తొమ్మిదేండ్లుగా సర్కార్ నిర్లక్ష్యం.. 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదా?

by Disha Web Desk 2 |
తొమ్మిదేండ్లుగా సర్కార్ నిర్లక్ష్యం.. 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదా?
X

రాజకీయ పార్టీలకు గల్ఫ్ గుబులు పట్టుకున్నది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్‌కు ఇది సంకటంగా మారింది. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్నా.. ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీకి గుదిబండగా మారనున్నది. మరో వైపు గల్ఫ్ కార్మికుల సమస్యలను లేవనెత్తడంలో కాంగ్రెస్, బీజేపీ వెనకబడ్డాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని చిన్నాచితక పార్టీలు గల్ఫ్ కార్మికుల తరపున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని 14 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఇప్పుడు ఎవరి వైపు నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. (మంద భీంరెడ్డి)

కవిత ఓటమికీ కారణమిదేనా?

గల్ఫ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే 2019 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓడిపోయారనే ప్రచారం జరిగింది. గల్ఫ్ సమస్య ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ లోక్‌ సభ స్థానాలనూ బీఆర్ఎస్ కోల్పోయింది. ఓటమిపై అంతర్గత విశ్లేషణ చేసుకోవాల్సిన ఆ పార్టీ.. తన వైఖరిని ఇప్పటికీ సరిదిద్దుకోవడం లేదు. ఈ బడ్జెట్‌ లోనూ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు చేయలేదు. ఎన్నారై సెల్‌ ను సచివాలయంలో భాగంగా పెట్టడంతో బాధిత కుటుంబాలకూ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయింది. అంతేకాకుండా ఎనిమిదిన్నరేళ్లలో 1,700 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లో చనిపోయిన రైతులకు ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర గల్ఫ్ మృతులకు మొండి చేయి చూపుతున్నారనే విమర్శలున్నాయి. దీని ఎఫెక్ట్ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై పడే అవకాశముంది. గల్ఫ్ కార్మిక కుటుంబాల ప్రభావం ఏయే సెగ్మెంట్ల పై ఉంటుందో ఇప్పటికే ఇంటలిజెన్స్ ఆరా తీసి, వివరాలను అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

నెరవేరని హామీలు..

గల్ఫ్ సంక్షేమ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ ఇప్పటికీ రూపొందలేదు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏటా రూ. 500 కోట్ల బడ్జెట్, గల్ఫ్ మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షల సాయం హామీ నెరవేరకుండా పోయింది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెన్షన్ వంటివి తొమ్మిదేళ్లవుతున్నా అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఇప్పటికీ గల్ఫ్‌ దేశాల్లో అనేక ఇబ్బందుల నడుమ బతుకుతూ ఎంతో కొంత డబ్బుల్ని ఇంటికి పంపుతున్న కార్మికులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మృతదేహాన్ని స్వస్థలాలకు తరలించడమూ సమస్యాత్మకంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు 'చొరవ తీసుకుని డెడ్‌ బాడీని తెప్పించాం' అని చెప్పుకోవడమూ వినిపిస్తుంటుంది.

ప్రధాన పార్టీలకు పరేషానే..

గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ విఫలమైతే, వాటిని లేవనెత్తడంలో కాంగ్రెస్, బీజేపీ వెనకబడ్డాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ఫెయిల్ అయ్యాయి. కేంద్రంలోని అధికార బీజేపీ కూడా గల్ఫ్ వలసలపై నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నదనే అభిప్రాయమున్నది. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా చెప్పుకోదగ్గ పనులేమీ చేయలేదు. రాహుల్‌గాంధీ సందేశంతో ఇటీవల టీపీసీసీ విడుదల చేసిన నాలుగు పేజీల చార్జిషీట్‌ లోనూ గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదు. దీంతో మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గండం పొంచి ఉన్నది. అయితే బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, వైఎస్సార్‌టీపీలు గల్ఫ్ సమస్యలను బలంగా లేవనెత్తుతూ ముందుకు వెళుతున్నాయి. ఆ చిన్న పార్టీలు ఏం చేయగలుగుతాయనేది ఎలా ఉన్నా కనీసం వారి గురించి ఆలోచించే స్పృహతో ఉన్నాయన్న సంతృప్తి వ్యక్తమవుతున్నది.

గల్ఫ్ ఉద్యమం.. రాజకీయ అడుగులు

గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌ లలో దాదాపు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు బతుకుతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో సుమారు 30 లక్షల మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చేశారు. కుటుంబసభ్యులతో కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వీరి ఓటు బ్యాంకు కోటి వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ ఓటు బ్యాంకు సమీకృతమవుతుండడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త కోణం. అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడంతో స్వయంగా ఉద్యమించాలని గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. పసుపు బోర్డు ఉద్యమం తరహాలో గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ సాధన కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎత్తుగడగా ఉపయోగించుకోవాలని పావులు కదుపుతున్నాయి.

పోటీకి ఎన్నారైల సై!

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గల్ఫ్ ఎన్నారైలు హక్కుల సాధన ఉద్యమంలోనూ ముందున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి. చిన్న పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రవాసుల రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి పావులు కదుపుతున్నట్లు సమాచారం. 'జీరో బడ్జెట్ పాలిటిక్స్' (ధన ప్రభావం లేని రాజకీయం) నినాదంతో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు.

రాష్ట్ర ఖజానాకు రూ.15 వేల కోట్లు!

గల్ఫ్ దేశాల్లో సుమారు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రూ. 10వేల చొప్పున నెలకు రూ. 1,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు. అంటే ఏడాదికి రూ. 18 వేల కోట్లు, ఎనిమిదిన్నరేళ్లలో రూ. 1.53 లక్షల కోట్లు తెలంగాణకు ఆర్థిక వ్యవస్థలోకి చేరాయి. ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరినా.. ఎనిమిదిన్నరేళ్లలో రూ. 15,300 కోట్ల ఆదాయం సమకూరినట్లే.

బడ్జెట్ లో లేని కేటాయింపులు

భారత ప్రభుత్వం దగ్గర విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నాయి. ఇటీవలి నివేదికలు దీన్నే స్పష్టం చేశాయి. అయితే 'ఫారెక్స్' రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థలోకి గల్ఫ్ కార్మికులు, ఇతర దేశాల్లోని ఎన్నారైలు పంపిస్తున్న డబ్బులు భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాయి. కానీ ప్రవాసులు పంపే సొమ్ముపై ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల కనిపించడం లేదు. ప్రవాసీ కార్మికుల బతుకులు మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయడం లేదు.

దేశాభివృద్ధికి వారు ఆర్థిక జవాన్లు

ఎడారి దేశాల్లో పనిచేసే వలస కార్మికులు తాము సంపాదించిన సొమ్మును విదేశీ మారక ద్రవ్యం రూపంలో స్వదేశానికి పంపిస్తున్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల బలోపేతంలో భాగస్వాములవుతున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల తరహాలోనే వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వాల నుంచి మాత్రం సానుభూతిని, గౌరవాన్ని, హక్కులను పొందలేకపోతున్నారు. ఎన్నికల మెనిఫెస్టోల్లో కనిపించే హామీలు, ప్రసంగాల్లో వినిపించే మాటలు చేతల్లో కనిపించడం లేదు. అందుకే రానున్న ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు, ముఖ్యంగా అధికార పార్టీకి ఓటు రూపంలో వారు జవాబు చెప్పాలనుకుంటున్నారు.

గల్ఫ్ కార్మిక కుటుంబాలు ప్రభావితం చేయగల సెగ్మెంట్లు

నిర్మల్

ముధోల్

ఖానాపూర్ (ఎస్టీ)

వేములవాడ

సిరిసిల్ల

చొప్పదండి (ఎస్సీ)

బాల్కొండ

ఆర్మూర్

కోరుట్ల

జగిత్యాల

ధర్మపురి (ఎస్సీ)

ఎల్లారెడ్డి

కామారెడ్డి

నిజామాబాద్ రూరల్

(మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు, ఎమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షుడు)



Next Story

Most Viewed