అదనపు ఇంజినీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఎదురుచూపులు

by Mahesh |
అదనపు ఇంజినీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఎదురుచూపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అదనపు ఇంజినీరింగ్ సీట్ల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి దరఖాస్తు చేశాయి. ఈ ఏడాది అదనంగా 50 వేల ఇంజినీరింగ్ సీట్లు కావాలని ఏఐసీటీఈకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ కాలేజీలు దరఖాస్తు చేశాయి. తెలంగాణ కాలేజీలు 20 వేల అదనపు సీట్ల కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. సీట్లు పెంచే ముందు తమ అనుమతి తీసుకోవాలని, అప్పుడే అనుబంధ గుర్తింపు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం .. ఏఐసీటీఈకి లేఖ రాసింది. మరో వైపు ఏ కారణాలు లేకుండా సీట్ల పెంపును తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. సీట్ల పెంపుపై ఏఐసీటీఈ అభ్యంతరాలు వ్యక్తం చేయనప్పటికీ..మౌలిక వసతుల విషయంలో మెలిపెట్టినట్టు సమాచారం. తెలంగాణలో ఇప్పటికే 58 శాతం ఇంజినీరింగ్ సీట్లు ... కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనే ఉన్నాయి. కొత్త సీట్లు కూడా ఇదే బ్రాంచీలో ఉండే అవకాశం ఉంది.

సౌత్ స్టేట్స్‌లో బీటెక్ సీట్లు అధికం

దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇంజినీరింగ్ సీట్లు అత్యధిక సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో 35 శాతం బీటెక్ సీట్లున్నాయి. దేశం మొత్తంలో 14.90 లక్షల బీటెక్ సీట్లుంటే... 3.08 లక్షల సీట్లతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. 1.83 లక్షల సీట్లతో ఏపీ రెండో స్థానంలో, 1.45 లక్షల సీట్లతో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. సీట్లు పెంచుకోవడంలోనూ ఈ మూడు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. మూడేళ్లుగా దేశంలో బీటెక్ సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2014 -15తో పోల్చితే సీట్ల సంఖ్య తక్కువగానే కనిపిస్తుంది. 2014-15లో దేశంలో 17.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, 2021-22 వరకు ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అమాంతం పెరిగింది.

ఐదేళ్లలో దేశంలో ఇంజినీరింగ్ సీట్ల వివరాలు

50 శాతం మూడు రాష్ట్రాల్లోనే..

24-25 విద్యా సంవత్సరంలో.. పెరిగిన బీటెక్ సీట్లలలో 50 శాతం సీట్లు దక్షిణాది రాష్ట్రాలవేనని తెలుస్తోంది. దేశం మొత్తమ్మీద చూస్తే 50 శాతం సీట్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే పెరిగాయి. తమిళనాడు 32.856 సీట్లు పెరగగా, ఆంధ్రప్రదేశ్‌లో 23.518, తెలంగాణలో 20.213 సీట్లు పెరిగాయి.

త్వరలో ఏఐసీటీఈ పరిశీలన ..

తెలంగాణలో 23 ప్రైవేటు కాలేజీలు వినూత్న బోధనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులను కాంబినేషన్‌గా అందించాలని నిర్ణయించాయి. అవసరమైన మౌలిక వసతులు తమకు ఉన్నాయని ఇప్పటికే పలు కాలేజీలు దరఖాస్తుల్లో పేర్కొన్నాయి. కాలేజీలను పరిశీలించేందుకు ఏఐసీటీఈ బృందం పర్యటించడానికి రెడీ అవుతుంది. జాతీయంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్(ఈవెనింగ్ బీటెక్) కోర్సు నిర్వహణకు 400-500 విద్యా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ కాలేజీల్లో దాదాపు 40 వేల నుంచి 50 వేల సీట్లు పెరిగాయి. ఈ ఏడాది 2,906 కాలేజీలకు ఏఐసీటీఈ గుర్తింపునిచ్చింది. వాటిలో 1,256 కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. జాతీయంగా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్ల భర్తీ నిష్పత్తి ఈ విధంగా ఉంది. 2021-22 లో 72 శాతం, 2022-23 వచ్చే సరికి 81 శాతానికి పెరిగినట్లు సమాచారం.

Advertisement
Next Story