బడ్జెట్‌లో విద్యారంగానికి పది శాతం నిధులు కేటాయించాలి : ఏఐఎస్ఎఫ్

by Disha Web |
బడ్జెట్‌లో విద్యారంగానికి పది శాతం నిధులు కేటాయించాలి : ఏఐఎస్ఎఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి పది శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విద్యారంగంపై చాలా చిన్నచూపు చూస్తుందని విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వ విద్య ప్రమాణాలు తగ్గిస్తూ ప్రైవేట్ విద్యకు ప్రోత్సాహం ఇస్తున్నదని ఆరోపించారు. కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ఉన్నత విద్యాసంస్థల కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో ఉన్న జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం లాంటి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి విద్యాసంస్థలా కేటాయింపులపై కేంద్రాన్ని రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిలదీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ లు ఇవ్వకుండా, మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఫెలోషిప్స్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ లో వారికి మళ్ళీ నిధులు కేటాయించి స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ లో కేంద్రం విద్యకు కేవలం 2.6 శాతం నిధులు కేటాయించిందని దీన్ని బట్టి చూస్తే బీజేపీ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని విమర్శించారు. విద్యార్థుల స్టేషనరి వస్తువులపై జీఎస్టీ ఎత్తి వేసి, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, విదేశీ యూనివర్సిటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.


Next Story