వచ్చే ఎన్నికలే నాకు చివరివి కావచ్చు.. ఉత్తమ్ సంచలన ప్రకటన

by Disha Web |
వచ్చే ఎన్నికలే నాకు చివరివి కావచ్చు.. ఉత్తమ్ సంచలన ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయాల్లో కరప్షన్​ విపరీతంగా పెరిగిందని, ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయని కాంగ్రెస్​ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్​ కల్పించిందన్నారు. ఎన్నికలను తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని, తనకు వచ్చే ఎన్నికలే చివరివి కావచ్చని ఉత్తమ్​ పేర్కొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ​కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, పోలీసులు చాలా డిస్ట్రబ్​ చేస్తున్నారని, కేసులతో వేధిస్తున్నారన్నారు.

వరంగల్​ డిక్లరేషన్‌ను గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​పార్టీ ప్లాన్ చేసిందని, ఈ నెల 21 నుంచి రచ్చబండ నిర్వహిస్తున్నామని ఉత్తమ్​ తెలిపారు. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు లేకుండా చేశారని, లోకల్​ బాడీస్‌కు మరిన్ని నిధులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పంచాయతీలకు నిధులు పెంచాలని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, సీఎం, మంత్రుల కార్యక్రమాలకు ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీలకు నిధుల కేటాయింపు లేదన్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌ల పరిస్థితి దయనీయంగా ఉందని, బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉత్తమ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై సీఎం వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, గత ఏడాది యాసంగిలో 92 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 20 లక్షలే కొనుగోలు చేశారన్నారు. కొనుగోళ్లు చేయకపోవడంతో మిల్లర్ల చేతిలో రైతులు మోసపోతున్నారని, రూ. 1400 కే అమ్ముకుంటున్నారన్నారు. అదే విధంగా మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు అని చెప్పి, వడ్డీ ఇవ్వడం లేదని, ఇప్పటి వరకు రూ. 3700 కోట్లు బకాయిలున్నాయని ఉత్తమ్​ ఆరోపించారు. అభయహస్తం కింద 22 లక్షల మంది సభ్యుల డిపాజిట్‌ను వాడుకుంటున్నారని, ఇంకా రూ. 1070 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, వీరందరి తరుఫున కాంగ్రెస్​ పోరాటం చేస్తుందన్నారు.

Next Story