బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల వెనుక వ్యూహమా? భయమా?

by prasad |
బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల వెనుక  వ్యూహమా? భయమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతల వైఖరి హాట్ టాపిక్ అవుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇంటికి సాగనంపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు గడవక ముందే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోవడం ఖాయం అని త్వరలోనే కేసీఆర్ అవుతారంటూ గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం చర్చనీయాశం అవుతున్నది. పార్టీలోని సీనియర్ నేతల నుంచి మొదలు కొంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు ముఖ్య నేతలు పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నా వీటికి బ్రేకులు మాత్రం పడటం లేదు. దీంతో ఈ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ కు ఏదైనా వ్యూహం ఉందా లేక మరేదైనా భయంతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.

జంపింగ్ ల కట్టడికోసమేనా?

రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మూడోసారి మాత్రం ఓటమి పాలైంది. దీంతో ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు సమన్వయంతో ముందుకు వెళుతుంటే మరో వైపు కాంగ్రెస్ నేతల్లో సమన్వయం లేదని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక కేటీఆర్ స్థాయి లీడర్ సైతం త్వరలోనే సీఎం అవుతారని వ్యాఖ్యలు చేయడంతో ఇదేలా సాధ్యం అవుతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే ఓ ఇంట్రెంస్టింగ్ వ్యవహారం తెరమీదకు వస్తోంది. బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ తరహా విమర్శలు గుప్పిస్తుంటే ఇదే సమయంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ లో ఏదైనా జరగవచ్చేనే చర్చ రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ కాకుండా ఈ తరహా వ్యాఖ్యలను అధిష్టానమే చేయిస్తోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అందువల్ల పార్టీ మారాలనుకునేవారు ఆ నిర్ణయం మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సందేశాన్ని పరోక్షంగా ఇస్తోందా అనే చర్చ తెరపైకి వస్తోంది.

ఎన్నికల ఫలితాల వేళ కేసీఆర్ ఇదే వ్యూహం:

అసెంబ్లీ ఫలితాలు వెలువడే సమయంలోనూ బీఆర్ఎస్ ఇదే తరహా వ్యూహం అమలు చేసిందని పలువురు గుర్తు చేస్తున్నారు. సర్వే సంస్థలన్ని ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు పట్టం కడితే బీఆర్ఎస్ మాత్రం తాము ఆ ఫలితాలను నమ్మడం లేదని తామే గెలుస్తామంటూ ప్రకటన చేసింది. ఈ క్రమంలో సర్వే సంస్థలనే తప్పుబట్టేలా పార్టీ ముఖ్యనేతలు మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటనే చర్చ తెరమీదకు వచ్చింది. ఇంతలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ శిబిరంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అందరూ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కు పెయింటింగ్ వేయించడంతో గెలుపు పట్ల కేసీఆర్ ధీమాతో ఉన్నారని ఎలాగైనా చేసి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతున్నదన్న వాదనను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కల్పించాయి. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఆపేందుకే కేసీఆర్ ఈ తరహా వ్యూహం రచించారని, కానీ కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ రావడంతో సైలెంట్ అయ్యారనే టాక్ ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో తాజాగా గులాబీ బాస్ ఇదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story

Most Viewed