కొత్తవాళ్లు వస్తున్నారు.. ఏర్పాట్లు పూర్తి చేయండి: పోలీస్​ శిక్షణా కేంద్రాల ప్రిన్సిపాళ్లకు డీజీపీ ఆదేశాలు

by Dishafeatures2 |
కొత్తవాళ్లు వస్తున్నారు.. ఏర్పాట్లు పూర్తి చేయండి: పోలీస్​ శిక్షణా కేంద్రాల ప్రిన్సిపాళ్లకు డీజీపీ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసుశాఖలో పెద్ద సంఖ్యలో నియామకం కానున్న సబ్​ఇన్స్ పెక్టర్లు, కానిస్టేబుళ్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయా పోలీస్​ట్రైనింగ్​ఇనిస్టిట్యూట్ల ప్రిన్సిపాళ్లకు డీజీపీ అంజనీకుమార్​సూచించారు. సెప్టెంబర్, అక్టోబర్​నెలల్లో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్నాహకాలను పూర్తి చేయాలని చెప్పారు. పోలీసుశాఖలో సబ్​ఇన్స్​పెక్టర్లు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 14,881మంది నియామక ప్రక్రియ తుది దశకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీజీపీ అంజనీకుమార్​మంగళవారం రాష్ర్టంలోని 28 పోలీస్​శిక్షణా కేంద్రాల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. శిక్షణ విభాగం ఐజీ తరుణ్​జోషి కూడా పాల్గొన్న ఈ కాన్ఫరెన్స్​లో డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇందులో భాగంగానే 2018లో 11,023మంది, 2020లో 16,282మంది సబ్​ఇన్స్​పెక్టర్లు, కానిస్టేబుళ్ల నియామకాలు జరిపిందని చెప్పారు. ప్రస్తుతం 2‌023–24 సంవత్సరానికిగాను 14,881 సబ్​ఇన్స్​పెక్టర్లు, కానిస్టేబుళ్ల నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తోందన్నారు. తెలంగాణ పోలీస్​అకాదమీలో 653, అంబర్​పేట పోలీస్​ట్రైనింగ్​కాలేజీలో 650, వరంగల్​లో 1000, కరీంనగర్​లో 442, మేడ్చల్​లో 250, హైదరాబాద్​సీటీసీ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్​లలో 250 చొప్పున, యూసుఫ్​గూడ టీఎస్​స్పెషల్​పోలీస్ యూనిట్​లో 400, కొండాపూర్​లో 450, డిచ్​పల్లిలో 350, మంచిర్యాలలో 325 మంది సబ్​ఇన్స్​పెక్టర్లు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ ప్రారంభం కావటానికి ముందే అన్ని పీటీసీల్లో మౌళిక సదుపాయల కల్పన, శిక్షణకు కావాల్సిన మెటీరియల్, వసతి సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. భవనాలకు మరమ్మత్తులు, వైట్​వాష్​టాయిలెట్ల సౌకర్యం, రీడింగ్​రూం తదితర ఏర్పాట్ల కోసం నిధులను అంద చేస్తామన్నారు.

పోలీస్​ట్రైనింగ్​కాలేజీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయటానికి వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే వారికి మంచి గుణాత్మక శిక్షణనిస్తే వారు రానున్న ముప్పయి, ముప్పయి అయిదు సంవత్సరాలపాటు సమాజానికి మంచి సేవలు అందిస్తారన్నారు. పీటీసీ ప్రిన్సిపాళ్లు, అధికారులు సిబ్బందికి ఆదర్శంగా ఉండాలన్నారు. మంచి శిక్షణ ఇస్తేనే సమాజానికి ఉత్తమ సేవలు అందుతాయని చెప్పారు. దేశంలో మరే రాష్ర్టంలో లేని విధంగా మన రాష్ర్టంలో మహిళలకు పోలీస్​నియామకాల్లో 33శాతం రిజర్వేషన్​కల్పించినట్టు తెలిపారు. మహిళా ట్రైనీ పోలీస్​కానిస్టేబుల్​శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. హైదరాబాద్​లోని పోలీస్​అకాడమీలో అత్యున్నత పోలీస్​శిక్షణా మెటీరియల్​అందుబాటులో ఉందని చెబుతూ దీనిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed