'జై తెలంగాణ' అనడమే శాపం... ! జాబ్ కోల్పోయిన హోంగార్డులు

by Gopi |
CM KCR Announces Revenue Conference Postponed
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటమే వారికి శాపంగా మారింది. జై తెలంగాణ అన్న నినాదమే వారి కొలువులు ఊడిపోయేందుకు కారణమైంది. ఆర్డర్ కాపీలు లేవనే సాకుతో 2011లో ఉమ్మడి రాష్ట్ర సర్కారు 250 మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించింది. స్వరాష్ట్రంలోనైనా న్యాయం జరుగుతుందనుకుంటే నిరాశే మిగిలింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరడంలేదు. అసెంబ్లీ సమావేశాల్లోనైనా చర్చించి తమను తిరిగి విధుల్లోకి తీసుకునేలా నిర్ణయం తీసుకోవాలని హోంగార్డులు కోరారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి హోంగార్డులు పాలుపంచుకోగా.. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని కొందరు పోలీసు అధికారులు వారిపై కక్షగట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆర్డర్ కాపీలు లేవనే సాకుతో 2011లో సుమారు 250 మందిని జాబ్ ల నుంచి తొలగించారు. అప్పటి నుంచి వీరి పరిస్థితి దుర్భరంగా మారింది. కుటుంబపోషణ భారమైంది. కూలీ పనికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

హైకోర్టు చెప్పినా..

తెలంగాణ వచ్చాక తమ ఉద్యోగాలు తమకు దక్కుతాయని హోంగార్డులు భావించారు. మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఫిజికల్ టెస్ట్ నిర్వహించి క్వాలిఫై అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.

నెరవేరని కేసీఆర్ హామీ..

ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరిగిన అన్యాయంపై బాధిత హోంగార్డులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2018లో అసెంబ్లీ సాక్షిగానూ ప్రస్తావించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. హుజూరాబాద్ బై పోల్ సమయంలోనూ తమకు మాటిచ్చి, విస్మరించారని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.

కూలీలు, ఆటో డ్రైవర్లుగా..

హోంగార్డుల్లో చాలామందికి పదేండ్ల సీనియారిటీ ఉంది. ఇంకొందరికి ఐదేళ్లకు పైగా పని చేశారు. అన్ని డిపార్ట్ మెంట్లలో హోంగార్డులుగా విధులు నిర్వర్తించారు. ప్రతి ఒక్కరికీ యూనిఫాం, ఐడీ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు, హెల్త్ కార్డు, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఉన్నాయి. కానీ అప్పటి పోలీస్ ఉన్నతాధికారులు కావాలనే తమపై కక్షగట్టి విధుల నుంచి తొలగించారని మాజీ హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోవడంతో పలువురు కూలీలు, ఆటో డ్రైవర్లుగా మారి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొందరు దుస్తుల దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్నారు. ఉద్యోగాలు రావేమోననే తీవ్ర మనోవేదనతో ఇటీవల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.

రాష్ట్రం వచ్చినా న్యాయం జరగలేదు: కోల శేఖర్, బాధిత హోంగార్డుల అసోసియేషన్ అధ్యక్షుడు

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగడంలేదు. ఇప్పటికే సీఎం, మంత్రులు దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఫలితం లేదు. మరోసారి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్దామంటే అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు. అందుకే లేఖ రాశాం. టవర్లు ఎక్కి నిరసనలు తెలిపినా ఎవరూ పట్టించుకోవడంలేదు.

Next Story

Most Viewed