జనసంద్రమైన పెద్దగట్టు: ఓ.. లింగా నామస్మరణతో మారుమోగుతున్న పరిసరాలు..

by Disha Web Desk 11 |
జనసంద్రమైన పెద్దగట్టు: ఓ.. లింగా నామస్మరణతో మారుమోగుతున్న పరిసరాలు..
X

దిశ, సూర్యాపేట ప్రతినిధి: లింగ ఓ..లింగా.. నామస్మరణం.. భేరీల మోతలు.. గజ్జెల చప్పుళ్ళు, సంప్రదాయ నృత్యాలతో పెద్దగట్టు పరిసరాలు మారుమోగిపోతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయిన సోమవారం పెద్ద గట్టు జాతరకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టే పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం యాదవుల కులదైవం లింగమంతుల స్వామికి బోనం చెల్లించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుజాముల నుంచే బోనంతో స్వామివారి మొక్కులు తీర్చుకుంటున్నారు. లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేoదుకు భక్తులు పెద్దగట్టు పై బారులు తీరారు.


రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. పెద్ద గట్టు జాతరకు లక్షలాదిగా తరలి వచ్చిన భక్తుల్లో కనిపిస్తున్న కోలాహలం సంతోషమని, రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆలోచనలు అభివృద్ధి యజ్ఞంతో ఎడారిలా ఉన్న ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు.

కాళేశ్వరం మొదటి ప్రతిఫలం అందుకున్న ప్రాంతం సూర్యాపేటనే అని పేర్కొన్నారు. గోదావరి జలాలతో లింగమంతుల స్వామి పాదాలను తడిపామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో దేశంలోనే సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాయన్నారు. కాలం కలిసొచ్చి పాడి పంటలు బాగా పండాలని లింగమంతుల స్వామిని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలని, మళ్ళీ జాతర నాటికి తెలంగాణా మరింత అభివృద్ధి చెంది ముందుకు సాగాలని ఆకాంక్షించారు.






Next Story

Most Viewed