అన్నదాత మృత్యు ఘోష.. ఏడేండ్లలో 5 వేల మంది ఆత్మహత్య

by Disha Web Desk 2 |
అన్నదాత మృత్యు ఘోష.. ఏడేండ్లలో 5 వేల మంది ఆత్మహత్య
X

తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. ఇదీ తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచార ట్యాగ్ లైన్..! దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. రైతుబీమా, రైతుబంధు తదితర పథకాలు దేశానికి రోల్ మోడల్ అని పేర్కొంటుంటారు. ఇదంతా నాణేనికి ఒక వైపు. మరో వైపు పరిశీలిస్తే.. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏడేండ్ల వ్యవధిలో ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది ఏడు నెలల వ్యవధిలోనే 300 మంది బలవన్మరణాలకు పాల్పడ్డట్టు రికార్డులు చెబుతున్నాయి. అన్నదాతల ఆత్మహత్యలకు కారణాలేంటి..? వాటిని ఆపలేమా..? బలిపీఠం ఎక్కుతున్న బక్కరైతు కోరుకుంటున్నదేమిటి..?

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ.. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నాల్గవ స్థానంలో ఉన్నది. రైతుబంధు, రైతుబీమా లాంటివి దేశంలో ఎక్కడా లేవని, తెలంగాణకు మాత్రమే ప్రత్యేమని ప్రభుత్వం చెప్తున్నా.. అన్నదాతల మృత్యుఘోష ఆగడం లేదు. రైతే రాజు కావాలి, రాజకీయాల్లోకి రావాలి, చట్టసభల్లోకి అడుగుపెట్టాలి, కేంద్రంలో ఇక వచ్చేది రైతు ప్రభుత్వమే అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నా బక్కరైతు బలిపీఠమే ఎక్కుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో 5,035 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుబీమా లెక్కల ప్రకారం అన్ని రకాల మరణాలతో కలిపి సుమారు 85 వేల మంది కన్నుమూశారు. ఈ ఏడాది గడచిన ఏడు నెలల్లో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించి రాష్ట్రంలో వినూత్నంగా అమలవుతున్న పథకాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వివిధ రకాల స్కీమ్‌లను వివరించే బ్రోచర్‌లను పంచిపెట్టారు.

రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల, రైతు సంక్షేమ పథకాలపై వివరించారు. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటివి తెలంగాణకే ప్రత్యేకమని చెప్పారు కానీ కేంద్ర హోంశాఖ ఏటా విడుదల చేసే క్రైమ్ రికార్డు బ్యూరోకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలనే పరిగణనలోకి తీసుకుంటే 2015-21 మధ్యకాలంలో 4,735 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు, పంటల ఖర్చుకు తగిన ఆదాయం రాకపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడం లాంటివి ప్రధాన కారణాలు. రైతుబంధు స్కీమ్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దాని స్థానంలో విత్తన సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఇన్‌పుట్ సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ, పంటలకు నష్టపరిహారం, పంటల బీమా లాంటివన్నీ అటకెక్కించిన విషయాన్ని ప్రస్తావించడంలేదు. రైతుబంధును సర్వరోగ నివారిణిగా భావిస్తున్నది. పంటల రుణమాఫీ హామీ ఇచ్చినా విడతలవారీగా అమలు చేస్తుండడంతో రైతులకు సంపూర్ణ స్థాయిలో రిలీఫ్ అందడంలేదు. గతేడాది అమలు కావాల్సిన రూ. 50 వేల లోపు రుణాల మాఫీ రూ. 35 వేల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ సంవత్సరం రూ. 75 వేల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇక కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపే ఇవ్వకపోవడంతో రైతుబంధు, రైతుబీమా పథకాలకు నోచుకోలేకపోయారు. సకాలంలో రుణ మాఫీ జరగకపోవడంతో రైతులకు ప్రైవేటు అప్పులు తప్పడంలేదు. రైతుబీమా పేరుతో ఏ కారణంతో మృతి చెందినా బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్సు కంపెనీ నుంచి రూ. 5 లక్షల నష్టపరిహారం అందుతూ ఉన్నదని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించారు. నాలుగేళ్లలో సుమారు 85 వేల మందికి బీమా పరిహారం అందినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ స్కీమ్ రాక ముందు జీవో 194 ప్రకారం వయసుతో నిమిత్తం లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూ. 5 లక్షల పరిహారం అందే విధానం అమలైంది. కానీ రైతుబీమా వచ్చిన తర్వాత 59 ఏళ్ళలోపు వారికి మాత్రమే అమలు చేస్తుండడంతో అంతకన్నా ఎక్కువ వయసున్న రైతులకు పరిహారం అందడంలేదు.

కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకున్నది వ్యవసాయ రంగమేనంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కానీ నాలుగేళ్ళుగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలను నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లింపులో నిర్లక్యంకాగానే వ్యవహరించింది. కనీసం పంట నష్టం లెక్కలను కూడా సేకరించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పాలసీని అమలుచేయకపోగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన అమలు నుంచీ తప్పుకున్నది. నాలుగేళ్ళుగా ఎలాంటి పంటల బీమా పథకం అమలుకావడంలేదు. హైకోర్టు 2021 సెప్టెంబరులో పంట నష్టానికి పరిహారం చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడానికి బదులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక రైతులకు యాంత్రికీకరణ (ఫామ్ మెకనైజేషన్) స్కీమ్ సైతం నత్తనడకనే అమలవుతున్నది. వ్యవసాయ రంగంలో, రైతు సంక్షేమంలో దేశం మొత్తానికి 'తెలంగాణ మోడల్'ను ప్రచారం చేయాలని, రాష్ట్రాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో సభలు పెట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలోని రైతుల దయనీయ పరిస్థితులు, అనేక స్కీమ్‌లు అమలవుతున్నా ఆత్మహత్యల్లో నాల్గవ స్థానంలో నిలవడం సంకటంగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2015-21 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు (2022 ఏడాదిలో జనవరి నుంచి ఆగష్టు 31 వరకు) :

ఏడాది రైతులు

2015 1400

2016 632

2017 846

2018 900

2019 491

2020 466

2021 359

2022 300

ఆత్మహత్యలు ఆగలేదు

"రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్న మాట వాస్తవం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమూ పెద్దగా స్పందించడంలేదు. ఇది బాధాకరం. కేవలం రైతుబంధు పథకంతోనే రైతుల జీవితాల్లో ఆనందాలు రావు. కానీ వస్తాయన్న భ్రమలో ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు అన్నదాతల ఆత్మహత్యలపై దృష్టి సారించాలి. లేదంటే భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నది. రైతుబీమాతో పాటు జీవో 194ను కూడా అమలుచేయాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం కౌలు రైతులను కూడా గుర్తించాలి. క్షేత్రస్థాయిలో సేద్యం చేస్తున్నవారిలో గణనీయమైన భాగం కౌలు రైతులే. ప్రభుత్వం లోతైన విశ్లేషణ చేయాలి". = కన్నెగంటి.రవి, రైతు స్వరాజ్య వేదిక.

Also Read : సినిమాల్లో అదరగొట్టిన వీళ్లు కూడా ముందు టీచర్లే!

Next Story

Most Viewed