119 నియోజకవర్గాలపై BJP ఫోకస్.. ఆ అంశంపై భారీ కసరత్తు!

by Disha Web Desk 2 |
119 నియోజకవర్గాలపై BJP ఫోకస్.. ఆ అంశంపై భారీ కసరత్తు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బూత్ స్థాయిలో బలోపేతం కావాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ డిసైడ్ అయింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు 11 వేల వీధి సభలకు ప్లాన్ చేసుకుంది. 15 రోజుల్లో గ్రౌండ్‌లోకి వెళ్లి పార్టీని పటిష్టంగా చేసుకోవడంపై నజర్ పెట్టింది. కాగా 119 సెగ్మెంట్లలో నిర్వహించే ఈ సభలకు పలువురు జాతీయ పెద్దలు సైతం హాజరయ్యేలా కాషాయ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా స్ట్రీట్ మీటింగ్స్‌కు స్టేట్ లీడర్లు కూడా పలు ప్రాంతాలకు వెళ్లేలా దిశానిర్దేశం చేయనుంది. ఎవరు ఏ నియోజకవర్గానికి వెళ్లాలనే అంశంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తోంది.

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేడర్‌ను పెంచుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకు చేరికలు, సంస్థాగత బలోపేతంపై పార్టీ దృష్టిసారిస్తోంది. పశ్చిమబెంగాల్‌లోనూ ఇదే వ్యూహంతో వెళ్లిన బీజేపీ అక్కడా ఓడిపోయినా భారీగా ఓటు బ్యాంకు నమోదు చేసుకుంది. ప్రజలకూ చేరువైంది. అందుకు అదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని భావించిన బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా 15 రోజుల పాటు స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించాలని భావించిన కమలనాథులు ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేపట్టాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల 5 రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తొలుత 9 వేల వీధి సభలు నిర్వహించాలని భావించారు. కానీ, ఇప్పుడు మరో 2 వేల సభలు అదనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 11 వేల మినీ సభలు ఉండనున్నాయి. 15 రోజుల్లో ప్రతిరోజు సగటున 733 వీధి సభలు నేతలు నిర్వహించాల్సిందిగా పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసింది.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు పేరున్న నేతలను పంపిస్తే ప్రభావితం చేయొచ్చని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే ఏ నేతను ఎక్కడికి పంపిస్తే బాగుంటుందనే అంశంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. పలువురు జాతీయ నేతలు సైతం ఈ మీటింగ్స్ కు హాజరుకానున్నారు. ఆయా సెగ్మెంట్లలో కాషాయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సభను ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయా సెగ్మెంట్లలో స్థానికంగా ప్రభావితం చేయగలిగే నేత లేకుంటే అక్కడికి రాష్ట్ర పెద్దలను పంపించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలను పంపించి అధికార పార్టీపై ఒత్తిడి పెంచేలా యాక్టివిటీ చేపట్టాలని కార్యాచరణ రూపొందించనుంది. ఇప్పటికే బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న బీజేపీకి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌తో స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై కరపత్రాల రూపంలో ప్రజలకు చేరువయ్యేందుకు సులభం కానుంది. మరి బీజేపీ నేతల ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది చూడాల్సిందే.


Next Story

Most Viewed