పీసీసీ చీఫ్‌గా సీతక్క? వాళ్లందరికీ చెక్ పెట్టేలా ప్లాన్!

by Rajesh |
పీసీసీ చీఫ్‌గా సీతక్క? వాళ్లందరికీ చెక్ పెట్టేలా ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/వరంగల్ బ్యూరో : మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి దక్కనుందా? తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారా? సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్‌కు సూచించనున్నారా? ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీభవన్‌లో జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిని దాదాపు పది మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. చివరికి ఎవరికి చాన్స్ లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగానూ కొనసాగుతున్నందున.. పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాలన్నది ఏఐసీసీ ఉద్దేశం. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా?.. లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా?.. అనే విషయంపై క్లారిటీ రాలేదు.

మూడేండ్ల కంప్లీట్

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల 21 నాటికి మూడేండ్లు కంప్లీట్ అవుతాయి. కేవలం ఐదుగురు శాసనసభ్యులున్న పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంతో ఏఐసీసీ దగ్గర ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే చాన్స్ ఉన్నది. పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని, ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని, ఏఐసీసీ అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహరమని సీఎం రేవంత్ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ స్థాయిలో యాక్టివ్‌గా పనిచేసే లీడర్‌కు అవకాశాలుంటాయన్నది సీనియర్ నేతల అభిప్రాయం.

ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్ చేయడం, మరోవైపు పార్టీలోని భిన్నాభిప్రాయాలు ఉన్న నేతల విశ్వాసాన్ని చూరగొనడం, సీనియర్లతో సఖ్యతగా మెలగడం, గ్రూపు రాజకీయాలను సమర్ధవంతంగా డీల్ చేయడం... ఇలాంటి అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ ఎంపికపై ఏఐసీసీ స్పష్టతకు వస్తుంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనా పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నారు. ఏఐసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న మాజీ ఎంపీ మధుయాష్కీ‌గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పార్టీకి లాయల్‌గా ఉన్న అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కొందరు ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తుండగా మరికొందరి పేర్లను పీసీసీ నేతలు ఏఐసీసీ లీడర్లకు వివరిస్తున్నారు.

ఏఐసీసీ నుంచి సానుకూలం?

ఒకవైపు పాలన, మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ కనుసన్నల్లో ఉంటాయని, ఏఐసీసీ సైతం ఈ ప్రతిపాదన పట్ల ఒక మేరకు సానుకూలంగానే స్పందించవచ్చన్న అభిప్రాయాలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను, పార్టీకి లాయల్‌‌గా ఉండడం, అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం... ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నది. సీఎంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ చీఫ్‌గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్న జనరల్ టాక్ పార్టీలో ఉన్నది.

ఆ కారణంగానే ఆ పోస్టును ఆశిస్తున్నవారిలో ఎక్కువ మంది ఆ వర్గాలకు చెందినవారే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారనే చర్చ సైతం పార్టీ నేతల్లో వినిపిస్తున్నది. పీసీసీ చీఫ్ నియామకం కన్నా ముఖ్యమైన అంశాలు పార్టీ మదిలో చాలా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏఐసీసీ దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చనే వాదన వినిపిస్తున్నది. ప్రకటన ఎప్పుడొచ్చినా ఎవరిని వరిస్తుందన్నదే రాష్ట్ర నాయకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఎలాగూ ఒకటి, రెండు నెలల్లో కేబినెట్ విస్తరణ సైతం ఉండడంతో ఒకేసారి పీసీసీ చీఫ్ మార్పు అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది.

కేబినెట్‌లోకి వెడ్మ బొజ్జు!

ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్న వెడ్మ బొజ్జుకు కేబినెట్‌లో చోటు దక్కే చాన్స్ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా మహిళలు పని చేసినా తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రానున్నది. ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ప్రతిపాదించినా, హైకమాండ్ ఖరారు చేసినా ఒకవైపు ఆదివాసీగా, మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవ్వరూ సాహసించకపోవచ్చనేది కొందరి భావన. రేవంత్‌రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. ఆయనతో పాటే మంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడనే సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు ప్రస్తావనకు రావడం విశేషం.

Next Story

Most Viewed