తెలంగాణ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు

by Gantepaka Srikanth |
తెలంగాణ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది సెప్టెంబరులో దాఖలైన ఓ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విచారణకు హాజరయ్యే న్యాయవాదికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సమాచారం ఎందుకు అందడంలేదని ప్రశ్నించింది. ప్రాసిక్యూషన్‌కు, ప్రభుత్వ న్యాయవాదికి మధ్య సమన్వయ లోపం, సమాచార పంపిణీలో గ్యాప్ ఉన్నదని నొక్కి చెప్పింది. కేసుకు సంబంధించి చార్జిషీట్లు పైల్ చేశామంటూ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దేవినా సెహగల్ కోర్టుకు చెప్తున్నప్పటికీ నిర్దిష్టంగా ఎన్ని చార్జిషీట్లు, ఏయే తేదీల్లో దాఖలయ్యాయో మాత్రం వివరాలు ఎందుకు లేవంటూ ప్రశ్నించారు. చార్జిషీట్లను ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు సమర్పించిందనే అంశాన్ని విచారణ సందర్భంగా ప్రస్తావిస్తున్నప్పుడు ఆ తేదీలు లేదా పూర్తి వివరాలు న్యాయవాదికి ప్రభుత్వం ఎందుకు అందించలేదని నిలదీసింది. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేస్తున్నందున డీజీపీ నేరుగా హాజరుకావాలని లేదా వర్చువల్‌గానైనా అందుబాటులో ఉండాలని జస్టిస్ హృశీకేశ్‌రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా ఆదేశించింది.

గతేడాది అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే సూర్యాపేట జిల్లాకు చెందిన వట్టె జానయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జిల్లా నేతలు, మంత్రులు ప్రభుత్వ అండదండలతో తనను వేధిస్తున్నారని, అరెస్టు చేయడానికి పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నరని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ వట్టె జానయ్య తరఫున న్యాయవాది వినయ్ త్రిపాఠి హాజరయ్యారు. ఆ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నందున సీనియర్ న్యాయవాది దేవినా సెహగల్ హాజరై వాదించారు. నిర్దిష్ట కేసులో పిటిషనర్‌పైన పోలీసు శాఖ దర్యాప్తు జరిపి చార్జిషీట్లను కూడా దాఖలు చేసిందని ద్విసభ్య ధర్మాసనానికి వివరించారు. ఆ తేదీలను చెప్పాలంటూ జడ్జిలు ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి వివరాలు, సమాచారం అందలేదని పేర్కొన్నారు. దీంతో అసహనానికి గురైన న్యాయమూర్తులు ప్రాసిక్యూషన్‌కు, ప్రభుత్వ న్యాయవాదికి మధ్య గ్యాప్ ఉన్నదని, సరైన తీరులో ప్రభుత్వం ఈ కేసును వాదించే న్యాయవాదికి వివరాలు అందించలేదని అసహనం వ్యక్తం చేసి ఆ శాఖ హెడ్‌గా డీజీపీ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా హాజరుకావాలని ఆదేశించారు.

Advertisement

Next Story