన పేదలందరికీ సొంత గూడు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, దమ్మపేట:- అర్హులైన పేదలందరికీ సొంత గూడు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి.. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు నూతన గృహాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు.. కట్కూరుకే తొలి ప్రాధాన్యం
దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పూసుకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని కట్కూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఫేస్-1 కింద లబ్ధిదారు యాట్ల శ్రీదేవి ఇంటిని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పూసుకుంటలో మరో లబ్ధిదారు పూనెం రాధ నూతన గృహాన్ని స్థానిక మహిళ యాట్ల నాగమ్మతో కలిసి ప్రారంభించి, గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో అందరికీ ఇళ్లు రాలేదన్న విషయాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, రెండో విడతలో కట్కూరు గ్రామానికే తొలి ప్రాధాన్యం ఇచ్చి అందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు సూచించారు.
పోడు రైతులకు భరోసా.. జాయింట్ సర్వేకు ఆదేశం
అనంతరం పూసుకుంట గ్రామస్థులు తమ స్థానిక సమస్యలను మంత్రికి విన్నవించారు. విద్యుత్, సోలార్ లైట్ల ఏర్పాటుతో పాటు ప్రధానంగా పోడు భూముల పట్టాల సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. అటవీ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి పోడు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అంకిత్, సంబంధిత అధికారులకు సూచించారు.
గత పాలకులపై ధ్వజం.. నిరంతర ప్రక్రియగా ఇళ్ల మంజూరు
పట్వారిగూడెం రైతువేదిక వద్ద రాచూరుపల్లి, లచ్చాపురం గ్రామాలతోపాటు , దమ్మపేట మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, అందులో భాగంగానే పలువురు లబ్ధిదారులకు నేడు పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు మాయమాటలతో ప్రజలను వంచించారని, నిధులు మంజూరు చేయకుండా ఇళ్ల నిర్మాణాలను గాలికి వదిలేశారని విమర్శించారు. రైతులను, పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమన్నారు. నియోజకవర్గానికి మరింత అధికంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రిని కోరారు.
సంక్షేమ పథకాల అమలులో రాజీ లేదు
ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 1.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లతో పాటు, హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా లక్ష ఇళ్లు కేటాయించామన్నారు. రైతులకు రెండు సీజన్లలో రైతుభరోసా, రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేశామని గుర్తుచేశారు. పేదలపై భారం తగ్గించేందుకు రూ.500 కే గ్యాస్ సిలిండర్, సన్న వడ్లకు రూ.500 బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామని వివరించారు. పేదల సంక్షేమమే ఊపిరిగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మొద్దులగూడెం, నాయుడుపేట గ్రామంలో వివిధ బీటీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ రాణి, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, హౌసింగ్ పీడీ సవేరాం, డీఈ ఖలీల్, ఏఈ రాము, తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు స్థానిక సర్పంచుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కక్కిరాల రమేష్, చిన్నశెట్టి యుగంధర్, యారగోర్ల రాధకృష్ణ, పగడాల రాంబాబు గోపి శాస్త్రి,తదితరులు పాల్గొన్నారు.






