తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఇంకెప్పుడు.. ఫలితాల ఆలస్యానానికి కారణం అదేనా..?

by Disha Web Desk 19 |
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఇంకెప్పుడు.. ఫలితాల ఆలస్యానానికి కారణం అదేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలోనే ఇంటర్ మూల్యంకనం ప్రక్రియ ముగిసినా అధికారులు రిజల్ట్స్ వెలువరించేందుకు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఇంటర్ ఫలితాల్లో ఎదురైన చిక్కులు, అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకే ఈసారి ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. మార్చి 15న ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 26వ తేదీనే ఫలితాలు వెల్లడించారు. కానీ తెలంగాణలో మాత్రం అధికారులు జాప్యం వహిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో ఇంటర్ ఫలితాల జాప్యానికి కారణం టెక్నికల్ సమస్యలేనని పలువురు చెబుతున్నారు. గతంలో ఇలాంటి సాంకేతిక కారణాల వల్లనే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆలస్యమైనా సరే రిజల్స్ట్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే అధికారులు రిజల్ట్స్‌కు సంబంధించిన ప్రాసెస్‌ను పూర్తిచేసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని అంతా ఒకే అనుకున్నాకే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధికారుల ప్రాసెసింగ్ సక్సెస్ అయ్యాక విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒకే చెప్పిన మరుక్షణమే రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫలితాల వెల్లడిలో అధికారులు కాస్త తాత్సారం వహిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి తొలుత మూల్యంకనం ప్రక్రియ ఆన్ లైన్ పద్ధతిలో చేపట్టాలని భావించారు.

ఇందుకు సంబంధించిన ఇంటర్ బోర్డు టెండర్లకు సైతం అహ్వానించింది. కానీ బిడ్డింగ్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది కూడా రిజల్ట్స్‌ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ఈనెల 10వ తేదీలోపు ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్న అధికారులు అన్నీ ఒకే అనుకుంటే ఈనెల మొదటి శనివారంలోపే వెల్లడించాలని చూస్తున్నట్లు వినికిడి.



Next Story

Most Viewed