తెలంగాణకు ఎన్జీటీ షాక్.. రూ. 3,800 కోట్ల ఫైన్

by Disha Web Desk 4 |
తెలంగాణకు ఎన్జీటీ షాక్.. రూ. 3,800 కోట్ల ఫైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ కాలుష్యం జరుగుతున్నా నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 3,800 కోట్ల జరిమానా విధించింది. రెండు నెలల్లోగా దీన్ని చెల్లించాలంటూ డెడ్‌లైన్ విధించింది. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, పర్యావరణానికి హాని జరిగినందుకు లెక్క గట్టిన ఎన్జీటీ ప్రత్యేక అకౌంట్‌లో ఈ డబ్బును జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ సురక్ష అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల 29న విచారించిన ఢిల్లీలోని ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ సోమవారం ఆర్డర్‌ను జారీచేసింది. తెలంగాణ తరఫున వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆగస్టు 29న విచారణకు హాజరైన ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇచ్చిన వివరణపై ఎన్జీటీ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

వ్యర్థాల నిర్వహణలో గతంలో సుప్రీంకోర్టు, ఎన్జీటీ జారీచేసిన వేర్వేరు మార్గదర్శకాలను, తీర్పులను అమలు చేయనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకు సగటున 1,824 మిలియన్ లీటర్ల లిక్విడ్ వ్యర్థాలను సీవరేజ్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరణ చేయడంలో అలక్ష్యం జరిగిందని, దీనికి పరిహారంగా ఒక్కో మిలియన్ లీటర్ల వ్యర్థానికి రూ. 2 చొప్పున మొత్తం రూ. 3,648 కోట్లుగా నిర్ధారించినట్లు జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, ప్రొఫెసర్ సెంథిల్‌వేల్, డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్‌లతో కూడిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ ఆదేశాలు జారీచేసింది.

నిర్లక్ష్యం కారణంగా 5.9 మిలియన్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయని, ఒక్కో టన్నుకు రూ. 300 చొప్పున సుమారు రూ. 177 కోట్ల నష్టపరిహారాన్ని భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో వైఫల్యానికి, దాని కారణంగా జరిగిన నష్టాన్ని మొత్తంగా రూ. 3,825 కోట్లు అయిందని పేర్కొన్నది. చివరకు రూ. 3,800 కోట్లకు రౌండాఫ్ చేస్తున్నట్లు పేర్కొని రెండు నెలల్లోగా చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటివరకు జరిగిన నష్టానికి మాత్రమే జరిమానా వేశామని, ఇకపైన ఇలాంటిది జరగకుండా సీవరేజ్ ప్లాంట్ల వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించింది.

మున్సిపాలిటీల్లో పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా చేయడంలేదంటూ పర్యావరణ సురక్షా అనే స్వచ్చంద సంస్థ 1996లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయగా అది 2014లో ఎన్జీటీకి బదిలీ అయింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణ, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు, అక్రమ ఇసుక మైనింగ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థ ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. పిటిషన్‌లోని రెండు అంశాలను ప్రస్తుతం విచారణకు స్వీకరించిన ఎన్జీటీ ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై మాత్రమే విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది. గతంలో పశ్చిమబెంగాల్ విషయంలోనూ ఇదే తరహాలో రూ. 3,500 కోట్ల జరిమానా విధించింది.


Next Story

Most Viewed