టెక్స్‌టైల్ పార్క్‌ ఫర్ సేల్

by Disha Web Desk 21 |
టెక్స్‌టైల్ పార్క్‌ ఫర్ సేల్
X

దిశ, చౌటుప్పల్: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించి, ఆకలి చావులు లేకుండా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు, పలువురు పారిశ్రామికవేత్తలు తూట్లు పొడిచారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఇక్కడి అధికారులతో కుమ్మక్కై పారిశ్రామికవేత్తలు భారీ భూ దందాను నిర్వహించారు.

గజం రూ.150 కే

చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 758, 765లో సుమారు 50 ఎకరాల భూమిని టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం కేటాయించారు. ఇందులో 1000 గజాల విస్తీర్ణంలో 120 ప్లాట్లను చేశారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ ప్లాట్లను అప్పగించారు. కొందరు పారిశ్రామికవేత్తలు అధికారులతో కుమ్మక్కై కొన్ని ప్లాట్లను గజం రూ.150కే దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. అందుకు సంబంధించిన బిల్లులను సంబంధిత శాఖకు అందజేస్తే యాజమాన్యం పేరు మీద ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ కొందరు పరిశ్రమలు ఏర్పాటు చేయకున్నా వారి పేరిట రిజిస్ర్టేషన్ చేశారు. ఈ ప్లాట్లపై పలువురు పరిశ్రమల యజమానులు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి ఇతరులకు అమ్మేశారు. ప్రస్తుతం ఈ పార్కులో కేవలం ఒకే ఒక పరిశ్రమ కొనసాగుతోంది.

‘ఫర్‌ సేల్’ బోర్డులు

పరిశ్రమల స్థాపనకు కేటాయించిన భూములను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. పరిశ్రమల్లో ఉత్పత్తి కొనసాగకుంటే వాటిని రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అధికారులు తనిఖీ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. కానీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత జౌళి శాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్న అధికారి బినామీ పేర ఫ్లాట్లను కేటాయించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ పరిశ్రమకు కేటాయించిన స్థలానికి ‘ఫర్ సేల్’ అనే బోర్డు ఏర్పాటు చేసి మరీ అమ్మేస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ ధర గజం రూ.40 నుంచి 50 వేల వరకు పలుకుతోంది. కోట్ల రూపాయల విలువైన భూములపై పరిశ్రమలశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మా దృష్టికి రాలేదు

పరిశ్రమల స్థాపన కోసం కేటాయించిన ప్లాట్లు అమ్మకాలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. టెక్స్‌టైల్ పార్కులో ఉత్పత్తులు చేస్తున్న, చేయని పరిశ్రమలను తనిఖీ చేసి చర్యలకు సిఫారసు చేస్తాం. విచారణ అనంతరం అమ్మకాలు జరిగినట్లు తేలితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

- కె.విద్యాసాగర్, ఏడీ, చేనేత జౌళిశాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా

Next Story