శివరాత్రికి సింగారించుకున్న సిద్ధులగుట్ట..

by Rajesh |
శివరాత్రికి సింగారించుకున్న సిద్ధులగుట్ట..
X

దిశ, ఆర్మూర్: అలనాడు ప్రాచీన కాలంలో నవ నాథులకు తపోవనమైన ఆర్మూర్‌లోని నల్లటి రాళ్లే కాలక్రమేనా నవసిద్ధుల గుట్టగా కీర్తికెక్కింది. నవ నాథులకు తపోవనమైన సిద్ధులగుట్ట సహజ అందాల తోరణం ప్రకృతి సోయగల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. నల్లటి బండరాళ్లతో కళకళలాడే ఈ గుట్ట ఇప్పుడు పర్యాటక సొగసులను అద్దుకుంది.

అనాదిగా విశిష్ట చరిత్ర కలిగిన ఈ నవనాథ సిద్దుల‌ గుట్టపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని విశేషంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులను చేయిస్తున్నాడు. దీనికి తోడు నవసిద్ధుల గుట్ట ఆలయ కమిటీ ప్రతినిధులు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుట్టపైన అన్ని హంగులతో సకల ఏర్పాట్లను చేయిస్తున్నారు.

నవనాథులు నడయాడిన నల్లటి బండరాళ్ల గుట్టయే.. నేడు సిద్దులగుట్టగా.. ప్రసిద్ధి చెందింది. సహజ అందాలను పర్యాటక సొగసులను ఈ సిద్ధులగుట్ట సంతరించుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రత్యేక కృషితో సిద్దులగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేత భారీగా నిధులు మంజూరు చేయించి గుట్టపై నవ మందిరాల నిర్మాణం‌తో పాటు, రోడ్డు రవాణా సౌకర్యం, మౌలిక వసతులను సమృద్ధిగా ఏర్పాటు చేయడంతో నవసిద్ధుల గుట్ట నిత్యం భక్తజనంతో అలరారుతోంది.

సిద్ధుల గుట్టపై అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారీగా నిధులను మంజూరు చేయించారు. సిద్దుల గుట్టకు సుమారు రూ.10 కోట్ల నిధులను మంజూరు చేయించి అధునాతనంగా సౌకర్యంగా ఘాట్ రోడ్డును నిర్మాణం చేయించారు. రూ.15 లక్షల నిధులతో గుట్ట‌పైన చిల్డ్రన్ పార్క్‌ను సైతం ఏర్పాటు చేయించారు.

అయ్యప్ప మందిర భోజనశాల రామాలయ ఉత్సవాల షెడ్డు నిర్మాణ పనులకు రూ.4.30 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేయించి రూ.10 లక్షల నిధులతో భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలను గుట్టపైన నిర్మాణం చేయించారు. భక్తులు, వివిధ సంఘాల సహకారంతో గుట్టపై అయ్యప్ప మందిరం, సహస్రార్జున మందిరం, ధ్యాన మందిర నిర్మాణ పనులను చురుగ్గా పూర్తి చేయిస్తున్నారు.

సొంత నిధులతో అన్న ప్రసాదం

ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ప్రతి సోమవారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సొంత నిధులతో ప్రతి సోమవారం సిద్ధిలగుట్ట పైన అన్నప్రసాదం చేయిస్తున్నారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సిద్ధులగుట్ట‌పైన ఇప్పటివరకు సుమారు 52 వారాలుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సొంత నిధులను వెచ్చించి భక్తుల కోసం చేయిస్తున్నారు.

ఆర్మూర్ పట్టణానికి తలమానికమైన ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్టను రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక ప్రాంతంగా రూపాంతరం చెందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొంటున్నారు. నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ సభ్యులు శివరాత్రి సందర్భంగా సిద్దులగుట్టను ఆకర్షణీయంగా సింగారిస్తున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

నూతనంగా నిర్మించిన మెట్ల మార్గం గుండా మెట్లపై పర్మినెంట్ షెడ్లను వేసి భక్తులకు ఎండ తాగకుండా ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. మెట్ల మార్గం గుండా భక్తులకు దాహార్తి తీర్చడం కోసం మంచినీటి వసతులను ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా సిద్ధుల గుట్ట పైన ఘాట్ రోడ్డు మెట్ల దారుల గుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు సకల సౌకర్యాలను భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు.

Next Story

Most Viewed