నెరవేరని రైతు వేదికల లక్ష్యం.. కోట్ల ఖర్చు వృధా..

by Disha Web Desk 13 |
నెరవేరని రైతు వేదికల లక్ష్యం.. కోట్ల ఖర్చు వృధా..
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమున్నత లక్ష్యం తో సర్కారు ఏర్పాటు చేసిన రైతు వేదికల లక్ష్యం నీరుగారుతోంది. రైతులకు పంటల మార్పిడి, సాగు విధానాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉండగా.. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో బతుకమ్మ చీరెల పంపిణీలు, ఇతరత్రా కార్యకలాపాలకు వేదికలవుతున్నాయి. వ్యవసాయ శాఖ కార్యక్రమాలు లేవు కనుక ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని అగ్రికల్చర్ అధికారులే చెబుతుండడం గమనార్హం.

ఈ ఏడాది బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తోన్న ప్రజా ప్రతినిధులు పలు చోట్ల రైతు వేదికలనే సభా వేదికలుగా చేసుకుని చీరెలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో అక్కడి ఎమ్మెల్యే రైతు వేదిక నుంచే బతుకమ్మ చీరెలను గురువారం పంపిణీ చేశారు. దీంతో రైతు వేదికలు రైతుల కోసమా లేక ఇతర కార్యక్రమాల కోసమా అన్న చర్చ మొదలైంది. కాగా గతంలోనూ ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఏకంగా పెళ్లి కార్యక్రమానికే రైతువేదికను ఇవ్వడం గమనార్హం.

కోట్ల ఖర్చు వృధా..

దాదాపు రూ.570 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన రైతు వేదికల లక్ష్యం పక్కదారి పడుతోంది. ఇప్పటికీ పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతు వేదికల ద్వారా అన్నదాతలకు ఎలాంటి సలహాలు, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు అందడం లేదు. ఇదే సమయంలో ఇతర కార్యక్రమాలకు వేదికలను ఉపయోగించడంతో కోట్ల ఖర్చు వృధా అవుతుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా సర్కారు వీటిపై దృష్టి సారించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.


Next Story

Most Viewed