వీడని సస్పెన్స్..! తుమ్మల, పొంగులేటి వర్గీయుల్లో టెన్షన్

by Disha Web Desk 4 |
వీడని సస్పెన్స్..! తుమ్మల, పొంగులేటి వర్గీయుల్లో టెన్షన్
X

కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉండబోతున్నారన్న విషయం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు తెరమీదకు వచ్చినా.. ఇద్దరిలో ఎవరన్నది మాత్రం ఉత్కంఠను రేపుతున్నది. పాలేరు సీటుపైనే తుమ్మల, పొంగులేటి గురి పెట్టినా.. ఈ ఇద్దరిలో ఖమ్మం అభ్యర్థి ఎవరన్నది టెన్షన్ రేపుతున్నా.. ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఎవరు? ఎక్కడ? అన్న విషయంపై స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

దిశ, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్న చర్చ అటు రాజకీయవర్గాల్లో, ఇటు సామాన్య ప్రజానీకంలో జోరుగా సాగుతోంది. జిల్లాలో సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పేర్లు కొద్దిరోజులుగా నానుతుండటం ఈ చర్చకు ఊతమిస్తుంది. ఇద్దరూ జిల్లాలో అగ్రనాయకులుగా ఉండటం.. ఓకే పార్టీలో చేరడం.. ఇద్దరూ ఖమ్మం నియోజకవర్గం కాకుండా పాలేరుపైనే దృష్టి పెట్టడంతో అనుచరుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అటు వామపక్షాలతో పొత్తు, అభ్యర్థుల ఎంపిక కారణంగా కాంగ్రెస్ జాబితా సైతం ఇంత కాలం ఆలస్యమైంది. శుక్రవారం నాటికి జాబితా చివరి దశకు చేరిందని, మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

వామపక్షాల పొత్తు కారణంగా..

కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు అన్న విషయం ఆ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. వామపక్షాలతో రాజకీయ అవగాహన కుదిరినా.. సీట్ల అవగాహన కుదరకపోడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ స్థాయిలో అవగాహన నేపథ్యంలో రాష్ట్రంలో సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు స్థానాలు ఆ పార్టీల నాయకులు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. పాలేరు, భద్రాచలంపై సీపీఎం దృష్టి పెడితే కొత్తగూడెం, మునుగోడులను సీపీఐ ఆశిస్తున్నట్లు ఈ క్రమంలోనే జాబితా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. వామపక్షాలు ఆశిస్తున్న మూడు సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉంటడంతో పీఠముడి తేలడం లేదని తెలుస్తుంది.

కొలిక్కి వచ్చిన తుమ్మల, పొంగులేటి చర్చలు..?

పొత్తులో భాగంగా వామపక్షాలు అడుగుతున్న పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం సీట్ల విషయంలో గందరగోళం నెలకొన్నా.. తుమ్మల, పొంగులేటి నడుమ ఓ అండర్ స్టాండింగ్ మాత్రం కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అధిష్టానం సూచన మేరకు టికెట్ విషయంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రణాళిక బద్ధంగా అడుగులు వేసేందుకు ఇద్దరూ సన్నద్ధమయ్యారని తెలుస్తున్నది. ఈ మేరకు అనుచరుల విషయంలోనూ ఏకాభిప్రాయం సాధించినట్లు, రెండు, మూడు రోజుల్లో జాబితా విడుదల కానున్నట్లు సమాచారం.

ఖమ్మం బరిలో తుమ్మల..

పొంగులేటి, తుమ్మల ఇద్దరూ పాలేరు టికెట్‌ను ఆశించినా.. ఖమ్మం బరిలో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు ఉండనున్నట్లు సమాచారం. తుమ్మల సామాజిక వర్గ ఓట్లు ఖమ్మంలో కీలకం కావడం.. సీనియర్‌గా జిల్లా వ్యాప్తంగా అనుచరులుండటంతో పాటు ఖమ్మంలో పట్టు ఉండటం కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. పాలేరు కంటే ఖమ్మంలోనే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వే నివేదికల్లో రావడంతో తుమ్మల ఖమ్మంలో పోటీచేసేందుకు మొగ్గు చూపారని తెలుస్తుంది.

తుమ్మల, పొంగులేటి నడుమ జరిగిన చర్చల్లో ఖమ్మం నుంచి తుమ్మల ఓకే అన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక పొంగులేటి పాలేరు లేదా కొత్తగూడెంలో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీకి పార్టీ ఆదేశించినా రెడీగా ఉన్నట్లు.. రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన కాంగ్రెస్ అగ్రనాయకులు.. రెండు, మూడు రోజల్లో అభ్యర్థుల ఖరారు చేసే అవకాశం ఉందని, అనుచరుల సీట్ల విషయం కూడా కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story