గ్రేటర్‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు షాక్.. టీడీపీలో చేరికలు

by Disha Web |
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు షాక్.. టీడీపీలో చేరికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఇంకొక్కటి అని.. ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నామని చెబుతూనే నిలువునా మాయమాటలతో మోసగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు షేక్ ఆరీఫ్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, ఎఐఎంఐఎం, వైఎస్ఆర్ టీపీనాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీలో చేరారు. వీరికి కాసాని పార్టీ కండువాలను కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని అన్ని మతాలవారు కలిసి మెలిసి జీవించేలా కర్ఫ్యూలేని నగరంగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ దేనని స్పష్టం చేశారు. ధరణిని తీసుకొచ్చి భూ వ్యవహారాలను గందరగోళం పట్టించడంతో పేదలు, రైతులు, ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు టీడీపీ చలవే అని అన్నారు. మైనార్టీలు, బడుగులు, పేదలు, బలహీన వర్గాలు, అందరికీ సామాజిక న్యాయం జనగాలన్నా.. రాజకీయ న్యాయం జరగాలన్నా.. మంచి పరిపాలన అందాలన్నా... మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటి ప్రభుత్వాలకు తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు బేరీజు వేసుకోని మంచి ఆలోచన చేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుండి నిజాంపేట్, బాచుపల్లి, సాయి నగర్, ప్రగతి నగర్ వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున టీడీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఉపాధ్యక్షుడు కొలన్ నరసింహారెడ్డి, కాసాని వీరేష్, ఎంపీటీసీ సత్తన్న, చంద్రహాస్, రాము, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story

Most Viewed