తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్ ఖాతా హ్యాక్..

by Ramesh Naini |

ఇతరుల ఖాతాలు హ్యాక్ అయితే క్షణాల్లో కనిపెట్టి కాపాడాల్సిన పోలీసుల ఖాతాకే సైబర్ నేరగాళ్లు కన్నం వేశారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్ ఖాతా హ్యాక్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇతరుల ఖాతాలు హ్యాక్ అయితే క్షణాల్లో కనిపెట్టి కాపాడాల్సిన పోలీసుల ఖాతాకే సైబర్ నేరగాళ్లు కన్నం వేశారు. ఏకంగా రాష్ట్ర ప్రజలకు సైబర్ భద్రత కల్పించే అత్యున్నత విభాగం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారిక సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. అకౌంట్ హ్యాక్ అవ్వడం తీవ్రమైన విషయమైతే.. ఆ విషయం గడిచిన 20 రోజులుగా ఆ శాఖ అధికారులకు ఏమాత్రం తెలియకపోవడం అత్యంత విస్మయం కలిగిస్తోంది.

నిపుణులు ఉండే బ్యూరోలోనే నిర్లక్ష్యం..

సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ భద్రత కోసం పనిచేసే ఈ సంస్థ ఖాతాను గత నెల మే 22వ తేదీనే సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అప్పటినుంచి ఆ ఖాతా హ్యాకర్ల చేతిలోనే ఉన్నప్పటికీ, సెక్యూరిటీ బ్యూరో అధికారులు దాన్ని ఏమాత్రం పసిగట్టలేకపోయారు. చివరకు ఈ వ్యవహారం బయటకు వచ్చి దుమారం రేగిన తర్వాతే సంబంధిత అధికారులు అప్రమత్తం కావడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిరంతరం ఇంటర్నెట్ ప్రపంచాన్ని జల్లెడ పట్టే నిపుణులు ఉండే బ్యూరోలోనే ఇంతటి నిర్లక్ష్యం రాజ్యమేలడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

దేశంలోనే నంబర్ వన్..

దేశంలోనే నంబర్ వన్ సైబర్ సెక్యూరిటీ సంస్థగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు గొప్ప గుర్తింపు ఉంది. ఆధునిక టెక్నాలజీ వినియోగంలో, కేసుల ఛేదనలో జాతీయ స్థాయిలో ప్రశంసలు సైతం అందుకుంది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, హ్యాకింగ్ ఘటనలను గుర్తించి బాధితులకు అండగా నిలవాల్సిన కీలక సంస్థకే ఈ పరిస్థితి ఎదురు కావడం గమనార్హం. దేశంలోనే అత్యాధునిక సైబర్ దర్యాప్తు వ్యవస్థలను ఉపయోగిస్తున్న సంస్థగా పేరుపొందిన బ్యూరో.. కనీసం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాను భద్రపరుచుకోలేకపోవడం రాష్ట్ర సైబర్ భద్రతా వ్యవస్థల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతుంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఖాతా హ్యాకింగ్ ఘటన ఎలా జరిగింది, పటిష్టంగా ఉండాల్సిన ఖాతా భద్రతలో ఎలాంటి లోపాలు చోటుచేసుకున్నాయి అనే విషయాలపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Next Story