భారీ వ్యూహానికి తెరలేపిన T- కాంగ్రెస్.. ఆ లీడర్లే టార్గెట్‌గా ఆపరేషన్​‘‘ఘర్​వాపసీ’’ స్టార్ట్..!

by Disha Web Desk 19 |
భారీ వ్యూహానికి తెరలేపిన T- కాంగ్రెస్.. ఆ లీడర్లే టార్గెట్‌గా ఆపరేషన్​‘‘ఘర్​వాపసీ’’ స్టార్ట్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ​పార్టీ ‘ఆపరేషన్ ​ఘర్ వాపసీ’ విధానాన్ని షురూ చేసింది. పార్టీ నుంచి బయటకు వెళ్లినోళ్లతో పాటు, కాంగ్రెస్‌లోకి రావాలని ఆసక్తి చూపుతున్నోళ్లనూ ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు ప్రత్యేక టీమ్ ​చేరికలపై ఫోకస్ పెంచింది. పార్టీని వదలి వెళ్లిన నేతలందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్​ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇప్పటికే పలువురి ముఖ్య లీడర్లతో సంప్రదింపులు జరుపగా, పార్టీలోకి వచ్చేందుకు పాజిటివ్ సంకేతాలు చూపినట్లు టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. జిల్లాల వారీగా పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే, ఇతర పార్టీల్లో ఆసంతృప్తులను కూడా కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.

కర్ణాటక రిజల్ట్స్ ​తర్వాత పొలిటికల్ ట్రెండ్స్​మారడంతో కాంగ్రెస్ పార్టీ పుల్​జోష్‌లో ఉన్నది. ఈ మేరకు ఇతర పార్టీలలో ప్రయారిటీ దక్కని నేతలు కూడా కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఇంట్రెస్టు చూపుతున్నట్లు సమాచారం. జూన్​ నెల నుంచి చేరికలు మొదలు కానున్నట్లు టీపీసీసీ చెందిన నేతలు వివరిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్​ పార్టీ ఓ సర్వేని నిర్వహించింది. ఆ సర్వే ద్వారా ఇతర పార్టీలలో అసంతృప్తితో ఉన్న బలమైన నేతల జాబితాను తయారు చేసింది.

ఆ మేరకు సదరు లీడర్లకు కాంగ్రెస్​ కండువా కప్పేందుకు పార్టీ శ్రమిస్తున్నది. కర్ణాటక తర్వాత కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగినప్పటికీ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాలంటే మరింత కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీని బలోపేతం చేస్తూ, కేడర్‌ను కాపాడుకుంటూ, ప్రజా సమ్మితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

అధికారంలోకి వస్తే చేపట్టే స్కీమ్‌లు, కార్యక్రమాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు లీడర్ల చరిష్మా కూడా అవసరమే. దీంతో అలాంటి నేతల‌ను కాంగ్రెస్​ పార్టీ జల్లెడ పడుతున్నది. ఇక ఇప్పటికే గతంలో పార్టీకి రాజీనామా చేసిన మేడ్చల్​మాజీ ఎమ్మెల్యే కేఎల్​లక్ష్మారెడ్డి పార్టీలోకి వస్తానంటూ హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కూడా కాంగ్రెస్‌లోకి చేరడం దాదాపు ఖరారైనట్టేనని పొలిటికల్​వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. అయితే మరోసారి చర్చల అనంతరం చేరికల తేదీని వెల్లడించే అవకాశం ఉన్నదని కాంగ్రెస్​లీడర్లు పేర్కొన్నారు.

అంతేగాక హై కమాండ్ ​ఆదేశాల మేరకు మాజీ ఎంపీ వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లతో కూడా చర్చలు చేయాలని కాంగ్రెస్​ పార్టీ ఆలోచిస్తున్నది. ఇటీవల బీజేపీలోకి చేరిన ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా డైలమాలో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మరి కొంత మంది లీడర్లను కూడా కాంగ్రెస్‌లోకి గుంజాలని ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నది.

టిక్కెట్లు రాని నేతలంతా..

బీఆర్ఎస్‌లో టిక్కెట్ ​కాంపిటేషన్​ భారీగా ఉన్నది. ఒక్కో నియోజకవర్గంలో సుమారు ఇద్దరు ముగ్గురు రేసులో ఉన్నారు. ఇప్పటికే సమన్వయంగా ఉండాలని బీఆర్ఎస్​ పార్టీ ఆదేశాలిచ్చినప్పటికీ, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గానే వర్క్​ చేస్తున్నారు. అయితే టిక్కెట్ల ప్రకటన తర్వాత ఆ లీడర్ల మధ్య స్పష్టంగా విబేధాలు వచ్చే ఛాన్స్​ఉన్నది.

దీంతో సదరు నేతలకు కాంగ్రెస్​ పార్టీ మాత్రమే ఆప్షన్‌గా కనిపిస్తుందని పొలిటికల్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పనిచేస్తున్న నేతలను, కొత్తగా వచ్చే వారిని సమన్వయంగా చేస్తే తప్పనిసరిగా కాంగ్రెస్​పార్టీ బలోపేతం అవుతుంది. ఇది పవర్‌లోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

‘‘పార్టీ కోసం పనిచేస్తే ఆహ్వానిస్తాం: మహేష్ ​కుమార్​గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

కాంగ్రెస్ ​పార్టీ కోసం పనిచేసే వాళ్లను తప్పకుండా ఆహ్వానిస్తాం. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సమన్వయంతో పనిచేస్తాం. కాంగ్రెస్‌లో స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరి నేతల అభిప్రాయాలను సేకరిస్తాం. కానీ హైకమాండ్ ​ఆదేశించిన నిర్ణయాన్ని తప్పకుండా పాటించాల్సిందే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ​విజయం ఖాయం. కేసీఆర్‌ను ప్రగతిభవన్​నుంచి బయటకు తెస్తాం. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక సారి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్ధిస్తున్నాను’’



Next Story

Most Viewed