రేంజ్ రోవర్ ఎవరిది? అందులో ఉన్న ‘ఏపీ’ ఎవరు.. గులాబీ నేతల్లో పెరుగుతున్న ఉత్కంఠ!

by Disha Web Desk 2 |
రేంజ్ రోవర్ ఎవరిది? అందులో ఉన్న ‘ఏపీ’ ఎవరు.. గులాబీ నేతల్లో పెరుగుతున్న ఉత్కంఠ!
X

రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ తిహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేసి ప్రెస్‌నోట్ ఢిల్లీతో పాటు తెలుగురాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రూ.75 కోట్ల డీల్ కుదిరిందని, అందులో రూ.15 కోట్లను బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఉన్న రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇంతకూ ఆ కారు ఎవరిది? అందులో డబ్బులు తీసుకున్నది ఎవరు అనేది బయటపడలేదు. ఈ ‘ఏపీ’కి కారు ఓనరుకు ఉన్న సంబంధం ఏంటనే దానిపైనా సస్పెన్స్ నెలకొంది. దానికి తోడు వారం రోజుల్లో సంచలనం ప్రకటిస్తా అంటూ సుఖేశ్, ఆయన లాయర్ అనంత్ మాలిక్ ప్రకటించడంతో ఎవరెవరి పేర్లు బయటకు రానున్నాయి. అసలు ఏం జరగబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సుఖేశ్ చంద్రశేఖర్‌కు ఉన్న కోపం బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకున్నది. ఇప్పటికే 15 కిలోల నెయ్యి (రూ.15 కోట్లు)ని బీఆర్ఎస్ ఆఫీసులో అందజేసినట్టు సుఖేశ్ చేసిన ఆరోపణలు గులాబీ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నది. వారం రోజుల్లో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయంటూ సుఖేశ్‌తో పాటు ఆయన లాయర్ అనంత్ కూడా నొక్కిచెప్పడంతో బీఆర్ఎస్ నేతల్లో మరింత టెన్షన్ మొదలైంది. వారం రోజుల్లో ఆయన చేసే సంచలన వ్యాఖ్యలేంటి?.. కేజ్రీవాల్‌కు, బీఆర్ఎస్ పార్టీ మధ్య సంబంధాలపై కొత్తగా వెలుగులోకి వచ్చే అంశాలేంటి? రేంజ్ రోవర్ కారు విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించిన సుఖేశ్.. అందులో ఉన్న వారి పేరును ప్రస్తావిస్తారా? దానిని బయట పెడితే అది ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. సుఖేశ్ ప్రెస్‌నోట్‌కు బలం చేకూర్చే విధంగా ఢిల్లీలో శనివారం ఆయన లాయర్ కూడా సంచలనం అనే విషయాన్ని నొక్కిచెప్పడంతో ఇకపైన ఏం జరగనున్నది అనేది ఉత్కంఠగా మారింది.

ఒకవైపు సుఖేశ్‌ను చీటర్‌గా అభివర్ణిస్తూ.. ఆయన చేసిన కామెంట్లను బీఆర్ఎస్ కొట్టిపారేస్తున్నా పార్టీకి డ్యామేజ్ చేసే ఆరోపణలు ఇంకేం వస్తాయోననే అనే ఉత్కంఠ నెలకొన్నది. బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక తెర వెనక బీజేపీ ఉండి ఈ నాటకాన్ని ఆడిస్తున్నదంటూ గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం 700 పేజీలకు సరిపోయేంతగా కేజ్రీవాల్, సత్యేంద్రజైన్‌లతో జరిగిన చాటింగ్ హిస్టరీ తన వద్ద ఉన్నదంటూ సుఖేశ్ చెప్పడంతో వచ్చే వారం ఎలాంటి సంచలనాన్ని ఆయన బ్లాస్ట్ చేస్తారనే ఆసక్తి మొదలైంది. కేజ్రీవాల్ గుట్టును రట్టు చేస్తారా?.. లేక బీఆర్ఎస్ లింకులపైనా బాంబు పేలుస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ప్రెస్‌నోట్‌ను విడుదల చేసినట్టుగానే 700 పేజీలకు సరిపడే చాటింగ్ అంశాలను ఓపెన్ చేసే అవకాశముందంటూ స్వయంగా ఆయన లాయరే చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీతో చాలా కాలంలో సంబంధాల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఒక్కసారిగా కేజ్రీవాల్‌ను టార్గెట్ చేయడం.. ఢిల్లీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీతో సుఖేశ్‌కు సంబంధాలు ఎక్కడ బెడిసికొట్టాయన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. జైలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కావడంతో తగిన సౌకర్యాలు కల్పించనందుకు సుఖేశ్ తిరుగుబాటు మొదలుపెట్టారేమో అనే అనుమానాలు తలెత్తున్నాయి. సత్యేంద్రజైన్ హామీ ఇచ్చినట్టుగా జైల్లో లగ్జరీ సౌకర్యాలు కల్పించకపోవడం, బెయిల్‌పై బయటకు తీసుకురావడంలో మాటను నిలబెట్టుకోనందునే సుఖేశ్‌కు ఆగ్రహం కలిగిందేమోననే వాదనలూ వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్‌ మీద సుఖేశ్‌కు ఉన్న కోపం చివరకు బీఆర్ఎస్ పార్టీకి సంకటంగా మారింది.

రేంజ్ రోవర్ ఎవరిది? అందులో ఉన్న ‘ఏపీ’ ఎవరు?

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రాంగణంలో పార్కింగ్ చేసి ఉన్న రేంజ్ రోవర్ (నెం. 6060) కారు ఎవరిది?.. అందులో ఉన్న ‘ఏపీ’ అనే వ్యక్తి ఎవరు అనేదానిపై ఈడీ అధికారుల ఆరా మొదలైంది. సుఖేశ్ ఇచ్చిన లీకుల ప్రకారం ‘ఏపీ’ అంటే అరుణ్ రామచంద్ర పిళ్లయ్. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అంటూ మీడియాకు లాయర్ ద్వారా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో హింట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాకముందే 2020లోనే రూ.15 కోట్లను అందజేయడంతో ‘ఏపీ’ అనే వ్యక్తికి, రేంజ్ రోవర్ కారు యజమానికి ఉన్న లింకులతో పాటు వీరిద్దరికీ బీఆర్ఎస్ పార్టీతో ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రాంగణంలో ఆ కారు పార్కింగ్ చేసి ఉంటుందని కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ సూచనలు ఇచ్చిన అంశాన్ని సుఖేశ్ తన ప్రెస్‌నోట్‌లో ప్రస్తావించడం గమనార్హం.

బీఆర్ఎస్ పార్టీలో 6060 నంబర్ వాహనాలను వాడుతున్న నేతలెవరు?.. వారి స్థాయి ఏంటి?.. పార్టీకి మాత్రమే పరిమితైనవారా?.. లేక ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారా?.. ‘ఏపీ’ అనే వ్యక్తితో కారు ఓనర్‌కు ఉన్న సంబంధాలేంటి?.. సుఖేశ్ చెబుతున్నట్టుగా రూ.15 కోట్లు పార్టీకి సంబంధించిన వ్యవహారమా?.. లేక కారు ఓనర్‌కు సంబంధించిన అంశమా?.. ఇలాంటి అంశాలపైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. అరుణ్ రామచంద్ర పిళ్లయ్ ఇప్పుడు ఈడీ అదుపులోనే ఉన్నందున సుఖేశ్ ఆరోపణలకు అనుగుణంగా రూ.15 కోట్ల వ్యవహారాన్ని, రేంజ్ రోవర్ కారు అంశం గురించి అధికారులు ఆరా తీసే అవకాశమున్నది. లిక్కర్ స్కామ్‌లో సంబంధం ఉన్న ‘ఏపీ’ అనే వ్యక్తికి డబ్బులు ముట్టచెప్పటినట్టు సుఖేశ్ ఆరోపించినందున దాని గురించి వివరాలను రాబట్టే అవకాశమున్నది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత హవాలా మార్గంలో...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఆవరణలో 2020లోనే రూ.15 కోట్లను కేజ్రీవాల్ సూచన మేరకు అందించినట్టు సుఖేశ్ ఆరోపించారు. నిర్దిష్టంగా నెల పేరును చెప్పకపోయినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ వ్యవహారం జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు, హవాలా మార్గంలో డబ్బులు మారిన వ్యవహారంపై ఈడీ నజర్ పెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు, బీఆర్ఎస్ పార్టీతో హవాలా మార్గంలో చేతులు మారిన డబ్బు వ్యవహారం సరికొత్త టర్న్ తీసుకునే అవకాశమున్నది. సుఖేశ్ ఇప్పుడు చెప్పిన రూ.75 కోట్లు మాత్రమేనా.. ఇంకా ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిగినట్టుగా సెన్సేషన్ న్యూస్‌ను ఆయన బ్లాస్ట్ చేస్తారా? అనే చర్చలు జోరందుకున్నాయి. అనేక మోసాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేశ్.. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును ఫేస్ చేస్తున్నారు. హవాలా మార్గంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.15 కోట్లను 2020లోనే హైదరాబాద్‌లోని ఆఫీసులో అప్పగించినట్టు సుఖేశ్ చేస్తున్న ఆరోపణలపై ఈడీ దృష్టి పెట్టింది. సుఖేశ్‌పై ఇప్పటికే ఉన్న కేసులకు అనుబంధంగా ఇప్పుడు తాజా అంశాన్ని కూడా జోడించి ఇకపైన లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి వివరాలను వెలికితీసే చాన్స్ ఉన్నది.

హవాలా డబ్బుపై హైపవర్ కమిటీ...

సుఖేశ్ చంద్రశేఖర్ రెండు పేజీల ప్రెస్‌నోట్‌లో సంచలన ఆరోపణలు చేయడంపై ఆయన తరఫున అడ్వకేట్ అనంత్ మాలిక్ ఢిల్లీలో శనివారం మీడియాకు వివరాలు అందించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఇప్పటికే సుఖేశ్ 12 లేఖలు రాశారని, వాటన్నింటిపై హైపవర్ కమిటీ వేయాలని గతంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారని లాయర్ గుర్తుచేశారు. మరో వారం రోజుల్లో కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయన్నారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనల మేరకు బీఆర్ఎస్ ఆఫీసుకు రూ.75 కోట్లు వెళ్లాయన్నారు. రేంజ్ రోవర్ కారులో ఉన్న ‘ఏపీ’ వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చారని, ఆ వ్యక్తి ఎవరో వచ్చేవారం బయటపెడతామన్నారు. రాజ్యసభ సీటు ఇస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చంద్రశేఖర్‌కు హామీ ఇచ్చిందని, కానీ ఆయన జైలుకి వెళ్లిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు ఆ పార్టీ పాల్పడిందన్న అసంతృప్తిని లాయర్ వెలిబుచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed