ఆర్టీఓల్లో రహస్య కోడ్‌ల కలకలం.. కుమ్మక్కైతే వెంటనే సస్పెన్షన్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయాలు, లైసెన్సులు మంజూరు చేసే డ్రైవింగ్ ట్రాక్ ల వద్ద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆర్టీఓల్లో రహస్య కోడ్‌ల కలకలం.. కుమ్మక్కైతే వెంటనే సస్పెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయాలు, లైసెన్సులు మంజూరు చేసే డ్రైవింగ్ ట్రాక్ ల వద్ద పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు, మధ్యవర్తులు తిష్టవేసి కరప్షన్ చేస్తున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. సరైన పరీక్షలు లేకుండా, అసలు దరఖాస్తుదారు హాజరు కాకుండానే లైసెన్సులు మంజూరు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రైవేట్ ఏజెంట్లతో సిబ్బంది కుమ్మక్కై తీవ్రమైన అవకతవకలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో బయటపడింది. చివరకు సీనియర్ ఆఫీసర్లు లేదా ఏసీబీ అధికారులు వస్తున్నారని ఒకరికొకరు తెలియజేసేందుకు రవాణాశాఖ సిబ్బంది రహస్య కోడ్‌లను కూడా ఉపయోగిస్తున్నట్లు రవాణాశాఖ దృష్టికి వచ్చింది. తీవ్రమైన అవినీతి నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కరప్షన్ ను అరికట్టేలా రవాణాశాఖ వెంటనే అమల్లోకి వచ్చేలా అన్ని డ్రైవింగ్ ట్రాక్ ఇన్ చార్జీలకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే సంబంధిత ఉద్యోగులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

మార్గదర్శకాలు ఇలా..

- ప్రతి దరఖాస్తుదారు డ్రైవింగ్ పరీక్ష రోజున ట్రాక్ వద్ద కచ్చితంగా హాజరు కావాలి. దరఖాస్తుదారు ప్రత్యక్షంగా హాజరు కాకుండా ఏ పరిస్థితుల్లోనూ లైసెన్సు జారీ చేయొద్దు. పరీక్షకు ముందే ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా ఎంవీఐ అభ్యర్థి గుర్తింపును వ్యక్తిగతంగా నిర్ధారించాలి.

-కేవలం స్టీరింగ్ వద్ద కూర్చోవడం లేదా కొంత దూరం మాత్రమే వాహనం నడపడం ద్వారా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడాన్ని కఠినంగా నిషేధించారు. అభ్యర్థులు నిర్ణీత డ్రైవింగ్ టెస్ట్ మార్గాన్ని పూర్తి చేయాల్సిందే. వాహనాన్ని ప్రారంభించడం, ఆపడం, రివర్స్ చేయడం, లేన్ క్రమశిక్షణ, ట్రాఫిక్ సంకేతాలను పాటించడం వంటి సామర్థ్యాలను ప్రదర్శించాలి.

-డ్రైవింగ్ టెస్ట్ సమయంలో సీసీటీవీ కెమెరాలు నిరంతరం పని చేస్తూనే ఉండాలి. నిఘా పరికరాలను నిలిపివేయడం లేదా వాటితో జోక్యం చేసుకోవడాన్ని తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలను రిజిస్టర్‌లో నమోదు చేసి అధికారి, ఇన్ చార్జీలు సంతకాలు చేయాలి.

- ప్రైవేట్ వ్యక్తి, బ్రోకర్, మధ్యవర్తి లేదా డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధిని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ప్రాంగణంలో లేదా రవాణా కార్యాలయాల్లో ఏ సమయంలోనూ అనుమతించకూడదు. ప్రైవేట్ ఏజెంట్లతో కుమ్మక్కైనట్లు తేలితే సిబ్బందిని విచారణ పెండింగ్‌లో ఉంచి వెంటనే సస్పెండ్ చేస్తారు. ప్రతి ట్రాక్ వద్ద ‘ప్రైవేట్ ఏజెంట్ల ప్రవేశం కఠినంగా నిషేధించబడింది’ అనే నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలి.

-సీనియర్ అధికారులు లేదా ఏసీబీ బృందాల రాకను హెచ్చరించేందుకు రహస్య కోడ్‌లు, సంకేతాలు, చిహ్నాలు లేదా ఇతర రహస్య మార్గాలను ఉపయోగించడాన్ని కఠినంగా నిషేధించారు. తమ పరిధిలో ఇలాంటి పద్ధతులేవీ లేవని నిర్ధారించుకోవడానికి ఇన్ చార్జీలే వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు.

-టెస్టుల రికార్డులు, ఉత్తీర్ణత/అనుత్తీర్ణత వివరాలు తనిఖీలకు సిద్ధంగా ఉంచాలి. డిజిటల్ రికార్డులు, భౌతిక రిజిస్టర్లు రోజువారీగా సరిపోవాలి. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే ప్రాంతీయ రవాణా అధికారికి (ఆర్టీఓ) నివేదించాలి. నెలవారీ కంప్లయెన్స్ నివేదికలను ప్రతి నెల 15వ తేదీలోపు రవాణా కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలి.

Next Story