సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు టెస్టింగ్ టైం.. నో అప్‌డేట్ నో జాబ్!

by Disha Web |
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు టెస్టింగ్ టైం.. నో అప్‌డేట్ నో జాబ్!
X

ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న పరిస్థితుల్లో చాలా ఐటీ కంపెనీలు వీలైనంత వరకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. స్కిల్స్‌లేని వారు, మూసపద్ధతిని అనుసరిస్తున్న వారికి మంగళం పాడుతున్నాయి. ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిన వారికి ఎలాంటి ఢోకా లేదు. అలా కాకుంటే జాబ్ పోయినట్టే. ఇటీవల గూగుల్‌ 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సాఫ్ట్ వేర్ స్కిల్స్ అప్‌డేట్ చేసుకోకపోవడంతోనే జాబ్స్ కోల్పోయారని తేలింది.

స్కిల్స్ ఉన్న వారికి మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉందనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా 24 శాతం ఐటీ కంపెనీలు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కనెక్ట్ అయ్యాయి. అంటే మిగతా 76 శాతం కంపెనీల్లో ఇలాంటి కొరత ఉందని స్పష్టమవుతున్నది. ఒక వేళ అలాంటి కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తే అంతే సంగతులు. గ్లోబల్ మార్కెట్లోకి వచ్చిన కొద్దికాలంలోనే చాట్ జీపీటీ వంటివి మార్కెట్‌ను ఏలుతుండటంతో సంప్రదాయపు కంపెనీలన్నీ క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఏ రంగంలోనైనా మూస పద్ధతిలో పని చేసే తత్వం కలిగిన వారెవరైనా జాబ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. గూగుల్ కంపెనీ 12 వేలు, అమెజాన్ 18 వేలు, మైక్రోసాఫ్ట్ కంపెనీ 5 శాతం ఎంప్లాయీస్‌ను తొలగించినట్టు వచ్చిన వార్తలను బట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తు టెక్నాలజీకి ఢోకా లేదు. వాడకం పెరిగిపోయినా జాబ్‌లు తగ్గిపోతున్నాయని కాదు. అప్‌డేట్ వెర్షన్స్‌తో పని చేసే నైపుణ్యం కలిగిన వారికి రిక్రూట్‌ చేసుకునేందుకు కంపెనీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడే కంపెనీల సంఖ్య 24 శాతానికి మించలేదు. మిగతా 76 శాతం కంపెనీల్లో నైపుణ్యంతో పని చేసే ఉద్యోగుల కొరత ఉందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ చెబుతున్నది. ఐటీ రంగంలోనూ ఉద్యోగాలు కోల్పోయిన అంశంపై 120 మంది ప్రొఫైల్స్ స్టడీ చేయడం ద్వారా వారిలో స్కిల్స్ లేకపోవడమే ప్రధాన కారణమని తేలింది. ఒక వేళ అలాంటి కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తే కొత్త జాబ్‌లు వెతుక్కోవాల్సిందే. గ్లోబల్ మార్కెట్లోకి వచ్చిన కొద్దికాలంలోనే చాట్ జీపీటీ వంటివి మార్కెట్‌ను ఏలుతుండగా.. సంప్రదాయపు కంపెనీలన్నీ క్లోజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

వేగంగా డిజిటల్ మార్కెట్

కరోనా సమయంలో రిక్రూట్‌మెంట్ పెరిగింది. కొవిడ్ సంబంధిత హెల్త్ కేర్, టెలీ మెడిసిన్, ఎడ్యుకేషన్, లెర్నింగ్ యాప్స్, ఎంటర్ టైన్‌మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. చాలామంది క్లయింట్స్ ముందుకొచ్చారు. డిజిటల్ మార్కెట్ మరింతగా పుంజుకుంది. ప్రసిద్ధ సాఫ్ట్ వేర్ కంపెనీలు పలువురు క్లయింట్స్ ప్రాజెక్టులకు సైన్ చేశాయి. ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఎంతో మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. మొత్తానికి డిజిటల్ మార్కెట్ విస్తృతమైంది.

దీంతో ప్రాజెక్టులను సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు చాలా కంపెనీల ఉద్యోగుల సంఖ్యను పెంచుకుని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఇబ్బడిముబ్బడిగా నియమించుకున్నాయి. కానీ రెండు, మూడేండ్లల్లోనే పరిస్థితి తలకిందులైంది. ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొత్త ప్రాజెక్టుల ఒప్పందాలు తగ్గాయి. అప్పటికే పెరిగిన ఉద్యోగుల జీతాలతో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు చర్యలకు కంపెనీలు సిద్ధపడ్డాయి. ఆర్థిక మాంద్యం నుంచి ఒడ్డున పడేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పనిసరిగా మారింది. అందుకే ప్రముఖ గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయని నిపుణులు చెప్తున్నారు.

భారీ వేతనదారులపైనే వేటు

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు కంపెనీలు అలెర్ట్ అయ్యాయి. అందుకే ఎక్కువ వేతనాలతో అన్ స్కిల్డ్, అప్ డేట్ కాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ప్రతి నెలా రూ.లక్షల్లో వేతనాలు తీసుకునే వారిపైనే ఆర్థిక మాంద్యం ప్రభావం ముందుగా పడుతున్నది. ఇప్పటికీ కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు జీపీఎస్‌ను మాన్యువల్‌గా వాడేవారు ఉన్నారు. ఆటోమెటేషన్ వర్క్ కలిగిన వారికి ఉద్యోగ భద్రత ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా సంక్షోభం నుంచి డిజిటల్ మీడియాకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఇక ముందు కూడా అవకాశాలు మెరుగుపడనున్నాయని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఏఐతోనే భద్రత

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఆటోమేటేషనే ప్రధానం. ఇటీవల గూగుల్‌ 12 వేల మందిని తొలగించింది. దీనిపై తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ స్టడీ చేసింది. తొలగించినవారు సాఫ్ట్ వేర్ స్కిల్స్ అప్‌డేట్ చేసుకోకపోవడమే ప్రధాన కారణంగా తేలింది. కాలానికి అనుగుణంగా, పరిస్థితులను బట్టి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 85 మిలియన్ మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రస్థానంలో నిలుస్తుంది. దీని ద్వారా 97 మిలియన్ ఉద్యోగాల కల్పనకు చాన్స్ ఉంది. అంటే సాఫ్ట్ వేర్ రంగంలో అదనంగా 12 మిలియన్ ఉద్యోగాలు రానున్నాయి. స్కిల్స్ పెంచుకోవడం ద్వారానే ఉద్యోగ భద్రత ఉంటుంది. భవిష్యత్తు తరాలు కూడా సరికొత్త అప్లికేషన్లు, సాఫ్ట్ వేర్ స్కిల్స్‌కు అలవాటు పడాల్సిందే. అగ్రికల్చర్, బ్యాంకింగ్, హెల్త్, మీడియా, ఎంటర్ టైన్‌మెంట్ తదితర రంగాల్లో కొత్త టెక్నాలజీ వాడకం పెరిగింది. వాటిపై దృష్టి పెట్టే వారికి ఎలాంటి ప్రమాదం లేదు.

24 శాతమే ఏఐ బేస్డ్

డబ్ల్యూఈఎఫ్ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 24 శాతం ఐటీ కంపెనీలు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి కనెక్ట్ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అవసరం ఉన్నప్పటికీ 76 శాతం కంపెనీలు మాన్యువల్ స్కిల్స్‌తోనే నడుస్తున్నాయి. అంటే ఏఐ అప్లికేషన్స్‌తో పని చేసే ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. అప్‌డేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. స్కిల్డ్ మ్యాన్ పవర్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉంది.

జీపీటీ ఓ సంచలనం

ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ ఓ సంచలనం కానుంది. గూగుల్ వంటి అతి పెద్ద కంపెనీలకు సవాల్ విసురుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఆధారిత అప్లికేషన్‌తో తయారైన చాట్ జీపీటీ మనిషితో మాట్లాడినట్లే ఉంటుంది. 100 శాతం యూనిక్ కంటెంట్‌ను అందించనుంది. క్లౌడ్‌లోని డేటాను అనలైజ్ చేసి అందిస్తుంది. సామాన్యుడు కూడా వినియోగించే రోజు రానుందని టీటా స్పష్టం చేస్తున్నది. ఇందులో మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. చాట్ జీపీటీ అనేది ఐటీ రంగంలో ఓ ప్రభంజనమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలవర్చుకున్న వారికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. మొత్తానికి ఐటీ రంగం రూపాంతరం చెందుతుందని అనుకోవాల్సిందే.

ప్రతి రోజూ అప్ డేట్ కావాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కారణంగా ఐటీ రంగంలో చాలా మంది కొలువులు కోల్పోతున్నారు. అదే స్థాయిలో కొత్త వారికి అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ జాబర్స్ ప్రతిరోజూ అప్‌డేట్ కావాల్సిందే. గూగుల్ లో ఉద్యోగాలు కోల్పోయిన 120 మంది ప్రొఫైల్‌ను స్టడీ చేశాం. అన్ స్కిల్డ్ వారిపైనే ఎఫెక్ట్ పడిందని తేలింది. చాట్ జీపీటీ వంటివి మార్కెట్లోకి వచ్చిన తర్వాత పలు కంపెనీలు మూతపడాల్సిందే.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే మేం డిజిథాన్ ఇంటర్నేషనల్ ఇంటర్న్ షిప్ చాన్స్ ఇచ్చాం. చాలామందిని అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూర్‌కు కూడా పంపాం. ఐటీ‌లో కొత్త అవ‌కాశాల‌కు వేదిక‌ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్ కోర్సులు మారిపోగా వాటిలో ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం కల్పించాం. డిజిథాన్ సంస్థ ద్వారా పలువురికి చాన్స్ ఇచ్చాం. వ్యవసాయం, బ్యాంకింగ్, హెల్త్, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ వంటి రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతుంది. అందుకనుగుణంగా పని నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి.

- సందీప్ మక్తాల, గ్లోబల్ ప్రెసిడెంట్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్


Next Story