రాష్ట్రంలో మొదలైన ఎన్నికల వేడి.. ఎనిమిది నెలల ముందే ప్రచారం షురూ!

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో మొదలైన ఎన్నికల వేడి.. ఎనిమిది నెలల ముందే ప్రచారం షురూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. గత ఎన్నికల్లో రెండు పక్షాల మధ్య జరిగిన పోటీ ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరీగా నెలకొన్నది. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి తెర లేపాయి. అన్ని పార్టీలూ రకరకాల పేర్లతో రోడ్డెక్కాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించే తరహా హామీలను ప్రజలకు ఇస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ప్రజల భాగస్వామ్యంతో ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి. ప్రజల మధ్యనే ఉండాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వివిధ సెక్షన్ల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని ఏకరువు పెడుతున్నాయి. మూడు పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం, విమర్శల పర్వం ఊపందుకున్నది.

దాదాపు తొమ్మిది నెలల ముందే పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఎన్నికలను నిర్వహించాల్సిన కేంధ్ర ఎలక్షన్ కమిషన్ సైతం అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే టర్ల జాబితా సవరణ, ఒక్కో పోలింగ్ బూత్‌లో ఉండాల్సిన ఓటర్లు, దానికి తగినట్లుగా పోలింగ్ కేంద్రాల సంఖ్య, ఈవీఎంల అవసరం, తనిఖీల అనంతర, జిల్లా కేంద్రాలకు తరలింపు, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు నిర్వహణపై శిక్షణ అందించడం, చివరి నిమిషం వరకూ ఓటర్లుగా జాబితాలో చేరేందుకు కల్పించాల్సిన అవకాశం, వీలైనంత ఎక్కువగా పోలింగ్ పర్సంటేజీని పెంచడం.. ఇలాంటి అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉన్నదని, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారన్న విమర్శలు కామన్. ఈసారి అన్ని పార్టీలో మరింత అప్రమత్తమయ్యాయి.

ముందస్తు ఎన్నికలు, పార్లమెంటుతో కలిపి నిర్వహించే అవకాశం లాంటి సందేహాలు ఎలా ఉన్నా అటు పార్టీలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రంగంలోకి దిగాయి. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని అధికార పార్టీ భావిస్తున్నది. వార్షిక బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు అనుగుణంగా పథకాలవారీగా నిధుల విడుదలపై దృష్టి పెట్టింది. ఆర్థిక వనరుల సమీకరణ కోసం పడరాని పాట్లు పడుతున్నది. మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం వ్యూహ ప్రతివ్యూహాలతో జనంలోకి వెళ్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ విమర్శిస్తూ వరంగల్ డిక్లరేషన్ మొదలు తాజా పాదయాత్ర వరకు ప్రజలకు హామీలు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కుటుంబ పాలన, అవినీతి అంశాలతో బీజేపీ ప్రోగ్రామ్ తీసుకున్నది.

గత ఎన్నికల్లో కనిపించని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈసారి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్, ఆయన హయాంలో ఉనికిలోకి వచ్చిన స్కీమ్‌లపై షర్మిల ఆధారపడుతున్నారు. అందరికంటే ముందుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. బహుజన రాజ్యాధికారం నినాదంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ సైతం బరిలో ఉన్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న రెండు లెఫ్ట్ పార్టీలు ఈసారి బీఆర్ఎస్‌తో కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో గత ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసిన తెలుగుదేశం కూడా ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల ఫైట్ భిన్నంగా ఉండనున్నది.

ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీఆర్ఎస్ పార్టీ తొలుత దృష్టి పెట్టేది ఆత్మీయ సమ్మేళనాలపైనే. ఉప ఎన్నికల సమయంలోనూ కుల సంఘాలతో విడివిడిగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి భవన్‌ల నిర్మాణానికి వ్యక్తిగతంగా, పార్టీ తరఫునా ఆర్థిక సాయం చేస్తామంటూ సీనియర్ లీడర్లు రంగంలోకి దిగి హామీ ఇస్తుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తనదైన శైలిలో పార్టీ కార్యకర్తలతో సెగ్మెంట్లవారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నది. అసంతృప్తి, అసమ్మతి ఉంటే వెంటనే వారికి కొన్న హామీలు ఇచ్చి సర్దిజెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీలో లుకలుకలు లేకుండా చేసుకోవడమే లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయి. గ్రూపులు, వర్గాలతో జరిగే నష్టాన్ని నివారించుకోవడంలో భాగంగా తొలి దశలో ఇవి జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా రానున్న కాలంలో కులసంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు జరగనున్నయి. భారీ బహిరంగ సభల ద్వారా విస్తతంగా జనసమీకరణ చేసి పార్టీకి తగిన బలం ఉన్నదనే మెసేజ్‌ను ప్రజల్లోకి పంపే ప్రయత్నాలు మున్ముందు జరగనున్నాయి.

పాదయాత్రలతో కాంగ్రెస్ హడావిడి

తొలుత భారత్ జోడోయాత్ర, ఆ తర్వాత హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పేరుతో రాష్ట్రంలో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్రలు జరిగాయి. పార్టీ లీడర్లు విడిగా పీపుల్స్ మార్చ్ లాంటి పేర్లతో జరుపుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్రలతో పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం వారివారి నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేశారు. ఇకపైన కూడా చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వంపట్ల, అధికారపార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను తనవైపు తిప్పుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే గతేడాది వరంగల్‌లో జరిగిన సభలో రానున్న ఎన్నికల కోసం పలు పాయింట్లతో డిక్లరేషన్‌ను ప్రకటించింది. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తదితర హామీలను ఇచ్చింది. జాతీయ నాయకులను రాష్ట్రానికి ఆహ్వానించి భారీ స్థాయిలో బహిరంగసభలను నిర్వహిస్తున్నది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రచారాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నది.

స్ట్రీట్ కార్నర్ మీటింగులు, నిరసనలపై బీజేపీ ప్లాన్

ప్రతీ గ్రామాన్ని టచ్ చేసే విధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగులను నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ ఓటు బ్యాంకును కైవశం చేసుకోడానికి బూత్ సశక్తీకరణ్ అభియాన్ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా మూడు వారాల వ్యవధిలోనే 11 వేలకు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగులను పెట్టింది. తన స్వంత బలం ఏ మేరకు ఉన్నదో స్వయంగా పరీక్షించుకున్నది. బీజేపీ స్టేట్ చీఫ్ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజా సంగ్రామ యాత్రను ఐదు దశల్లో నిర్వహించారు. మిగిలిపోయిన సెగ్మెంట్లలో దీన్ని ఆరవ విడతగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభతువం పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకునేందుకు నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని వరంగల్‌లో నిర్వహించి మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోనూ కంటిన్యూ చేయాలనుకుంటున్నది. కుటుంబ పాలన, అవినీతి, హామీల వైఫల్యం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లాంటి అంశాలతో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రోగ్రామ్‌లకు ప్లాన్ చేసింది.

కాంగ్రెస్, బీజేపీలు ఏక కాలంలో ప్రభుత్వ వ్యతిరేకతపై ఎక్కువగా ఆధారపడుతూనే ముఖ్యమంత్రి కుటుంబ అవినీతిని ప్రచారంలో వాడుకోవాలనుకుంటున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వారి ప్రసంగాల్లో పదేపదే వీటినే ప్రస్తావిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వారివారి పార్టీలు ప్రజలకు ఏం చేయబోతున్నాయనేదాన్ని నొక్కిచెప్తున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో లేని స్కీమ్‌లు తెలంగాణలో అమలవుతూ ఆదర్శ పాలన అందిస్తున్నదనేది అధికార బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం. ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ పోటీ నెలకొన్నది. కేంధ్ర ఎలక్షన్ కమిషన్ నుంచి ముగ్గురు సభ్యుల బృందం వచ్చి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర అధికారులతో చర్చించి వెళ్ళినందున ఇకపైన పొలిటికల్ హీట్ పెరగనున్నది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో ఈ పార్టీల మధ్య పోటీ ఇంకొంత వేడెక్కనున్నది.


ఇవి కూడా చదవండి:

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అరకొరగా వైద్య సేవలు

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story