ఉచిత ఎరువుల హామీకి ఆరేండ్లు కంప్లీట్! దేశం ఆగమయ్యేది ఎప్పుడు?

by Disha Web Desk 4 |
ఉచిత ఎరువుల హామీకి ఆరేండ్లు కంప్లీట్! దేశం ఆగమయ్యేది ఎప్పుడు?
X

‘ఇయ్యాల నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశం దేశమే ఆగమైతది. కదుల్తది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు. నాకు తెలియదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే 24-26 లక్షల టన్నుల ఎరువులను వందకు వంద శాతం ఫ్రీగా సప్లయ్ చేస్తం. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆరేడు వేల కోట్లు ఖర్చయితది. ఏం పోతది? రైతులకు ఇస్తే తప్పా? ఇవ్వకూడదా? కడుపు నిండా బ్రహ్మాండంగా ఇచ్చుకుందాం.

– ఏప్రిల్ 13, 2017న నిజామాబాద్ జిల్లా రైతాంగంతో ప్రగతి భవన్ (జనహిత)లో జరిగిన మీటింగులో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది.

దిశ, తెలంగాణ బ్యూరో :

‘అబ్ కీ బార్ – కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతులకు రోల్ మోడల్‌గా చూపిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తూ రైతుబంధు, రైతుబీమా స్కీమ్‌లను పదేపదే ప్రస్తావిస్తున్నారు. కానీ, ఆరేండ్లుగా అమలుకు నోచుకోలేకపోతున్న ఉచిత ఎరువుల హామీపై మాత్రం మౌనం వహిస్తున్నారు. ఉచిత ఎరువులపై ఫస్ట్ టర్మ్‌లోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. యూరియా, డీఏపీ, ఎన్‌పీకే లాంటివన్నీ ఉచితంగానే ఇస్తామని ప్రకటించారు. ‘ఇగ మేం మంచిగైనం. సగం ఖర్చు మేమే పెట్టుకోడానికి ఇబ్బందేం లేదు.’ అని రైతులు అనేంతవరకు ప్రభుత్వం ఫ్రీగానే ఎరువులు సప్లయ్ చేస్తుందని భరోసా ఇచ్చారు. విత్తనాలు, పురుగుమందులు మాత్రం ఫ్రీగా ఇవ్వబోమని, ఇప్పుడున్న సబ్సిడీ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండో టర్మ్ కంప్లీట్ కాబోతున్నా.. ఇప్పటికీ ఆ హామీ అమల్లోకి రాలేదు.

రైతు సంఘాలు ఏర్పడాలని..

ఒక్కో ఎకరానికి రెండు లేదా మూడు బస్తాల చొప్పున యూరియాను ఫ్రీగా సప్లయ్ చేస్తామన్న కేసీఆర్.. ఈ సప్లయ్ నిజాయితీగా ఇంప్లిమెంట్ కావాలంటే గ్రామ స్థాయిలో రైతు సంఘాలు ఏర్పడాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయ శాఖే ఇందుకు చొరవ తీసుకోవాలని పక్కనే ఉన్న అప్పటి ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి సూచించారు. ‘లంగ పని చేయడానికి ప్రభుత్వంలో ఇబ్బంది లేదు. మంచి పని చేయాలంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. మూడు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకనే గ్రామ రైతు సంఘాలు ఏర్పడాలని చెప్తున్న.’ అని కేసీఆర్ వివరించారు.

65 లక్షల మంది రైతులు..

ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది రైతులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.84 కోట్ల ఎకరాలకు పెరిగిందని, రెండు సీజన్లు కలుపుకుంటే సుమారు 3 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఉచిత యూరియా హామీ ఇచ్చేటప్పటికి 55 లక్షల మంది రైతులు ఉంటే, ఈ ఆరేండ్ల కాలంలో మరో 10 లక్షల మంది పెరిగారు. సాగు విస్తీర్ణం పెరగడంతో యూరియా, ఎరువుల వినియోగం కూడా పెరిగింది. ఉచిత ఎరువులపై సీఎం 2017 నాటి లెక్కల ప్రకారం గరిష్టంగా 26 లక్షల టన్నులు అవసరమవుతుందని వివరించారు. ఇప్పటి పరిస్థితుల్లో ఈ మోతాదు ఇంకా ఎక్కువే ఉంటుంది.

నిధుల్లేకేనా..!

రైతుబంధు పేరుతో ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. ఈ ఏడాది జూన్ 26 నుంచి రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఇందుకోసం నిధులను విడుదల చేసినా ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమచేసింది. మొత్తం టార్గెట్ రూ.7,720 కోట్లు కాగా, ఇందులో సుమారు రూ.4,400 కోట్ల మేరకే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా రూ.3,300 కోట్ల మేర పెండింగ్‌లో పడింది. సర్కారు దగ్గర నిధుల్లేని కారణంగానే తక్కువ భూమి ఉన్న రైతులకు ముందుగా డిపాజిట్ చేసి మిగిలినవారికి దశలవారీగా ఇచ్చేందుకు ప్లాన్ చేసిందని అధికారుల సమాచారం.

ఉత్తిదేనా?

ముఖ్యమంత్రి గొప్పగా ప్రకటించి అమల్లోకి తెచ్చిన పథకాల కోసమే నిధుల్లేక అరకొరగా అమలవుతున్న పరిస్థితుల్లో, ఆరేండ్ల కింద ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ ఉనికిలోకి వచ్చే అవకాశమే లేదనేది అధికారుల వాదన. ఎలాగూ నాలుగైదు నెలల్లో రెండో టర్ము కూడా పూర్తవుతున్నందున ఇక ఈ హామీ గురించి తల్చుకుని ప్రయోజనం లేదని రైతులు ఒక సాధారణ అభిప్రాయానికి వచ్చారు. ‘కేసీఆర్ మాట ఇస్తే తల నరుక్కుంటడుగానీ..’ అని ఆయన పదేపదే చెప్పే డైలాగునే ఇప్పుడు రైతులు గుర్తుచేసుకుంటున్నారు.

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్న సమయంలో ఆరేండ్ల కింద ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ సంగతేందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఉచిత ఎరువులు ఉత్తమాటేనని, ఆరేండ్ల అనుభవమే ఇందుకు నిదర్శనమంటూ ప్రజలు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు సైతం పదేపదే ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై సమాధానం చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి గ్రామాలకు వచ్చే అధికార పార్టీ నేతలను, మంత్రులను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే స్లోగన్‌ను అందుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రజలకు స్పష్టత ఇస్తున్నది.

ఇవి కూడా చదవండి: రైతులకు గాలం వేసేందుకు కాంగ్రెస్ స్కెచ్.. ఒకే సారి రెండు లక్షలు రుణమాఫీ!

Next Story

Most Viewed