ధరణి సమస్యల పరిష్కారం.. CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

by Disha Web Desk 4 |
ధరణి సమస్యల పరిష్కారం.. CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? అసలు ఇది ఎవరి చేతిలో ఉన్నది? భూ రికార్డులకు బాధ్యత ఎవరిది? ప్రైవేటు కంపెనీ చేతిలో ఎలా పెట్టారు? టెండర్లు పిలిచారా? ఇన్నాండ్లుగా ఏం జరిగింది? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం సచివాలయంలో ధరణి పోర్టల్ లోపాలపై అధికారులు, నిపుణులు, ఉద్యోగ సంఘాలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌పై తనకు ఉన్న సందేహాలన్నింటినీ తీర్చుకునేందుకు ప్రశ్నల పరంపరను కొనసాగించారు. అసలు ఇది ఎవరి చేతిలో ఉన్నదని మొదలు పెట్టి పెండింగులో ఉన్న అప్లికేషన్ల వివరాల వరకు ఆరా తీశారు.

టెండర్ లేకుండా అప్పగించారా? ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టడం ద్వారా భూముల డేటాకు నష్టం ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసలు ఈ దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? నాలుగు సార్లు రిజెక్ట్ చేస్తే ఆ ఫీజంతా ఎవరికి వెళ్తుంది? రిజెక్ట్ చేసినప్పుడు ఫీజు వాపసు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకునే వీలున్నదా? అని అధికారులను అడిగారు. అసలీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని అడిగి తెలుసుకున్నారు.

భూ భారతి ప్రాజెక్టు ఏమైంది? అది ఎక్కడి దాకా వచ్చి ఆగింది? కేంద్రం విడుదల చేసిన రూ.83 కోట్లు ఎక్కడికి పోయాయి? అన్న అనేక సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సమీక్ష నడిచింది. ఈ నాలుగేండ్ల కాలంలో క్లాసిఫికేషన్ ఛేంజ్ చేసిన అన్ని వివరాలు, అసైన్డ్, భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు ఇచ్చిన ఎన్వోసీలు వంటి పూర్తి వివరాలు సమర్పించాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. త్వరలోనే మరో సారి కూర్చొని సమగ్రంగా చర్చిద్దామని సూచించారు.

సమస్యల ఏకరవు..

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాన్న విషయాలను నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. వాటి పరిష్కార మార్గాలను కూడా చెప్పారు. కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పరిపాలన వ్యవస్థను తిరిగి పునరుద్దరించాలని, గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై కోర్టు కేసులను కూడా ప్రస్తావించారు.

అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగేండ్ల కాలంలో ధరణి పోర్టల్ ద్వారా లక్షలాది దరఖాస్తులను పరిష్కరించారు. ఐతే ఇప్పటికీ 2.31 లక్షలు పెండింగులోనే ఉన్నాయని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ వివరించడం గమనార్హం. త్వరలోనే ధరణి పోర్టల్, భూ సమస్యలపై కమిటీ వేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో అధికారులతో పాటు నిపుణులు కూడా ఉండొచ్చునని అధికారులు తెలిపారు.

ఈ కమిటీ ద్వారా సమగ్ర అధ్యయనం చేసి.. ఆ తర్వాత శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేయనున్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, భూమి సునీల్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్, ధరణి సమస్యల పరిష్కార వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed