ఉద్యోగులపై కేసీఆర్ భారీ స్కెచ్.. ఎంప్లాయీస్‌ చిక్కినట్టేనా..?

by Disha Web |
ఉద్యోగులపై కేసీఆర్ భారీ స్కెచ్.. ఎంప్లాయీస్‌ చిక్కినట్టేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉద్యోగులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆగమేఘాలమీద పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఏ‌ను సైతం ప్రకటించింది. పనిచేయని హెల్త్‌కార్డులకు త్వరలోనే మోక్షం కల్పించేందుకు సిద్ధమైంది. మొత్తానికి ఉద్యోగ, ఉపాధ్యాయులను మచ్చికునే పనిలో పడింది సర్కారు.

హడావుడిగా సమస్యల పరిష్కారం

సుమారు మూడేండ్లుగా ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి ఎంప్లాయీస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హెల్త్ కార్డుల కోసం ప్రతినెలా బేసిక్ జీతం నుంచి ఒక్క శాతం సొమ్ము చెల్లించేందుకు సిద్ధమని ఉద్యోగులు ప్రకటించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల క్రితం మంత్రి హరీశ్ రావు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆగమేఘాల మీద సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో హెల్త్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రతి ఏటా టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపడుతామని గతంలో చెప్పిన ప్రభుత్వం.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అకాడమిక్ ఇయర్ మధ్యలోనే ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ కోసం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏడాదిన్నర క్రితం ఇవ్వాల్సిన డీఏను ఇంత కాలం పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు మంజూరు చేసింది. అయితే మరో రెండు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఎన్నికల్లో నెగెటివ్ ప్రభావం ఉండొద్దని..

రాష్ట్రంలో సుమారు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సర్కారుపై నెగిటివ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అధికార పార్టీ చేయించిన పలు సర్వేల్లో తేలిందని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో ఎంప్లాయీస్ తమ కుటుంబసభ్యలుతో పాటు ఇతర వర్గాలను కూడా ప్రభావితం చేస్తారని టాక్ ఉంది. దీంతో ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ మొగ్గు చూపుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. సమస్యలను పరిష్కరించాలని పలుసార్లు ఎంప్లాయీస్ విజ్ఞప్తులు చేసినా సర్కారు పట్టించుకోలేదు.

ఉద్యోగులకు భారీ స్థాయిలో శాలరీలు ఇస్తున్నామని, ఇంకా వారికి ఏం కావాలని పలుసార్లు వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 2018 ఎన్నికలకు ముందు వేసిన పీఆర్పీ కమిటీ సిపారసులను అమలు చేయడానికి సుమారు రెండేండ్ల టైమ్ తీసుకున్నారు. ప్రతి ఏటా చేయాల్సిన బదిలీలు, ప్రమోషన్లు పక్కన పెట్టారు. కొత్త జోన్ల మేరకు జరిగిన ఉద్యోగుల విభజనపై చాలా మంది ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది. ఈ ఎన్నికపై ప్రభావం పడకుండా పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నదని టాక్.


Next Story