గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి.. కారణమదేనా?

by Disha Web Desk 4 |
గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి.. కారణమదేనా?
X

దిశ, జడ్చర్ల/రాజాపూర్: కడుపునొప్పితో బాధపడుతూ గంటల వ్యవధిలో అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటన బాలనగర్ మండలంతో పాటు ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. బాలానగర్ మండలం చిన్న రేవల్లి గ్రామానికి చెందిన బైరమోని జంగయ్య భార్యా అంజమ్మ దంపతులకు రమేష్(12) శివ (10) ఇద్దరు సంతానం.

కాగా ఆరేళ్ల క్రితం అంజమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి జంగయ్య జీతం పనిచేసుకుంటూ ఇద్దరు కుమారుల ఆలన పాలన చూసుకునేవాడు. ఇద్దరు కుమారుల పెద్దవాడైన రమేష్ కోళ్ల ఫారంలో పనికి వెళ్తుండగా.. చిన్న కుమారుడైన శివ ఇంటి వద్ద ఉండేవాడు. శనివారం అన్నదమ్ములు ఉదయం వండిన అన్నం రాత్రి తిని పడుకున్నారు. రమేష్, శివకు శనివారం మధ్య రాత్రి కడుపులో నొప్పి రాగా తండ్రికి తెలపడంతో తండ్రి ఇనో ప్యాకెట్ తీసుకువచ్చి తాగించాడు.

అయినా కడుపులో తీవ్రమైన నొప్పితో ఆదివారం తెల్లవారుజామున చిన్నారులు ఇద్దరు వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో అల్లాడారు. ఈ విషయం గ్రామస్తులకు జంగయ్య తెలపడంతో గ్రామస్తులు 108 సహాయంతో షాద్ నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పెద్ద కుమారుడు రమేష్ మృతి చెందాడు. శివను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో చిన్న రేవల్లి గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయాలు అలుముకున్నాయి.

గ్రామంలో ఎంతో చురుకుగా ఉండే చిన్నారులు ఇద్దరు ఒకే రోజు అనారోగ్యానికి గురై గంటల వ్యవధిలో మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తినరవల్లి గ్రామం రాజాపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండడంతో చిన్నారుల తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరు చిన్నారుల మృతికి ఫుడ్ పాయిజన్ కారణమా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఇద్దరు అన్నదమ్ముల పోస్టుమార్టం రిపోర్టు వస్తే క్లారిటీ వస్తుందని రాజపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed