తలకిందులైన అంచనాలు.. బడ్జెట్‌లో కేసీఆర్ మార్క్ కనపడలేదా?

by Disha Web Desk 2 |
తలకిందులైన అంచనాలు.. బడ్జెట్‌లో కేసీఆర్ మార్క్ కనపడలేదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ సాదాసీదాగానే ఉన్నది. గత బడ్జెట్ తరహాలోనే ఈసారి కూడా సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కొన్న స్కీమ్‌లకు కేటాయింపులు పెంచింది. గత బడ్జెట్‌ కంటే ఈసారి సుమారురూ. 17 వేల కోట్ల మేర వెల్ఫేర్ బడ్జెట్ పెరిగింది. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లకు గతంలో ఉన్న కేటాయింపుల్నే దాదాపు కంటిన్యూ చేసింది. సొంత జాగ ఉన్న కుటుంబాలకు ఇండ్లు కట్టుకునేందుకు గత బడ్జెట్‌లో కేటాయింపులు చేయకున్నా ఈసారి మాత్రం రూ.7,890 కోట్లను ప్రకటించింది. పంచాయతీరాజ్ శాఖకు నిధుల్ని పెంచడంతో పాటు ముఖ్యమంత్రి విచక్షణ మేరకు ప్రకటించే స్కీమ్‌ల కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఈసారి ఏకంగా రూ. 10,348 కోట్లను కేటాయించింది.

గత బడ్జెట్‌లో అనేక వెల్ఫేర్ స్కీమ్‌లకు నిధుల్ని కేటాయించినా వాటిని విడుదల చేయకపోవడంతో ఈసారి పెరిగిన నిధులపై ప్రజల్లో పెద్దగా స్పందన లేదు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుందనే ఊహాగానాలు వినిపించినా, ఆశలు పెట్టుకున్నా అవి నిరాశగానే మిగిలిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ పద్దులో ఒకేసారి రూ.8,348 కోట్లను ఎక్కువగా కేటాయించడం చర్చనీయాంశమైంది. ఇటీవల ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా మున్సిపాలిటీలకు, మండలాలకు, నియోజకవర్గాలకు హామీలు గుప్పిస్తున్నరు. దానికి తగిన విధంగా బడ్జెట్‌లో హెచ్చుమొత్తంలో కేటాయింపులు చేయడం గమనార్హం. పార్టీ బలహీనంగా ఉన్నచోట నిధులను గుమ్మరించి అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆస్కారం ఏర్పడింది.

ఎన్నికల బడ్జెట్‌లో భారీ స్థాయిలో వరాలు, హామీలు, పథకాలు ఉంటాయన్న వార్తలు వినిపించాయి. కానీ ప్రభుత్వం ఒక్క కొత్త స్కీమ్‌ను కూడా ప్రకటించలేదు. నిరుద్యోగ భృతి, గిరిజనబంధు లాంటి పథకాలపై ముఖ్యమంత్రి గతంలో ప్రకటనలు చేసినా అవేవీ బడ్జెట్‌లో చోటుచేసుకోలేదు. ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉద్యోగాలకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు గత బడ్జెట్‌ సందర్భంగా సీఎం అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దీంతో ఏప్రిల్ నుంచే ఆ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగుల్ని దగ్గర చేసుకునే ప్రయత్నం బడ్జెట్‌లో కనిపించింది.

ఆసరా, ఆరోగ్యశ్రీ, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, రైతు రుణమాఫీ తదితర స్కీమ్‌లకు ఈసారి బడ్జెట్‌లో స్వల్పంగా కేటాయింపు పెరిగింది. మేకల, గొర్రెల పథకానికి కూడా నిధులు కేవలం రూ. 100 కోట్లతోనే సరిపెట్టింది ప్రభుత్వం. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కోసం ఈసారి రూ. 200 కోట్లను కేటాయించింది. విశ్వవిద్యాలయాల్లో దీర్ఘకాలంగా డెవలప్‌మెంట్ పనులు జరగడంలేదన్న అసంతృప్తితో ఈసారి రూ. 500 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌లలో సంక్షేమానికి పెద్దపీట వేసినట్లుగానే ఈసారి కూడా అదే ప్రాధాన్యతను కంటిన్యూ చేసింది. విద్యారంగంలో కొత్త ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుపై మంత్రి హామీ ఇచ్చారు.

కేంద్రంతో ఘర్షణ.. తగ్గిన అప్పులు

కేంద్రంతో ఘర్షణ కారణంగా రాష్ట్రానికి ఆర్థికంగా జరిగిన ఇబ్బందులు ఈ బడ్జెట్‌లో ప్రతిబింబించాయి. గత బడ్జెట్‌లో రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకోవాలనుకున్న రూ. 53,970 కోట్లలో సుమారు రూ. 15,033 కోట్ల మేర కోత పడడంతో తాజా బడ్జెట్‌లో జాగ్రత్తలు తీసుకున్నది. వాస్తవికంగా ఎంత సాధ్యమవుతుందో లెక్కలు వేసుకుని దాన్ని రూ. 40,615 కోట్లకు కుదించుకున్నది. అప్పుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నది. కేంద్రం నుంచి గతేడాది రూ. 41 వేల కోట్ల మేర గ్రాంట్లు వస్తాయని అంచనా వేసుకున్నా రివైజ్డ్ ఎస్టిమేట్స్ లెక్కల్లో దాన్ని రూ. 30 వేలకు కుదించుకున్నది. కానీ తొమ్మిది నెలల్లో వచ్చింది రూ. 7,700 కోట్లు మాత్రమే. రానున్న నెలన్నర వ్యవధిలో స్వల్పంగా మాత్రమే సమకూరే అవకాశం ఉన్నది.

ఆదాయ వనరులు తగ్గిపోవడంతో భారీ వెల్ఫేర్ స్కీమ్ లేదా కొత్త పథకాన్ని ప్రకటించడానికి సర్కారు ధైర్యం చేయలేకపోయింది. డబ్బులకు ఏర్పడ్డ చిక్కులతోనే దళితబంధుకు గతేడాది రూ. 17,700 కోట్లు కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఈసారి కూడా అంతే స్థాయిలో కేటాయించింది. సొంత జాగా ఇండ్ల స్కీమ్‌కు సైతం గత బడ్జెట్‌లోనే హామీ ఇచ్చినా ఆచరణలోకి రాలేదు. ఇప్పటికీ మార్గదర్శకాలు రూపొందలేదు. రుణమాఫీకి గతేడాది బడ్జెట్‌లో స్పష్టమైన హామీ ఇచ్చినా దాన్ని అమలుచేయలేదు. రైతుల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి రూ. 90 వేల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు కేటాయింపులు చేశారు మంత్రి.

ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోడానికి సంచలనాలు ఉంటాయన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఎప్పటిలాగానే బడ్జెట్ కనిపించింది తప్ప కేసీఆర్ మార్కు కనపడలేదన్న కామెంట్లు వివిధ సెక్షన్ల ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి. విపక్ష పార్టీల నేతలు సైతం బడ్జెట్‌ను విమర్శించారు. కొత్తదనమేదీ లేదని, అంకెల గారడీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ మోడల్‌తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్న కేసీఆర్ బడ్జెట్‌లోనే ఫెయిల్ అయ్యారన్న విమర్శలూ వచ్చాయి. గుణాత్మక మార్పు అంటూ గంభీర ప్రకటనలు చేసినా ఆ ముద్ర రాష్ట్ర బడ్జెట్‌లో కనిపించనే లేదన్నారు.


Next Story

Most Viewed