కేంద్రం నిధులు పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే

by Disha Web Desk 11 |
కేంద్రం నిధులు పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే
X

దిశ, అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఆరోపించారు. ఆదివారం ఆయన శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం లింగాల మండలం బౌరాపూర్ తో పాటు పెంటల చెంచులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అప్పాపూర్ సర్పంచ్ బాల గురువయ్య, చెంచుకుల పెద్దలు పూజారి మల్లయ్య, లింగయ్య, పెద్దులు, బయ్యన్న, శివమ్మ తదితరులు మాట్లాడుతూ.. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అన్ని రంగాలలో ముందుకు వెళుతున్నా నేటికీ మాకు కనీస వసతులు అందడం లేదన్నారు. రోగం వస్తె రోడ్డు సౌకర్యం సరిగా లేక సకాలంలో వైద్యం అందక, సరైన పౌష్టికాహారం లేక అర్ధాంతరంగా జీవితాలు ముగుస్తున్నాయని వాపోయారు. నేటికీ గడ్డి గుడిసెలలో రక్షణ లేక విష పురుగులు, అగ్నిప్రమాదాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని, ఈకో ఫ్రెండ్లీ హౌసింగ్ నిర్మాణాల ప్లాన్ జరిగినా అమలు కాకుండా అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కనీస వసతులైన తాగు నీరు, విద్య అందడం లేదన్నారు. మిషన్ భగీరథ కింద సోలార్ ప్లాంట్ లు పెట్టినా అవి నడవడం లేదన్నారు. చెంచు గ్రామ పంచాయతీ పరిధిలో మినీ వైద్య కేంద్రం ఏర్పాటు చేసి అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలని కోరారు. గవర్నర్ రెండు అంబులెన్స్ లను ఇచ్చినా వాటికి డీజిల్ లేక మూలన పడ్డాయన్నారు. రేషన్ బియ్యం సకాలంలో అందడం లేదని, అంగన్వాడీ ఫుడ్ అంతంత మాత్రమేనని, ఈజీఎస్ చెంచులకు సపరేట్ గా ఉన్నప్పుడు సౌకర్యంగా ఉండేదని, దానిని అమలు పరచాలన్నారు.

పోడు పట్టాలు కలిగిన వారు మరణిస్తే వారసులకు పట్టాలు మార్పిడి కావడంలేదని, ఏళ్లుగా ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. కష్టపడి పండించిన పంట అడవి జంతువుల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని పంట రక్షణకు పొలం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవే మా సర్వస్వం అనుకొని అడవిని, వన్యప్రాణులను దేవతలుగా పూజించే మాపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని, ఫారెస్ట్ అడ్డంకుల కారణంగా తాము వెనకబాటుకు కారణం అవుతున్నామన్నారు. తదుపరి బీజేపీ నాయకులు సతీష్ మాదిగ నల్లమలలో అనేక ప్రకృతి వన మూలికలకు నిలయ కేంద్రం అని ఈ ప్రాంతంలో అయూర్ వేదిక్ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేయాలని మంత్రికి పాదాబి వందనం చేస్తూ వినతిపత్రం అందజేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మీ బతుకులు మారాలంటే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తేనే (డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా) సాధ్యమని సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదని నేడు బిజెపి ఆధ్వర్యంలో ఆదివాసీ ఆడపడుచునే దేశ రాష్ట్రపతిగా చేసిన ఘనత ఉందని అన్నారు. అయూర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ మంజూరు విషయంపై సానుకూలంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా ఆదివాసీల కోసం ప్రత్యేకంగా 700 ఏకలవ్య స్కూల్ లను మంజూరు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క ప్రతిపాదన కూడా పంపలేని స్థితిలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

మీ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం 60% నిధులు రాష్ట్రానికి మంజూరు చేసినా వాటిని మీ అభివృద్ధి కోసం కాకుండా పక్క దారి పట్టిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కుటుంబ పాలనకే పరిమితమయ్యాయని, బిజెపి ప్రజల పార్టీని ప్రధాని మోడీ సారద్యంలో బతుకులు బాగు అవుతాయని, కావున వచ్చే ఎన్నికల్లో ఒక్క సారి బిజెపి పార్టీని ఆదరిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆదివాసీ బతుకులు మారతాయని సూచించారు. మంత్రి హిందీలో చేంచులతో మాట్లాడగా.. దానిని తెలుగులోకి బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధవి అనువాదం చేసి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎల్లెంటి సుధాకర్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర, జిల్లా బిజెపి నేతలు కట్టా సుధాకర్, వేముల నరేందర్, బాలాజీ, రామకృష్ణ, నాగరాజు, రేనయ్య, సతీష్ మాదిగ, శ్రీకాంత్ భీమా, శంకర్, సలేశ్వరం, జానకమ్మ, పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed