- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తెలంగాణ కౌలు రైతుల సర్వే-2026’ నివేదిక విడుదల
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అసలైన సాగుదారులకు ఆ ఫలాలు అందడం లేదని ‘తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ నిర్వహించిన సర్వేలో తేలింది.

కౌలు రైతుల ఆగ్రహం
ఎన్నికల హామీలు అమలు చేయని ప్రభుత్వం
గుర్తింపు కార్డులు లేక అప్పుల ఊబిలో కర్షకులు
‘తెలంగాణ కౌలు రైతుల సర్వే-2026’ నివేదిక విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అసలైన సాగుదారులకు ఆ ఫలాలు అందడం లేదని ‘తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ నిర్వహించిన సర్వేలో తేలింది. భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, వీరిలో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. 22 జిల్లాల్లోని 1,816 మంది కౌలు రైతులతో మాట్లాడి రూపొందించిన ‘తెలంగాణ కౌలు రైతుల సర్వే-2026 సంక్షిప్త నివేదిక’ను కమిటీ మంగళవారం బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో విడుదల చేసింది.సర్వేలో పాల్గొన్న వారిలో 47.2 శాతం బీసీలు, 26.9 శాతం ఎస్సీలు, 13.9 శాతం ఎస్టీలు ఉన్నారు.
పెరిగిన కౌలు ధరలు.
రైతుబంధు/రైతుభరోసా నిధులు రావడం వల్ల కౌలు ధరలు తగ్గుతాయన్న గత పాలకుల వాదనలు అవాస్తవమని ఈ సర్వే తేల్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు కౌలు ధర ఎకరాకు రూ.14,936 కాగా, గరిష్టంగా రూ.53 వేల వరకు పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి భూయజమాని పట్టా పత్రాలు అడుగుతుండటంతో కౌలు రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పత్తి పండించిన వారిలో కేవలం 6.7 శాతం మంది, వరి పండించిన వారిలో కేవలం 17-20 శాతం మంది మాత్రమే తమ సొంత పేరుతో ప్రభుత్వానికి అమ్ముకోగలిగారు. మద్దతు ధర రూ.8,110 ఉన్న పత్తిని కౌలు రైతులు బహిరంగ మార్కెట్లో రూ. 6,500 కే తెగనమ్ముకుంటున్నారు. మరికొందరు భూయజమానుల పేర్లపై పంట అమ్మడానికి రూ.10 వేల వరకు కమీషన్లు ఇచ్చుకుంటున్నారు. బ్యాంకు రుణాలు అందకపోవడంతో కౌలు రైతులు 24 నుండి 36 శాతం వరకు భారీ వడ్డీలకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తెస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు అప్పులు ఉన్నాయి.
సీఎం హామీ ఏమైంది?
కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని అమలు చేస్తామని, అన్ని పథకాలు అందిస్తామని ఎన్నికల సమయంలో 2023 సెప్టెంబర్ 13న రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేదని, దీనిపై కౌలు రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొందని సాధన కమిటీ తెలిపింది. 30 శాతం మంది కౌలు రైతులు తమ హక్కుల కోసం నేరుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని సర్వేలో తేలింది.
సాధన కమిటీ ప్రధాన డిమాండ్లు
2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. దీనివల్ల భూయజమానుల హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రచారం చేయాలి. కౌలు గుర్తింపు కార్డు ఆధారంగా ఈ-క్రాప్ బుకింగ్, సబ్సిడీలు, బ్యాంకు రుణాలు నేరుగా కౌలు రైతు ఖాతాకే అనుసంధానం చేయాలి. ఆంధ్రప్రదేశ్ తరహాలో ‘భూయజమాని సంతకం తప్పనిసరి’ అనే నిబంధన తెచ్చి కౌలు రైతుల పొట్ట కొట్టవద్దు. ఎలాంటి చట్టపరమైన మార్పులు చేయాలన్నా కౌలు రైతుల వేదికలతో చర్చించి, వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలి.






