ట్యాంక్ బండ్ పై శ్రీపాద రావు, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల ఏర్పాటు

by Disha Web Desk 12 |
ట్యాంక్ బండ్ పై శ్రీపాద రావు, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేగాక చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న తో పాటు పలువురు ప్రముఖులు విగ్రహాలు ట్యాంక్ బండ్ పై పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం ఆయన రవీంద్ర భారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీవీ అనుచరుడుగా శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం మంథని నుంచి మొదలైందని గుర్తు చేశారు. స్పీకర్ గా మంచి సాంప్రదాయం నెలకొల్పారన్నారు. శ్రీపాద రావు వంటి నాయకుడు తెలంగాణ లో పుట్టడం అదృష్టమన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని సమర్ధవంతంగా నడిపే వారన్నారు. ఇప్పుడు వారి వారసత్వం తీసుకొని రాజకీయాల్లో ఉన్న అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలాగా చొరవ తీసుకుంటున్నారన్నారు. శ్రీధర్ బాబు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి, మొదటి సారి శ్రీపాద రావు తనయుడుగా గెలిచారన్నారు.ఆ తర్వాత ఆయన ప్రతిభ, పనితనం వలనే శ్రీధర్ బాబు అనేక సార్లు గెలిచి ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు.శ్రీధర్ బాబు ఉన్నత విద్యావంతుడు, మేధావి అని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. శ్రీధర్ బాబు అనుమతి లేనిదే తాము అసెంబ్లీలో గొంతు విప్పలేమని వ్యాఖ్యానించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శ్రీపాద రావు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.ఈ వేడుకలు అధికారికంగా జరగడానికి ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్యేల కృషి ఉన్నదని కొనియాడారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరిని ఆహ్వానించనున్నారు. ఇక నుంచి శ్రీపాద రావు జయంతి వేడుకలను హైదరాబాద్ లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామన్నారు. మరణించే క్షణం వరకు శ్రీపాద రావు ప్రజా జీవితంలోనే గడిపారన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్లి వస్తూ, అనుకోని సంఘటనలో నాన్న గారు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర స్పీకర్ స్థాయి వరకు ఎదిగిన ఆయన రాజకీయ జీవితం తమ అందరికీ ఆదర్శమన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..తాను జిల్లా ఎన్ ఎస్ యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన రోజుల్లో వివిధ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో శ్రీపాద రావు సలహాలు, సూచనలు తీసుకున్నానని చెప్పారు. వాళ్ల ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయన టెన్షన్ ఫ్రీ పాలిటిక్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..శ్రీపాద రావు తో తాను చట్ట సభల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు ఆయన కుమారుడు శ్రీధర్ బాబు తో చట్ట సభల్లో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఇద్దరూ అజాత శత్రువులేన్నారు. తీవ్ర వాదుల ప్రభావం ఉన్న మంథని ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు శ్రీపాద రావు ప్రయత్నం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed