రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు : తరుణ్ చుగ్

by Disha Web Desk 13 |
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు : తరుణ్ చుగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంలు, రాజకీయ పార్టీల అధినేతలతో మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కేసీఆర్ గైర్హాజరై తెలంగాణ ప్రజలను అవమాన పరిచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ మండిపడ్డారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జీ-20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి మోదీ నాయకత్వంలో భారత్ ఆతిథ్యమిస్తుందని ఇది చారిత్రాత్మక ఘట్టం అన్నారు. అయితే ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలు పాల్గొని సూచనలు ఇచ్చారన్నారు. కేసీఆర్ కు రాజ్యాంగం పట్ల, దేశం పై గౌరవం లేదన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి కూడా పీఎం తెలంగాణకు వస్తే స్వాగతం పలికేందుకు కూడా ముందుకు రాలేదని మండిపడ్డారు. కేసీఆర్ కు ప్రధానిపై ఉన్న ద్వేషం కాస్తా దేశం పై ద్వేషంగా మారుతోందని, అందుకు చారిత్రాత్మక అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరయ్యారన్నారు.

సీఎంగా ఉన్న కేసీఆర్ ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలను సమావేశాలకు పిలువ లేదని, కనీసం సొంత మంత్రివర్గ సహచరులను కూడా కలువరని ఇది ఆయన పెత్తందారీ తనానికి నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వానికి తావు లేదన్నారు. రాజకీయంగా చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు ఈ దురహంకారాన్ని సహరించరన్నారు. మోడీ నిర్వహించిన మన్ కీబాత్ లో తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేతకారుడు శ్రీహరి ప్రసాద్ నేసిన జీ-20 లోగో వస్త్రాన్ని ప్రస్తావించడం తో పాటు జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం పై సంతోషం వ్యక్తం చేశారన్నారు.

భారత్ కు లభించిన చారిత్రాత్మక అవకాశాన్ని తెలంగాణలో ఒక సామాన్యుడు సంబురాలు చేసుకుంటుండగా కేసీఆర్ కు ఏం అడ్డమొచ్చిందని ప్రశ్నించారు. జీ-20 శిఖరాగ్ర సదస్సు భారత్ ను విశ్వ గురువు గా మార్చేందుకు మరో ముందడుగు అన్నారు. మోడీ ప్రతిష్ఠను మరింత పెంచుతుందనేది ఆయన అక్కసు అన్నారు. కేసీఆర్ ఈ వ్యతిరేక ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేషన్ ఫస్ట్ అన్న వైఖరి చూపిస్తున్న తెలంగాణలోని సామాన్యుల నుంచి కేసీఆర్ నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. అహంకారంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు క్షమించరని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.


Next Story

Most Viewed