కేసీఆర్ ఏది చెప్తే పోలీసులు అదే చేస్తున్నారు.. తీన్మార్ మల్లన్న సీరియస్

by Disha Web Desk 2 |
కేసీఆర్ ఏది చెప్తే పోలీసులు అదే చేస్తున్నారు.. తీన్మార్ మల్లన్న సీరియస్
X

దిశ, వేలేరు: రైతుల పక్షాన ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా పోరాడితే అక్రమంగా అరెస్టు చేసి కేసులు బనాయించారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఆరెపల్లిలో శనివారం లాండ్ పూలింగ్ కవరేజ్‌కి వెళ్లిన తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసి వేలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వేలేరు పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ ఏది చెప్తే పోలీసులు అదే చేస్తున్నారని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలను విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం లాండ్ పూలింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బ్రోకర్‌గా మారిందని, రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, వెంటనే ఇటువంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడటానికి మేమున్నామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు బనాయిస్తే భయపడేది లేదని లీగల్‌గా పోరాటం చేస్తామని తెలిపారు. రైతులను మోసం చేసే 8 ఏ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అనుమతి లేకుండా సమావేశం పెట్టినందుకు అరెస్ట్ చేశాం: ఖాజీపేట ఏసీపీ శ్రీనివాస్

ఆరెపల్లిలోని పోచమ్మ గుడి వద్ద అనుమతి లేకుండా తీన్మార్ మల్లన్న, బుద్ద వెంకన్న మరికొంత మంది గ్రామస్తులు పోలీసుల అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేసినందుకు అరెస్ట్ చేశామని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా కూడా పోలీసు అనుమతి తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేయాలని నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. అనంతరం తీన్మార్ మల్లన్నకు నోటీసు ఇచ్చి విడుదల చేసామని తెలిపారు.


Next Story

Most Viewed