కరీంనగర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. బ్లడ్ గ్రూపు రిపోర్టు తప్పుగా ఇవ్వడంతో..

by Rajesh |
కరీంనగర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. బ్లడ్ గ్రూపు రిపోర్టు తప్పుగా ఇవ్వడంతో..
X

దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం పేషెంట్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా ఓ మహిళ రక్తస్రావం కావడంతో చికిత్స కోసం కరీంనగర్ మాతశిశు కేంద్రంలో చేరింది. రక్త పరీక్షలు నిర్వహించి రక్తం తక్కువగా ఉన్నదని గుర్తించిన ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించి బ్లడ్ గ్రూపును ‘ఓ’పాజిటివ్‌కు బదులుగా ‘బీ’పాజిటివ్‌గా ధృవీకరించారు. అయితే అనుమానం వచ్చిన బంధువులు నగరంలోని ఓ ప్రయివేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించగా వారు ‘ఓ’ పాజిటివ్‌గా ధృవీకరించారు. దీంతో సదరు పేషెంట్ బంధువులు వామ్మో ప్రభుత్వ ఆసుపత్రి అంటు తృటిలో ప్రాణాలు కాపాడుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ మాతాశిశు సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పేషెంట్‌కు ప్రాణాపాయం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సుంకపాక మౌనిక అనే మహిళ తీవ్ర అనారోగ్య కారణంగా రక్త స్రావంతో చికిత్స కోసం ఈ నెల

25న నగరంలోని మాతశిశు ఆసుపత్రిలో చేరింది. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని గుర్తించి ఆదివారం పేషెంట్ కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. తక్షణమే రక్తం ఎక్కించాలంటూ సూచించారు. వెనువెంటనే బ్లడ్ గ్రూప్ నిర్దారణ కోసం మాతా శిశు కేంద్రం లోని ల్యాబ్ కు రక్తనమూనలను సేకరించి పంపించారు. రక్త నమూనాలను పరీక్షించిన ల్యాబ్ సిబ్బంది ‘బి’ నెగటివ్ బ్లడ్ గ్రూపుగా రిపోర్టు ఇచ్చి రక్తం సమకూర్చుకోవల్సిందిగా సూచించారు. అత్యవసరంగా రక్తం ఇచ్చేవారిని సమకూర్చుకోవలని హాస్పిటల్ సిబ్బంది ఆదేశించటంతో పేషెంట్‌కు సంబంధించిన బంధువులు ‘బి’ నెగటివ్ బ్లడ్ కోసం పలువురిని కోరగా ఎవరు ముందుకు రాలేదు.

‘బి’నెగటివ్ బ్లడ్ ఎంతకు దొరకక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించారు. సదరు ప్రయివేటు ల్యాబ్ రిపోర్టులో ‘ఓ’ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రిపోర్టులు చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో ఆగ్రహించిన పేషెంట్ కుటుంబ సభ్యులు మాతా శిశు హాస్పిటల్ ల్యాబ్ సిబ్బందిని నిలదీశారు. దీంతో అప్రమత్తమయిన ల్యాబ్ సిబ్బంది తప్పుడు రిపోర్ట్ మార్చి సరిచేసి ఇచ్చారు. పేషెంట్ కుటుంబ సభ్యులు ఆ సమయంలో ల్యాబ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉమ అనే ఉద్యోగి వద్దకు వెళ్లి వివరణ కోరగా దూరుసుగా ప్రవర్తించిందన్నారు. నిరుపేదలమైన తాము ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లలేకనే మాత శిశు ఆసుపత్రిలో చేరామని తెలిపారు.

ల్యాబ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ పేషెంట్‌కి రక్తం ఎక్కిస్తే అన్యాయంగా ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు వాపోయారు. తమకు అనుమానం వచ్చి ప్రయివేటు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేపించాం కాబట్టే తమ పేషెంట్‌ని కాపాడుకున్నమన్నారు. లేకుంటే తమ కుటుంబంలో ఒకరిని కోల్పోయేవాళ్ళమని కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవ్వరికి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed