రాష్ట్రంలో జోరుగా సాగుతున్న 'ఆ దందా'

by Disha WebDesk |
రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఆ దందా
X

''ఇటీవల ఖమ్మం జిల్లాలోని ఒక మిల్లు నుంచి సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ మిల్లుకు అక్రమంగా ధాన్యాన్ని లారీలో తరలిస్తుండగా, ఖమ్మం రూరల్ మండలంలో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో భాగంగా అధికారులు లారీలోని సరుకును పరిశీలించి చూస్తే అక్రమ బియ్యం రవాణా చేస్తున్నట్టు తేలడంతో సీజ్ చేశారు. ఇదొక్క ఘటనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం దందా జోరుగా సాగుతున్నది. మిల్లర్లు, డీలర్లు మూకుమ్మడిగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే అక్రమార్కులకు అనుకూలంగా మారింది''

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సేకరించిన ధాన్యం, రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతున్నది. సివిల్ సప్లయ్ డిపార్ట్ మెంట్ అంటే మిల్లర్లకు, రేషన్ డీలర్లకు భయమే లేదు. దీంతో ఇష్టారీతినా అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం, రేషన్ షాపుల ద్వారా తీసుకునే బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. మరోవైపు పేదలకు అందాల్సిన బియ్యాన్ని డీలర్లు, మిల్లర్లు కుమ్మక్కై కొట్టేస్తున్నారు. రేషన్ డీలర్లేమో కార్డులు, టెక్నికల్ సమస్యలను చూపుతూ లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా వాటిని అక్రమంగా అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వాటిని కొని ప్రభుత్వ కోటా కింద అందజేస్తున్నది. మొత్తానికి రాష్ట్రంలో ప్రతి నెలా రేషన్ బియ్యంలో 75 శాతం వరకు మిల్లులకు చేరుతున్నది. అవే మళ్లీ రేషన్ షాపులకు వస్తున్నాయి. ఈ దందా ఇంతలా జరుగుతుంటే ప్రభుత్వం, అధికారుల పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడమే కారణాలనే విమర్శలు వస్తున్నాయి.


కోటా బియ్యం ముందుగా..

రాష్ట్రంలో ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్) కింద సివిల్ సప్లయ్ డిపార్ట్ మెంట్ ద్వారా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లకు ఇస్తుంది. మిల్లింగ్ అనంతరం సెంట్రల్ పూల్ కింద ఎఫ్ సీఐ, స్టేట్ పూల్ కింద తిరిగి మిల్లర్లు ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉంది. అయితే ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ముందుగానే మిల్లింగ్ చేసుకుని బయట మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. అనంతరం సీఎంఆర్ లెక్క కోసం రేషన్ బియ్యాన్ని చూపిస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోటా కింద ఇవ్వాల్సిన ధాన్యంపైన మాత్రం జాప్యం చేస్తున్నారు. మిల్లర్లకు జరిమానాలు విధించినా వాటిని బేఖాతరు చేస్తూ వ్యాపారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని..

మిల్లర్లు గ్రామాలు, మండల కేంద్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని బియ్యం దందా కొనసాగిస్తున్నారు. పీడీఎస్ బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాటిని పాలిష్ చేసి ఎఫ్ సీఐ, స్టేట్ పూల్ కు అప్పగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో 2019–20లో యాసంగి సీజన్ నుంచి ప్రస్తుత సీజన్ సీఎంఆర్ కింద పూర్తిస్థాయిలో బియ్యం రికవరీ కాకపోవడం కూడా ఇదొక కారణంగా కనిపిస్తున్నది. దీంతో రాష్ట్రంలో ధాన్యం, రేషన్ బియ్యం వ్యాపారం మిల్లర్లకు వరంగా మారింది.

తనిఖీలు లేవు, స్టాక్ లెక్క తేలట్లే..

ప్రభుత్వం సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యంపైనా, రేషన్ డీలర్లకు ఇస్తున్న బియ్యం స్టాక్ పైనా లెక్కలు తేలడంలేదు. దీంతో మిల్లర్లకు పీడీఎస్ బియ్యం ధాన్యం కాసులు కురిపిస్తున్నాయి. సీఎంఆర్ ఆలస్యంతో తనిఖీలు చేపడుతున్న అధికారులకు పూర్తిస్థాయిలో ధాన్యం లెక్కను మాత్రం తేల్చడంలేదు. మరోవైపు రేషన్ షాపుల్లో స్టాక్ అంశం ప్రయాసగా మారింది. ఇటీవల అశ్వారావుపేట ఏరియాల్లోని ఓ గ్రామంలో దాదాపు 86 క్వింటాళ్ల రేషన్ బియ్యం లెక్క తేలకపోవడంతో ఆ షాపును అధికారులు సీజ్ చేశారు.

లంచాలు ఇస్తుండడంతోనే..

మూడు సీజన్ల నుంచి రాష్ట్రంలోని సీఎంఆర్ లెక్కలు తేలడం లేదు. ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు ఇంతవరకూ ఆ రెండు మిల్లుల వ్యవహారంపై ఏమీ తేల్చలేదు. అధికారులకు మిల్లర్లు లంచాలు ఇస్తుండడంతోనే ధాన్యం, బియ్యం బ్లాక్ దందా జోరుగా సాగుతున్నది. సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటే వ్యాపారానికి అడ్డుకట్టే పడే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed