- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్షేమంలో సింగరేణి సరికొత్త అధ్యాయం
గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో ప్రవేశపెట్టిన ఉచిత ప్రమాద బీమా పథకం 40 మందికి పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో ప్రవేశపెట్టిన ఉచిత ప్రమాద బీమా పథకం 40 మందికి పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించింది. సింగరేణిలో కార్మికుల సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రమాదాల వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా కుంగిపోయి ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితుల్లో ఆయా కుటుంబాలను ఈ ఉచిత ప్రమాద బీమా పథకం ఆదుకుంటోంది. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి యాజమాన్యం దేశంలో తొలిసారిగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసింది. 2024లో సీఎం రేవంత్‌రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా బీమా రంగంలో ఒక విప్లవాత్మక చర్యగా మారింది.
ఒక్క రూపాయి చెల్లించకుండానే..
సింగరేణి ఉద్యోగులు కార్పొరేట్ శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సీస్ (ఐఓబీ) బ్యాంకులు ప్రమాద బీమా పథకం కింద రూ.1.25 కోట్లను చెల్లించడానికి సింగరేణితో ఒప్పందం చేసుకొని అమలు చేస్తున్నాయి. అలాగే సింగరేణిలో అత్యధిక కార్మికులు శాలరీ ఖాతాలు కలిగి ఉన్న ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంకులు రూ.1 కోటి ప్రమాద బీమా స్కీంను అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రమాద బీమా పథకానికి ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఒప్పందం జరిగింది. రెండేళ్ల కాలంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 32 మందికి సుమారు రూ.28 కోట్లను చెల్లించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 13 మందికి సుమారు రూ.13 కోట్లు అందాయి.
కుటుంబాన్ని ఆదుకున్న బీమా..
చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు పెండ్రి లత. భర్త రంజిత్ కుమార్ సింగరేణిలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో ఆయనపైనే ఆధారపడిన భార్య లత, తల్లి, నెలరోజుల కుమారుడు ఒంటరివారయ్యారు. అయితే సింగరేణితో ఒప్పందం ఉన్న బ్యాంక్‌లో శాలరీ ఖాతా ఉండటంతో వారికి బీమా పరిహారం రూ. కోటి అందింది. ఇంటిపెద్దను తిరిగి తీసుకురాలేకపోయినా ఆయన నెరవేర్చే బాధ్యతను ఈ సొమ్ము ద్వారా తీర్చగలిగే అవకాశం కలిగిందని, తనకు, తన కుమారుడి భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పథకమే లేకపోతే తమ భవిష్యత్తు అంధకారమయ్యేదని వాపోయారు.
సహజ మరణమైనా.. వికలాంగులైనా..
ప్రమాదంలో మృతి చెందినవారికే కాకుండా కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి లేదా ప్రమాదాల్లో ఇతర అవయవాలు పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందినప్పటికీ బ్యాంకులు ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నాయి. అలాగే సహజ మరణానికి కూడా రూ.10 లక్షల ఉచిత బీమా పథకాన్ని అమలు చేయడానికి ఎస్బీఐ, యూబీఐ, ఐఓబీ, పీఎన్బీ.. సింగరేణితో ఒప్పందం చేసుకున్నాయి. ఈ పథకానికి అనుబంధంగా ఎస్బీఐ సహకారంతో నామమాత్రపు ప్రీమియంతో రూ.50 లక్షల ఆరోగ్య బీమాను కూడా అమలు చేస్తుండటం మరో విశేషం.
సింగరేణి బాటలో..
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో మొదలైన ఈ పథకాన్ని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మొదటగా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో అమలు చేశారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేశారు. ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ఇప్పుడు అమలవుతున్న ప్రమాద బీమా పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ చర్యే ఒక దిక్సూచిగా మారడటం విశేషం.






